Tuesday, December 17, 2024

వస్తోంది.. రైతు ఉప్పెన

- Advertisement -
- Advertisement -

మోడీ సర్కార్ కొట్టుకుపోవడం ఖాయం

మిమ్మల్ని ఆ దేవుడు కూడా రక్షించలేడు
మీ విధానాలతో భారతమాత గుండె గాయపడింది

18 నెలల్లో బిజెపి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారు మోడీ ఫాసిస్టు ప్రధాని సంస్కరణ పేరిట
కేంద్రం దగా హస్తిన నిర్ణయంతో తెలంగాణకు నష్టం వ్యవసాయం, విద్యుత్ రంగాలపై కేంద్రం కన్ను
అసమర్థ విధానాలతో దుర్మార్గమైన ఫలితాలు కేంద్ర మంత్రి అవహేళన చేసిండు సంస్కరణలు అమలు
చేస్తే ఉద్యోగాలు ఊడుతయ్.. విద్యుత్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టాలి శాసనసభలో సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని మోడీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభమయ్యిందని, మరో 18 నెలలో బిజెపి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. సోమవారం శాసనసభలో విద్యుత్ సంస్కరణల బిల్లుపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి కెసిఆర్ బిజెపి, ప్రధాని మోడీ తీరును ఎండగట్టారు. ప్రజాస్వామ్యం లో అధికారం అంటే బాధ్యత అని, అందుకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహారిస్తోందని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందని, విభజన చట్టంలోని అనేక అంశాల్లో అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. సీలేరు పవర్ ప్రాజెక్ట్ సహా 7 మండలాలను లాగేసుకున్నారని, కేంద్ర కేబినెట్ తొలి భేటీలోనే మోడీ ప్ర భుత్వం తెలంగాణ గొంతు నులిమిందని, మో డీకి ఎన్నిసార్లు చెప్పినా కర్కశంగా వ్యవహారించారని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ఫాసిస్టు ప్రధాని అని ఆనాడే చెప్పానని, విద్యు త్ అంశం ఉమ్మడి జాబితాలో ఉందని, తలసరి విద్యుత్ వినియోగం ప్రగతి సూచికగా ఉం టుందని కెసిఆర్ పేర్కొన్నారు.

75 సంవత్సరాల స్వాతంత్య్ర భారతదేశంలో తలసరి విద్యుత్ వినియోగం 1,255 యూని ట్లు ఉండడం సిగ్గుచేటని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. రైతు వద్దకు వెళ్లి పలకరించే పనిలేకుండా ఎన్ని హార్స్‌పవర్ పెట్టుకున్నవ్ అని అడిగే పని లేకుండా రాష్ట్రంలో రైతులకు విద్యు త్ ఇస్తున్న మాట నిజంకాదా అని మోడీని కెసిఆర్ ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చా క ఐదున్నర నెలల్లోనే అహోరాత్రులు పని చేసి సమస్యను పరిష్కరించామని, ప్రభాకర్‌రావు ట్రాన్స్‌కో, జెన్‌కో చైర్మన్‌గా రెండోసారి పని చేయనని, వేరేవాళ్లను పెట్టాలని చెబితే అనుభవం అవసరం అని చెప్పాం, ఎక్కడెక్కడో ఉన్న వెతికి వారిని తీసుకువచ్చి, పదవీ విరమణ చేస్తున్న సమయంలో వదిలి పెట్టి వెళ్లొద్దని తాను వ్యక్తిగతంగా కోరానని సిఎం పేర్కొన్నారు. వాళ్లను సర్వీసులో ఇచ్చి ఇప్పటి వరకు దానిని విజయవంతంగా నడుపుతున్నానని, ఎన్ని బాధలు, కష్టాలు వచ్చినా అవసరమైతే కొ న్ని రాయితీలు, ఇతర ఖర్చులు తగ్గించుకుందామని సూచించానని ఆయన తెలిపారు.

తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 2,126 యూనిట్లు

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన సమయంలోనే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చింది. అప్పు డు రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 970 యూనిట్లు, జాతీయ విద్యుత్ తలసరి వినియోగం 957 యూనిట్లు. ఈ రోజు ఎనిమిదే ళ్లు అక్కడ కేంద్రం పరిపాలించింది. ఇక్కడ టిఆర్‌ఎస్ పరిపాలించింది. ఇప్పుడు తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 2,126 యూనిట్లకు పెరిగింది. అంటే దాదాపుగా 1156 యూనిట్లు పెంచాం. ఇది మా లెక్క కాదు. కేంద్రం ఎలక్ట్రిసిటీ అథారిటీ చెప్పింది. ఘనత వహించిన మోడీ, ఇప్పుడు రఘునందర్‌రావు పొగిడిన ప్రజల కోసం, దేశం కోసం, దేశాభివృద్ధి కోసం పని చేసిన కేంద్రం ఇప్పటికీ పెంచింది తెలంగాణను కలుపుకొని 1,255 యూనిట్లు మాత్రమే. కేంద్రం ఎనిమిదేళ్లలో పెంచింది 298 యూనిట్లు కాగా, జాతీయ తలసరి విద్యుత్ వినియోగం 1,255 యూనిట్లు ఉండడం సిగ్గుచేటు, బాధాకరమని కెసిఆర్ పేర్కొన్నారు.

అసలు మీటర్లు పెట్టే కథేంది?

‘ఐస్‌లాండ్ అనే చిన్న దేశం తలసరి విద్యుత్ వినియోగం 51,696 యూనిట్లు. అమెరికా ఫర్ క్యాపిటా పవర్ యూనిలైజేషన్ 12,154 యూనిట్లు, జపాన్ 7150, చైనా 6312, పక్కనున్న భూటాన్ 3126 యూనిట్ల పవర్ క్యాపిటా ఉంది. 140 దేశాలను సర్వే చేస్తే ప్రచురితస్తే మనది 104వ స్థానం. ఇది విశ్వగురు సాధించిన మహత్తర ఫలితమని సిఎం కెసిఆర్ మోడీని దుయ్యబట్టారు. అసలు మీటర్లు పెట్టే కథేంది? మీటర్లు పెడితే 98 లక్షల మంది కుటుంబాలకు ఇబ్బందులు కలుగుతాయి. భట్టి విక్రమార్క చెప్పినట్లు దళితులు, గిరిజనులు, రైతులు, ల్రాండీలు నడిపే రజకులు, క్షౌర శాలల నాయీ బ్రాహ్మణులు, టెక్స్‌టైల్, పౌల్ట్రీ పరిశ్రమలు, కుంటు పడుతున్న కొద్దిపాటి పరిశ్రమలకు కొద్దిపాటి సబ్సిడీతో కరెంటు ఇస్తున్నాం. రాష్ట్రంలో కేంద్రం తీసుకువచ్చిన సంస్కరణలు యధాతథంగా అమలు చేస్తే తక్షణమే వీటికి మీటర్లు పెట్టాలే. ఈ దేశంలో విద్యుత్ రంగంలో 24లక్షల మంది పని చేస్తున్నరు. వారి ఉద్యోగాలు పోతాయ్.. డౌటే లేదు తాను చెప్పేది గ్యారెంటీ అని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు.

రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు.

కేంద్రం ఇచ్చిన గెజిట్‌లో మోటార్లకు మీటర్లు పెట్టాలని ఉంది. మీటర్లు లేకుండా ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వొదని బిల్లులో చెప్పారు. విద్యుత్ సంస్కరణల ముసుగుతో రైతులను దోచుకునే ప్రయత్నం జరుగుతోంది. కేంద్రం తెస్తున్న విద్యుత్ సంస్కరణ అందరికీ తెలియాలి. విద్యుత్ బిల్లును బిజెపి ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఎలా సమర్ధిస్తున్నారో ఆలోచించుకోవాలి. రఘునందన్‌రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. పార్లమెంట్ ప్రతిపక్ష సభ్యులపై మూక దాడులు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు. ప్రధాని మోడీ హయాంలోనే కేంద్ర ప్రభుత్వంలో ఏదైనా మంచి పని జరిగిందా? అని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రశ్నించారు. అప్రజాస్వామికంగా రాజ్యాంగ సంస్థలను దుర్వియోగంచేస్తూ. దౌర్జన్యంగా వ్యవహారిస్తూ రాజ్యాంగ సంస్థలను కూలదోస్తున్నరు. ఇప్పటికీ పది రాష్ట్రాలను కూల్చారు. సిగ్గు ఉండాలి చెప్పుకోవడానికి అని సిఎం కెసిఆర్ మోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో మూడు తోకలు లేవు

తెలంగాణలో మూడు తోకలు లేవు, మమ్మల్ని కూలగొడతరా, ఎలా కూలగొడుతారు?.ఈ మాటలు ఎవరు మాట్లాడుతారు. ప్రజలకు అర్థం కాదా దీని మూలం ఎక్కడుందని, దేనిని కొట్టాలో ప్రజలకు తెలియదా? ప్రతి రాష్ట్రంలో ఇవే పెడబొబ్బలు. తమిళనాడులో స్టాలిన్ గెలిచిండు. అక్కడ బిజెపి అధ్యక్షుడు తమిళనాడులో ఏక్‌నాథ్ షిండే వస్తడని మాట్లాడుతున్నడు. షిండేలు ఎవరి కోసం, ఎవరిని బెదిరిస్తరు? ఎవరి గొంతు నొక్కుదామనుకుంటున్నారు? అందరు ఒకటై మీ గొంతు పడితే ఎక్కడికి పోతరు? ఇంతపెద్ద సువిశాల దేశంలో ఎన్ని అనుభవాలు, ఎన్ని సందర్భాలున్నాయ్ లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ తిరుగుబాటు చేసి పిలుపునిస్తే 40, 50 రోజుల్లోనే జైలులో పుట్టిన జనతా పార్టీ జెండా ఎగుర వేసింది. అది పవర్ ఆఫ్ డెమొక్రసీ అని సమయం వచ్చినప్పుడు ప్రజలే చూసిస్తారని ఆయన తెలిపారు.

ద్రవ్యోల్బణం పెరుగుతోంది..

ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇంతకు ముందెన్నడూ ఏ ప్రధాని హయాంలో లేని విధంగా రూపాయి పతనమవుతోంది. విపరీతంగా నిత్యావసరాల ధరల పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట దిగజారుతుంది. అంబాసిడర్లను పిలిచి బెదిరింపులకు దిగుతున్నారు. బ్లాక్ మనీ తెస్తామని చెప్పి ఒక్క పైసా తేలేదు. 20లక్షల ఉద్యోగాలు దేశంలో ఖాళీగా ఉన్నాయ్. ఓ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టారా? పేదలను ఆదుకున్నారా? సైన్యం రిక్రూట్‌మెంట్‌లో ఇష్టం వచ్చినట్లు మార్పులు చేస్తే దేశం అట్టుడికి పోయింది. రైల్వే స్టేషన్ల ఖాళీపోయాయి. అప్పటికప్పుడు పోలీసులతో అణచివేయొచ్చు. కానీ యువకుల గుండెల్లో రగిలే మంటలను ఆర్పగలుగుతారా? అవి మిమ్మల్ని దహించయా? ఎందుకీ అహంకారం?. కరెంట్ సంస్కరణలపై గోల్‌మాల్ చేసి చెబుతున్నారు. దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి ఎంత ఉందో తెలియాలి. దేశంలో విద్యుత్ శక్తి దేశంలో ఉందని, దానిని ఇచ్చే తెలివి కేంద్రానికి లేదు. ఇది ఈ దేశ దురదృష్టమని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

స్థాపిత విద్యుత్ శక్తి సామర్థ్యం 4,04,178 మెగావాట్లు

సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ లెక్కల ప్రకారం దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి సామర్థ్యం 4,04,178 మెగావాట్లు. ఇందులో రెండు రకాల పవర్ ఉంటది. ఒకటి బేస్ లోడ్ అంటారు. ఇది 24 గంటలు సప్లయ్ చేయగల ఫర్మ్ పవర్‌ను బేస్‌లోడ్ అంటారు. దేశంలో బేస్‌లోడ్ 2,42,890 మెగావాట్లు ఉంది. పీక్‌లోడ్ అంటే దేశం అత్యధికంగా వినియోగించింది. ఈ ఏడాది జూన్‌లో 22న 2,10,700మెగావాట్లు. బేస్‌లోడ్, పవన, సౌర, జల విద్యుత్ కాకుండా బేస్‌లోడ్‌లో ఉండే పవర్ అంత కూడా ఈ దేశం వాడలేదని కెసిఆర్ తెలిపారు. దేశంలో ఇప్పటివరకు అత్యధికంగా పవర్ వాడింది జూన్ 22వ తేదీనని ఆయన పేర్కొన్నారు. మనకు ఇంకా చాలా పవర్ చాలా అందుబాటులో ఉందని, కోసి, గండకీ నదుల ద్వారానే బీహార్‌లో వరదలు వస్తున్నాయని చదువుకున్నామని, చిన్నమార్పులతో ఈ రెండు నదుల డ్యామ్‌లను నిర్మిస్తే వేల మెగావాట్ల విద్యుత్ తక్కువ ధరకు అందుబాటులోకి రావడంతో బీహార్ దుఃఖం పోతుందని ఆయన తెలిపారు. ఎన్టీపిసితో ఒక్క రామగుండం ఎలా బాగుపడిందో, బీహార్ పరిస్థితి మారుతుందని, బీహార్‌కు ఎవరో పుణ్యాత్ముడు బీమార్ స్టేట్ పేరు పెట్టారని, బీహార్‌లో బీమార్ లేదని, పెట్టినోడి నెత్తిలోనే ఉందని కెసిఆర్ పేర్కొన్నారు.

దేశంలో థర్మల్ విద్యుత్ ద్వారా 2,04,080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి

దేశంలో థర్మల్ విద్యుత్ ద్వారా 2,04,080 మెగావాట్లు, గ్యాస్ ద్వారా 24,900 మెగావాట్లు, అణువిద్యుత్ ద్వారా 6,780 మెగావాట్లు, లిగ్నైట్ ద్వారా 6,620 మెగావాట్లు, డీజిల్ ద్వారా 510 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. ఇవన్నీ కాంగ్రెస్ ఉన్నప్పుడు పెట్టిందేనని ఇప్పుడు పెట్టేది అనుకూలమైన సావుకారని ఆయన తెలిపారు. కొందరు 50, 60, 30 వేల సోలార్ ప్లాంట్లు పెడుతామని తిరుగుతున్నారు. వాళ్ల కోసమే ఈ విద్యుత్ సంస్కరణలను మోడీ తీసుకొస్తున్నారని కెసిఆర్ దుయ్యబట్టారు.

ఐదేళ్లలో రూ.25వేల నష్టపోవాలా?

40వేల మెగావాట్ల కార్ఖానాలు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నిర్మాణమై విద్యుత్ తయారు చేసేందుకు రెడీగా ఉన్నాయని కెసిఆర్ తెలిపారు. ఈ బ్యాడ్ పవర్ పాలసీతో అవన్నీ నిరుపయోగంగా మారాయన్నారు. కేంద్రం నిర్ణయాలతో ఇవాళ తెలంగాణ చాలా నష్టపోతుందని, తెలంగాణ ప్రభుత్వం సంవత్సరానికి రూ. 5వేల కోట్లు, ఐదేళ్లలో రూ.25వేల నష్టపోవాలా? చాక్లెట్ ఉన్నది తీసుకుంటవా? లేకపోతే నీకివ్వా అంటే నువ్వే ఉంచుకో రైతులకు నేను ఫ్రీగా కరెంటు ఇస్తా అని చెప్పానని కెసిఆర్ తెలిపారు. రూ.25వేల కోట్ల ఆర్థికలోటు ఈ కేంద్ర ప్రభుత్వం అవివేకం వల్ల, అనుచిత వైఖరి వల్ల తెలంగాణ ప్రభుత్వం, ప్రజలు కోల్పోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పవర్ సంస్కరణలను వెనక్కి తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి….

దేశంలో మీటర్ లేనిదో కొత్త కనెక్షన్ ఇవ్వరాదని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. మేక్ ఇన్ ఇండియా అన్నరు. ఫలితం ఏంటంటే పతంగి ఎగురవేసే మంజా చైనాదే. జెండా చైనాదే.. దీపావళికి కాల్చే పటాకులు చైనావే. మనం గీసుకునే బ్లేడు కూడా చైనాదే.. గోర్లు కత్తించుకునే నేయిల్ కట్టర్ చైనాదే. ఇదీ మేకిన్ ఇండియా. ఇంకా ఎన్ని రోజులు డబ్బా కొడుతరు. పవర్ సంస్కరణలను వెనక్కి తీసుకోవాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేస్తున్నా. ఇవి దేశానికి పనికిరావు. నిన్ను చంపేస్తా, నువ్వు మీటర్ పెట్టే తీరాలాంటే ఏం చేయాలి. ఏం చేసైనా తెలంగాణ పవర్ బంద్ చేయిం చాలి. తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్తా, నేను బాధతో చెబుతున్నా చిల్లర రాజకీయాల కోసం మాట్లాడడం లేదు. ఇచ్చిన మాట ప్రకారం అన్నిరంగాలకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు.

సెకండ్‌లోనే రాజీనామా చేస్తా

మా డబ్బుల నుంచి మేం వ్యవసాయానికి కరెంటు ఇచ్చుకుంటే ఇబ్బందేంది. వాస్తవాలు ఇలా ఉంటే ఉల్టా పల్టా చేసి, మాయా మశ్చీంద్ర చేస్తున్నరు. అన్నీ అబద్ధాలు చెబుతున్నారు. వైద్య కళాశాలలు ఇవ్వాలని మంత్రి లేఖలు రాస్తే మాకు ప్రతిపాదనలు రాలే అని కేంద్ర మంత్రి చెబుతుండు. నవోదయ విద్యాలయాలు కావాలని తాను ప్రధానిని స్వయంగా అడిగితే ఇవ్వలేదు. మేం రైతులకు కోసం పని చేస్తుంటే.. తెలంగాణలో విద్యుత్ బంద్ చేయాలని చూస్తున్నారు. రఘునందన్‌రావు తెలంగాణలోనే ఎమ్మెల్యే అనుకుంటే ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సింది రూ.17,828 కోట్లు. ఇవి ఇప్పియ్యమంటే మాట్లాడరు. ఇదేం పద్ధతి. దాంట్లో నుంచి మినహాయించుకొని రూ.6వేల కోట్లు ఇప్పియ్యండి ధర్మముంటే..? శాసన సభ నుంచి ఇవాళ అడుగుతున్నా. ఇది అబద్ధమైతే సెకండ్‌లో రాజీనామా చేస్తానని కెసిఆర్ పేర్కొన్నారు.

యాద్రాది అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ పనులు వేగంగా

ఈ దేశంలో అపారమైన సంపద భగవంతుడు ఇచ్చిండు. దానిని వాడే తెలివి కేంద్రానికి లేదని కెసిఆర్ మండిపడ్డారు. దేశంలో ఉన్న అపారమైన సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని కెసిఆర్ ఆరోపించారు. సంస్కరణ పేరిట దేశాన్ని కేంద్రం దగా చేస్తుందని, దేశం మేల్కొని బెబ్బులిలా అడ్డుకోవాలని సిఎం పిలుపునిచ్చారు. దీనిని నిలువరించేందుకు ఎక్కడి వరకైనా తాము పోరాడుతామన్నారు. తెలంగాణ ప్రజలకు చెబుతున్నానని, దాదాపు ఏడాది, ఏడాదిన్నరలో ఇప్పుడు ఉన్న కాస్లీ పవర్ బంద్ అవుతుందని, యాద్రాది అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ పనులు దగ్గర పడ్డాయన్నారు.

ఆ రెండింటిపై కేంద్రం కన్ను

ప్రస్తుతం వ్యవసాయం, విద్యుత్ రంగాలపైనే కేంద్రం కన్నువేసిందని సిఎం కెసిఆర్ ధ్వజమెత్తారు. ఇప్పటికే ఓడరేవులు, విమానాలు, రైళ్లు, రైల్వే స్టేషన్లు పోయాయని, అన్నింటికి అన్నిపోతున్నాయ్‌ని కెసిఆర్ పేర్కొన్నారు. ఇక మరో రెండు మిగిలాయ్‌ని అందులో ఒకటి వ్యవసాయరంగం. రెండోది విద్యుత్ రంగమని ఆయన తెలిపారు. ఈ రెండింటిని షావుకార్లకు అప్పజెప్పే వరకు తాము నిద్రపోమని ఇది కేంద్ర ప్రభుత్వం శపథమన్నారు. దీనికి అందమైన ముసుగుపేరు సంస్కరణ పెట్టారని కెసిఆర్ తెలిపారు. చూడడానికి అందంగానే కనిపిస్తది. రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చని, రైతులు లాభం ఉన్నకాడ అమ్ముకోవచ్చని చెబుతారని, బాన్సువాడ రైతులు ధాన్యం తీసుకుపోయి పంజాబ్‌లో అమ్ముతారా? గిట్టుబాటు అయ్యేపనేనా? దుబ్బాక వాళ్లు వచ్చి సిద్ధిపేటలో అమ్మే పరిస్థితి ఉండదు. రవాణా చార్జీలకే పోతే వీళ్లు పెంచిన పెట్రోల్, డీజిల్ రేట్లతో. వ్యవసాయ చేయలేకుంట అవుతోంది. ఎకరం దున్నాలంటే గతంలో ఎంతుంటే, ఇప్పుడు ఎంత అవుతుంది. వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడైనా అమ్ముకోవచ్చు అన్న మాట. దగా, మోసం దాని పేరు మీద ఉన్న సిస్టమ్‌ను ధ్వంసం చేస్తున్నరు. దీనిపై వెనుక కుట్రను త్వరలో మళ్లీ వివరంగా చెబుతానని కెసిఆర్ తెలిపారు.

కరెంటు బిల్లులు పెరగాలే.. మీటర్లు పెట్టాలే..

అసలు సంగతి ఎరువులు, డీజిల్ ధరలు, కోసే ధరలు పెరగాలే. కరెంటు బిల్లు పెరగాలే, మీటర్లు పెట్టాలే చివరకు రైతు వ్యవసాయం తట్టా, పారా కింద పెట్టాలే.. పెడితే సావుకార్లు సూట్‌కేసులు పట్టుకొని దిగుతరు. మీతోని కాదు కార్పొరేట్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయ్. మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులున్నయ్. ఆహార సబ్సిడీలను ఖతం పట్టించి రకరకాల పేరు మీద దానిని ఖతం చేస్తున్నారు. ఇది చాలా బాధకరం. పరిణామ క్రమం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది.

గవర్నమెంట్ అంతా పోయి ఢిల్లీలో ధర్నా చేశాం

ఎమ్మెల్యేలు, మంత్రులందరం ఢిల్లీలో ఆందోళన చేస్తే మాపై జోక్ చేస్తరు. ధాన్యం కొనాలంటే మెడకు పెడితే కాలుకు, కాలుకు పెడితే మెడకు పెట్టారు. ఇక్కడి నుంచి ఓ కేంద్రమంత్రి ఉన్నడు ఆయనేం మాట్లాడతుడో దేవుడికే ఎరుక. ఆ పార్టీ నాయకులేమో వరి వేయండి. కొనిపిచ్చే బాధ్యత మాది అన్నరు. మంచోచెడ్డో రైతులు పంట వేశారు. ఎవరూ పత్తాలేకుండా పోయారు. చెప్పినోడు పారిపోతే ఇక్కడున్న పార్లమెంట్ సభ్యులు నిష్క్రియా పరులైతే టిఆర్‌ఎస్, ఇతర పార్టీలు అక్కడ కోట్లాడితే కనీసం సంఘీభావం తెలపకపోతే చివరకు గవర్నమెంట్ అంతా పోయి ఢిల్లీలో ధర్నా చేశామని కెసిఆర్ గుర్తు చేశారు.

నూకలు కొనాలంటూ కేంద్రమంత్రి అవహేళనగా చేసిండు..

ఢిల్లీ కేంద్ర మంత్రిని కలిసినప్పుడు మంత్రులు జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డితో పాటు మిగతా వారు సంబంధిత మంత్రి పీయుష్‌గోయల్‌ను కలిసినప్పుడు తెలంగాణ చమత్కారం చేసిందా? క్యా జాదూ కరే అంటూ అవహేళన చేసినట్లు మాట్లాడారని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అబద్ధాలు చెబుతామా? పంట పొలం అగ్టిపెట్టెలో దాచిపెట్టేదా? వేల ఎకరాలకు కళ్లకు కనిపిస్తుంది కదా? ధాన్యం కొనమంటే తమకు స్థలం లేదు. ఎక్కడ పెట్టమంటారు అన్నరు. నూకలు అవుతయ్, యాసంగిలో కొనాలంటే మీ తెలంగాణకు నూకలు తినిపించడం అలవాటు చేయాలని అవమానిస్తారా? వాటి ఫలితం ఏంటంటే ఇవాళ ఏం జరుగుతుందో అందరికీ అర్ధమయ్యిందన్నారు.

నూకల ఎగుమతి బ్యాన్…20 శాతం ఎగుమతిపై ఎక్సైజ్ డ్యూటీ

కేంద్రంలోని మంత్రులు, ప్రధానమంత్రి అవివేకం, అసమర్థతవల్ల దేశం ఫుడ్ సెక్టార్ ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. కేంద్రానికి ముందుచూపు ఏమైనా ఉందా? ఇవాళ నూకల ఎగుమతిని సైతం బ్యాన్ చేసే పరిస్థితి. రైతులకు ధర రాకుండా అడ్డుకున్నదే తెలివి తక్కువ, అవివేక కేంద్ర ప్రభుత్వం. రైతుల నోట్లో మళ్లీ మట్టికొడుతోందన్నారు. ఎఫ్‌సిఐ కొనకున్నా మార్కెట్ ఫ్రీ చేస్తే యూరప్, అమెరికాలో కరువు ఉంది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రకరకాల ఇబ్బందులున్నాయని, ఇవాళ డిమాండ్ వస్తుందని కెసిఆర్ పేర్కొన్నారు. మళ్లీ ఇవాళ ఇదే రైతులను కేంద్రం దెబ్బకొడుతూ నోట్లో మన్నుకొడుతుందన్నారు. అడ్డం తగులుతూ నూకల ఎగుమతిని బ్యాన్ చేసి 20 శాతం ఎగుమతిపై ఎక్సైజ్ డ్యూటీ పెంచారని ఆయన మండిపడ్డారు.

ఈ మరుగుజ్జుల మాటలు వినాల్సిన ఖర్మ మనకుందా?

అసమర్థ విధానాలు, దూరదృష్టి లేక, ఇతరులు చెబితే వినే లౌక్యం లేకపోవడంతో, సహనం కోల్పోయి అహంకార పూరితంగా వ్యవహారిస్తూ దుర్మార్గమైన ఫలితాలను కేంద్రం తీసుకొస్తుందన్నారు. ఇవి నిజాలు కావా? దీనిపై ఎక్కడైనా చర్చకు రెడీ అని, ఇలా ఎన్నో రంగాలను నాశనం పట్టిస్తున్నారని కేంద్రంపై కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యమని, ఇది ఉండకూడదని కేంద్రం పేర్కొనడం సిగ్గుచేటన్నారు. భారతీయ జనతా పార్టీకి చెందిన వివిధ రాష్ట్రాల మంత్రులు, దురదృష్టవశాత్తు కొందరు ముఖ్యమంత్రులు ఎన్‌కౌంటర్లు చేస్తం అంటున్నరు. దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తది. జాతీయ జెండా ఎగురవేయకండి మీ ఇళ్ల మీద వేరే జెండా ఎగురవేయండి. జాతీయ జెండానే మార్చేస్తాం. ఈ మాటలను దేశం వినాలా? ఇది మహాత్ముడు పుట్టిన గడ్డేనా? ఈ మరుగుజ్జుల మాటలు వినాల్సిన ఖర్మనా మనది. ఎక్కడి నుంచి దాపురించారు ఈ దరిద్రులు. మరుగుజ్జులు. దీని కోసమేనా అంబేద్కర్ రాజ్యాంగం రాసింది, ఇదేనా స్ఫూర్తి అని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ దేశంలో ఒక పార్టీనే ఉండాలంటా ?

మహాత్ముడు పుట్టిన నేలపై ఈ మరుగుజ్జులు చంపేస్తాం.. కోసేస్తాం.. పార్టీనే ఉంచం.. ఈ దేశంలో ఒక పార్టీనే ఉంటది. డిక్లేర్ చేయండి మంచిదే కదా? బ్యాన్ చేయండి అన్ని పార్టీలను అర్జెంట్‌గా. మీ సంగతే, మా సంగతో ఈ దేశంలో తెలుతుంది. వేరే పార్టీలను ఏవీ ఉంచం ఉండకుండా చేస్తామని నిస్సిగ్గుగా కేంద్ర హోంమంత్రి మాట్లాడుతున్నడు. కేంద్ర హోంమంత్రి మునుగోడు బహిరంగ సభలో ఓపెన్ స్టేట్ ఇచ్చాడు. దీనిపై పలు ప్రాంతాల నుంచి ఫోన్లు చేసి కేంద్ర హోం మంత్రి ఏం మాట్లాడుతున్నాడని అడుగుతున్నారు. కేంద్ర హోంమంత్రి నోటి నుంచి ఇంత అప్రజాస్వామి కమైన మాటను ఈ దేశం నుంచి భరించవచ్చా? ఇది ధర్మమేనా భారతదేశాన్ని నడిపించే పెద్దలు మాట్లాడే మాటలేనా? అహింసతో దేశాన్ని తీసుకువచ్చిన మహాత్ముడు పుట్టిన నేల ఇది. ఎవరికీ కిరీటం పెట్టడానికి? ఎవరిని కాపాడడానికి ఈ అరుపులు, పెడబొబ్బలు. ఈ పార్టీకి (బిజెపికి) రెండుసార్లు 50శాతం ఓట్లు రాలేదన్నారు.

మరో 18 నెలల్లో బిజెపి కథ ముగుస్తుంది

విద్యుత్ సంస్కరణల ముసుగులో జారీ చేసిన జీఓలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం శాశ్వతం కాదని, మరో 18 నెలల్లో బిజెపి కథ ముగుస్తుందన్నారు. ఆ తరువాత కేంద్రంలో బిజెపి యేతర ప్రభుత్వం రాబోతుందన్నారు. బిజెపి దుర్మార్గపు ప్రభుత్వాన్ని భూ స్థాపితం చేస్తామన్నారు. కేంద్రం మాయమాటలకు, బెదిరింపులకు తాము భయపడమని కెసిఆర్ పేర్కొన్నారు. ఈ దేశంలో 15వేల కోట్ల రైతు కుటుంబాలున్నాయని వారందరూ తలుచుకుంటే మోడీ ప్రభుత్వం కుప్పకూలుతుందన్నారు. బిజెపి ప్రభుత్వానికి కోట్ల ఆదాయం ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం తప్పా కొత్తగా ఓ ప్రాజెక్టు నిర్మించడం తెలియదన్నారు. కేంద్రం విద్యుత్ శాఖ మంత్రి మెడకు పెడితే కాలుకు, కాలుకు పెడితే మెడకు పెడుతూ రాష్ట్రాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అయినా తెలంగాణ రైతులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఉచిత విద్యుత్‌ను అందించేందుకు పోరాడతానని కెసిఆర్ పేర్కొన్నారు.

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రుణాలు ఆపేందుకు కుట్ర

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ప్రస్తుతం తెలంగాణపై పడ్డారని రాష్ట్రానికి రావాల్సిన రుణాలు ఆపేందుకు కుట్రలు చేస్తున్నారని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఉదయ్ పథకంలో చేరనంటే తమకు వచ్చే రుణాలను ఆపతామని బెదిరించి ఈ స్కీంలో చేర్చారని అందులో చేరాక మరోలా తమను ఇబ్బందులు పెడుతున్నారని, ఇది పోరాటాలు, పౌరుషాల గడ్డ అని, ఇక్కడ మీ పిట్ట బెదిరింపులు పనిచేయవని కెసిఆర్ పేర్కొన్నారు. విద్యుత్ విషయంలో కేంద్రం బండారం బయటపెడతానని కెసిఆర్ హెచ్చరించారు. మనం ఇచ్చే పింఛన్లు, రైతుబంధు గురించి కేంద్రమంత్రికి ఎందుకని కెసిఆర్ ప్రశ్నించారు. 10 శాతం విదేశీ బొగ్గు విధిగా కొనాలని విశ్వగురు (పధాని) చెబుతున్నారని, రూ.4వేలకు వచ్చే సింగరేణి బొగ్గు వదిలి రూ.30వేలకు వచ్చే విదేశీ బొగ్గు కొనాలా? కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ విధానం వల్ల మనం అంధకారంలోకి వెళ్తున్నామని, అనేక బిల్లులు తెచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం ఉద్యమించడంతో కొన్ని బిల్లులను వెనక్కి తీసుకున్నారని, విద్యుత్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నానని కెసిఆర్ పేర్కొన్నారు.

24 లక్షల పైచిలుకు విద్యుత్ ఉద్యోగులు కేంద్రంపై పోరాటం

అనేక ఉద్యమాలు చేసి, కోట్లాడి తెలంగాణను సాధించుకున్నామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఈ విద్యుత్ బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోకపోతే దేశ వ్యాప్తంగా ఉన్న 24 లక్షల పైచిలుకు విద్యుత్ ఉద్యోగులు కేంద్రంపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారని కెసిఆర్ తెలిపారు. కార్పొరేట్ కంపెనీలకు ఉద్ధీపనల పేరుతో లక్షల కోట్లు రుణాలను మాఫీ చేసిన కేంద్రం, రైతుల మోటార్లకు ఉచితంగా కరెంట్ ఇవ్వడానికి ఇబ్బందులు పడుతుందని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేడు రెండు తీర్మానాలు

నేడు జరగబోయే సమావేశంలో విద్యుత్ బిల్లు వెనక్కి తీసుకోవాలని, కొత్త పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని నేడు సభలో ముందుగా తీర్మానం చేద్దామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. గురుకులాల్లో భోజనం, నాణ్యతపై అధికారులు, మంత్రులతో సమీక్ష చేస్తామని కెసిఆర్ ప్రకటించారు. సాంఘిక సంక్షేమ, బిసి వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్ సంఖ్యను పెంచామని అందులో భాగంగా సౌకర్యాలపై ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఆహారం, శుభ్రత మంచిగా ఉండేలా మంత్రులు చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు.

20 నుంచి 25 రోజులు శీతాకాల సమావేశాలు

త్వరలో శీతాకాల సమావేశాలను సభ్యుల కోరిక మేరకు నిర్వహించి చాలా విషయాలను చర్చించుకుందామని సిఎం కెసిఆర్ తెలిపారు. 20 నుంచి 25 రోజుల పాటు ఈ సమావేశాలను జరుపుకొని ప్రజలకు ఉపయోగపడే అంశాలను మాట్లాడుకుందామని సిఎం కెసిఆర్ తెలిపారు. శీతాకాల సమావేశాల్లో కేంద్రం తీరును ఎండగడతానని ఆయన హెచ్చరించారు.

విఆర్‌ఏలు అధైర్యపడొద్దు 

విఆర్‌ఏలు అనవసరంగా ఆందోళనలు చేస్తున్నారని, అర్హులైన విఆర్‌ఏలకు పే స్కేల్‌తో పాటు పదోన్నతులు ఇస్తామని, మిగతా విఆర్‌ఏలను ఇరిగేషన్‌తో పాటు పలు శాఖల్లోకి సర్దుబాటు చేస్తామని, దీనికి సంబంధించి అధికారులు ప్రక్రియను పూర్తి చేశారని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. త్వరలోనే వీటిపై విధి, విధానాలు రూపొందిస్తామని, విఆర్‌ఏలు అధైర్యపడొద్దని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. వెంటనే వారు తమ ఆందోళనలు విరమించాలని కెసిఆర్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News