Saturday, December 21, 2024

దుమ్ము రేగిపోద్ది

- Advertisement -
- Advertisement -

CM KCR Speech at Chandur Public Meeting

మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ బ్రోకర్ గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూస్తే మన ఎంఎల్‌ఎలు ఎడమకాలి చెప్పుతో కొట్టినట్టు వారికి బుద్దిచెప్పారని టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఒక్కొక్కరికి రూ.100 కోట్లు ఇస్తామన్నా ఆశచూపినా వారికి లొంగకుండా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడారని ప్రశంసించారు. దేశానికి కావాల్సింది ఇలాంటి ఎంఎల్‌ఎలేనని అన్నారు. తెలంగాణతో పెట్టుకున్న మోడీ ప్రభుత్వాన్ని ఇక వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఒక్కమాట చెబుతున్నా… నిన్నమొన్న మీరు టీవీల్లో చూసింది గింతేనని అన్నారు. కానీ దొరికిన దొంగ ఇంత ఉన్నదన్నారు. ఢిల్లీ పీఠమే దుమ్ము దుమ్ము రేగిపోయే పరిస్థితి ఉన్నదన్నారు. రాబోయే రోజుల్లో అవన్నీ బయటపడుతాయన్నారు. ఈ దుర్మార్గులను కూకటివేళ్లతో పీకేసి, బంగాళాఖాతంలో విసిరేస్తే తప్ప ఈ భారతదేశానికి నివృత్తి లేదన్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చండూరు మున్సిపాలిటి పరిధిలోని బంగారిగడ్డలో టిఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, మరోసారి తనదైన శైలిలో మోడీ ప్రభుత్వం నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకుని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అక్రమదారిలో కూల్చే అధికారం మోడీ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న అహంతో ఏమి చేసినా చెల్లుతుందని అని అనుకుంటున్నారా? అని కెసిఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలపై ఇంత అరాచకం జరుగుతుంటే మౌనం పాటిద్దామా? అని కెసిఆర్ ధ్వజమెత్తారు. రాజకీయం అంటే అమ్ముడుపోవడం కాదని టిఆర్‌ఎస్ శాసనసభ్యులు నిరూపించారన్నారు. తలమాసిన ఒకడు తడి బట్టలతో ప్రమాణం అంటున్నాడని విమర్శించారు. వందల కోట్లతో దొరికిన దొంగలు ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్నారు. శాసనసభ్యులను కొనుగోలు చేయడానికి వందల కోట్లు వారికి ఎక్కడి నుంచి వచ్చాయో విచారణలో తేలాలన్నారు. దీని వెనక ఉన్నవాళ్లు ఒక్క క్షణం కూడా పదవుల్లో ఉండేందుకు వీళ్లేదని కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఎవడో ఒకడు వచ్చి తలమాసినోడో తడిబట్టలతోని ప్రమాణం చేస్తావా? ఇంకొకడు వచ్చి పొడిబట్టలతోని ప్రమాణం చేస్తావా? ఇది రాజకీయమా? దొరికిన దొంగలు జైల్లో ఉన్నారనారు. అందుకే దీనిపై తాను ఎక్కువ మాట్లాడలేకపోతున్నానన్నారు. ఎందుకంటే తాను రాజ్యాంగబద్దమైన ముఖ్యమైన పదవిలో ఉన్నానని అన్నారు. కేసు న్యాయస్థానాల్లో ఉంది…కొద్ది రోజుల్లో తేలుతదన్నారు. ఈ విషశయంపై తాను ఏం మాట్లాడినా దాన్ని ప్రభావితం చేశారంటారన్నారు. అందుకే తాను ఎక్కువ చెప్పడం లేదన్నారు. మతోన్మాదులు, పెట్టుబడిదారుల తొత్తులు, ఈ పిచ్చి వ్యక్తులు, అరాచకం సృష్టించే వ్యక్తులను తన్ని తరిమేయకపోతే దేశం బాగుపడదన్నారు.

ఓటు అనేది మన తల రాత రాసుకునే గొప్ప ఆయుధం
ఓటు అనేది మన తల రాత రాసుకునే గొప్ప ఆయుధమని కెసిఆర్ అన్నారు. ఎలక్షన్లు రాగనే గత్తర గత్తర లొల్లి లొల్లి ఉంటందన్నారు. ఏదో ఏమో మాయరోగం పట్టుకుంటుందన్నారు. కొందరైతే గజం ఎత్తున గాల్లోనే నడుస్తున్నారన్నారు. ఈ మునుగోడు ఉప ఎన్నిక అవసరం లేకుండానే వచ్చిందన్నారు. ఈ ఎన్నిక ఫలితం ఎప్పుడో తేల్చేశారన్నారు. అది కూడా తనకు తెలుసన్నారు. ఇందులో కొత్తగా చెప్పడానికి ఏం లేదన్నారు. అయినా ఒక నాలుగు విషయాలు చెప్పాలని మీ బిడ్డగా ఇక్కడికి వచ్చానని కెసిఆర్ అన్నారు. తాను చెప్పిన మాటలు జాగ్రత్తగా వినాలన్నారు. చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నానని కెసిఆర్ పేర్కొన్నారు. ఈ మాటలను ఇక్కడనే వదిలేసి వెళ్లిపోవద్దన్నారు. మీ ఊరెళ్లిన తర్వాత చర్చ చేసి నిజనిజాలు తేల్చాలన్నారు. ఓటును అలవోకగా వేస్తే ఒళ్లు మరిచి ఓటేస్తే ఇల్లు కాలిపోతదన్నారు. అందువల్ల చాలా జాగ్రత్తగా ఆలోచించి మంచి చెడు ఆలోచించి ఓటు వేయాలన్నారు. అప్పుడే మన బతుకులు, మునుగోడు బాగుపడుతాయన్నారు. తెలంగాణ, భారతదేశం కూడా బాగుపడదన్నారు. ఎవరో చెప్పారని… మర్యాద చేశారని డ్యాన్స్ చేస్తే మంచిగ అనిపించిందని ఓటేస్తే ప్రమాదం వస్తదన్నారు.
ఎందుకీ అరాచకం
దేశంలో ప్రధాని పదవిని మించి పదవి ఇంకోటి లేదని కెసిఆర్ అన్నారు. అలాంటి పదవిని దేశ ప్రజలు మోడీకి రెండు సార్లు ఇచ్చారన్నారు. అయినా ఎందుకు ఈ కిరాతకం? ఎందుకీ అరాచకమని ఆయనను ఉద్దేశించి కెసిఆర్ ప్రశ్నించారు. దేశం కోసం, సమాజానికి ఏ రకంగా మంచిదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఎందుకు ఇవన్నీ ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. మోడీ అండదండలు లేకుండానే ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రముఖ పాత్ర వహించే వ్యక్తులు హైదరాబాద్‌కు వచ్చారా? అని ప్రశ్నించారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంత అరాచకం జరుగుతుంటే ఇంకా మౌనంగా ఉండలా అని ప్రశ్నించారు.
విశ్వగురువా? విషగురువా?
దేశంలో సక్కదనం ఏముందని కెసిఆర్ ప్రశ్నించారు. పైనపటారం.. లోనలొటారం… ఢంబాచారమన్నారు. మోడీ హయంలో దేశంలో పూర్తిగా అధోగతి పాలైందని మండిపడ్డారు. ఆయన విశ్వగురువా? విషగురువా? అని ధ్వజమెత్తారు. అరాచక… కిరాచక రాజకీయాలు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాలను మోడీ కూలగొట్టేందుకు యత్నిస్తున్నారని విరుచుకుపడ్డారు. రాజకీయాలను అస్థిరపరుస్తూ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న దుర్మార్గమైన మతోన్మాద బిజెపికి తగు రీతిలో బుద్ధి చెప్పాలన్నారు. డాలర్‌కు వ్యతిరేకంగా రూపాయి చూస్తే 82 రూపాయాలా? నేపాల్, పాక్, బంగ్లాదేశ్ కరెన్సీ కన్నా అధ్వాన్నంగా ఉంటదా? అని ప్రశ్నించారు. ఇండియా ఆకలి రాజ్యంగా మారుతుందా ఎన్నో ప్రకృతి వనరులు, సంపదలు ఉన్న ఈ దేశంలో నిరుద్యోగం తాండవిస్తుందా? రూపాయి పతనానికి బాధ్యులు ఎవరు? ధరల పెరుగుదలకు కారణం ఎవరని నిలదశారు. సిలిండర్ నాలుగు వందల నుంచి రూ.1200 చేసింది ఎవరని? కెసిఆర్ అడిగారు. అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది ఎవరన్నారు. అలాంటి వారికి మళ్లీ ఓటు వేయాలా? అంత పౌరుషం లేకుండా ఉన్నమా? దీనిపై ఆలోచన చేయాలన్నారు. అర్థమై తర్వాత కూడా… కానట్టు చేస్తే మన బతుకులు వ్యర్థం అవుతాయన్నారు.
గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పిండితే వస్తయా?
మౌనంగా ఉంటే ఆ మౌనమే శాపమైతదని కెసిఆర్ అన్నారు. ప్రేక్షకుల్లా చూసి మనది కాదు అనుకూనే సందర్భం కాదన్నారు. ప్రతి విద్యావంతుడు తీవ్రంగా తీసుకోవాల్సిన సందర్భమని అన్నారు. దయచేసి మునుగోడులో విద్యాధికులు, కవులు, కళాకారులు, రచయితలు, అన్నదమ్ముళు, ్ల అక్కాచెళ్లెల్లు, ఊరికి వెళ్లిన తర్వాత చర్చ చేయాలన్నారు. ఓటు వేసేటప్పుడు దేనికో ఆశపడి ఎవడో చెప్పిండని మాయమాటకు లొంగి ఓట్లు వేస్తే మంచి జరుగదన్నారు. మనం పండ్లు తినాలంటే ముండ్ల చెట్లు పెడితే రావన్నారు. చెట్టు పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టాలన్నారు. ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలన్నారు. గాడిదలకు గడ్డేసి ఆవులు పిండితే పాలు రావు గడ్డి వేసేటప్పుడే గాడిదికి వేస్తున్నామా? ఆవుకు వేస్తున్నమా? ఆలోచించాలనారు.

చైనత్యం రానంత వరకు దుర్మార్గ రాజకీయాలు కొనసాగుతాయి
దేశంలో ఉన్నది ప్రజాస్వామ్యమన్నారు. ఈ దేశంలో ఏం జరుగుతుందో మనసు విప్పి ఆలోచించాలన్నారు. ఓటు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలన్నారు. కరిచే పాము అని చెప్పి మెడలో వేసుకుంటామా? ఆలోచించాలన్నారు. దేశంలో చైతన్యం రానంత వరకు దుర్మార్గ రాజకీయాలు కొనసాగుతాయన్నారు. దోపిడీదారులు మాయమాటలు చెప్పి మోసం చేస్తారని కెసిఆర్ సూచించారు. దీనిపై ఆలోచన చేయాలన్నారు.

నా బలగం…నా శక్తి మీరే
నా బలగం… నా శక్తి మీరేనని కెసిఆర్ అన్నారు. మీ బలం చూసే మేం కొట్లాడేదన్నారు. మీరే సహకరించకపోతే మేం ఏం చేయగలుగుతామన్నారు. ఇవాళ మీటర్లు పెట్టేవారికి ఏం అవకాశం ఇచ్చినా తనను పక్కకు జరిపేస్తారన్నారు. కెసిఆర్‌ను పడగొట్టి తెలంగాణను కబ్జా చేద్దామనుకున్నారన్నారు. ప్రైవేటీకరణ చేద్దామనుకునే వాళ్ళకు ఈ ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు.దేశంలో 70 వేల టిఎంసిల నీరు అందుబాటులో ఉందని కెసిఆర్ పేర్కొన్నారు. భారతదేశంలో బంగారం లాంటి భూమి ఉందన్నారు. మానవ సంపద ఉన్నదన్నారు. ఇవన్నీ వదిలిపెట్టి వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ గద్దలకు అప్పజెప్పే ప్రయత్నం జరుగుతోందన్నారు. దీనిని రైతులు గమనించాలని కెసిఆర్ సూసూచించారు. నష్టపోయేది, కష్టపడేది మనమే అనేది గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. గత పాలకుల హయాంలో నీటి గోస తీరిందా? ఫ్లోరోసిస్ సమస్యను పరిష్కరించలేదన్నారు. మునుగోడు ప్రజలను కాపాడండి అంటే నాటి బిజెపి ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను ఇక్కడకు వచ్చి ఫ్లోరోసిస్ సమస్యను చూసి ఏడ్చినా అన్నారు. శివ్వన్నగూడెంలో నిద్ర చేసి, మేధావులతో మాట్లాడి చైతన్యం తీసుకొచ్చానని అన్నారు. సూడు సూడు నల్లగొండ… గుండె మీద ఫ్లోరైడ్ బండ అనే పాట తాను రాశానని ఈ సందర్భంగా కెసిఆర్ గుర్తు చేశారు. కేవలం మునుగోడుకే కాదు భారత్‌కే నరకం చూపే జెండాలు మన మధ్య తిరుగుతున్నాయన్నారు. వాటిని గుర్తుపట్టాలన్నారు.

బిఆర్‌ఎస్‌కు పునాది రాయి వేసే అవకాశం మీకే దక్కింది
కేంద్రం అవలంభించే విధానాల వల్ల విద్యుత్, నీటి సమస్యలు వస్తున్నాయని కెసిఆర్ అన్నారు. ఎనిమిదేండ్ల కింద మన తెలంగాణను ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. కానీ టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ పచ్చబడ్డదన్నారు. తెలంగాణలాగే దేశాన్ని తయారు చేయాలని పుట్టుకొస్తున్నదే బిఆర్‌ఎస్ పార్టీ అని అన్నారు. మునుగోడు ప్రజలకు ఇదో గొప్ప అవకాశమన్నారు. చరిత్రలో సువర్ణ అవకాశం ఈ మునుగోడుకే దక్కిందన్నారు. బిఆర్‌ఎస్‌కు పునాది రాయి పెట్టే అవకాశం మీకే దక్కిందన్నారు. సిద్దిపేట ప్రజలు తనను తెలంగాణ పోరాటానికి పంపిస్తే….. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించానని అన్నారు. అలాగే మునుగోడులో అందించే విజయం ద్వారా జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు కెసిఆర్ తెలిపారు. ఈ విజయంతోనే దేశం బాగుపడుతదన్నారు. అందువల్ల మునుగోడును తన గుండెల్లో పెట్టుకుంటానని కెసిఆర్ భరోసా ఇచ్చారు. ఎల్లవేళలా మీకు అండదండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ప్రతి ఎకరాను నీళ్లు తెచ్చే బాధ్యత నాదే
మునుగోడులోని ప్రతి ఎకరానికి నీళ్లు తెచ్చే బాధ్యత తనదేనని కెసిఆర్ అన్నారు. దీని కోసం ఎక్కడి వరకైనా కొట్లాడుతానని అన్నారు. తలపెట్టిన చర్లగూడెం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటానని అన్నారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు తెలంగాణ, ఎపి రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వాటాల సమస్యలను మోడీ ప్రభుత్వం పరిష్కరించలేకపోయిందని కెసిఆర్ విమర్శించారు. ఒక ఊళ్లో ఇద్దరు అన్నదమ్ముళ్లు వేరుపడితే పెద్దలు ఏం చేస్తరన్నారు. ఇది నీదిరా? గిది నీదిరా? అని పంచుతారన్నారు. కానీ మహత్తర ఘనత వహించిన బిజెపికి, ప్రధానికి ఎనిమిదేళ్లు చాలలేదా? మా వాటా ఇవ్వడానికి? అని కెసిఆర్ ప్రశ్నించారు. ఎందుకివ్వవు? ఎందుకు ఆయనకు నోరు పెగలదని ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ అభ్యర్ధి ప్రభాకర్రెడ్డిని గెలిపిస్తే 15 రోజుల్లోనే వంద పడకల ఆసుపత్రితో పాటు చండూరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తానని హామీ ఇచ్చారు.

జగదీశ్ రెడ్డిని ఎందుకు నిషేధించారు?
మంత్రి జగదీశ్ రెడ్డి బంగారిగడ్డ బహిరంగ సభలో లేకపోవడాన్ని సిఎం కెసిఆర్ ప్రస్తావించారు. ఆయనతో తనకు అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి లేకుండా గత 20 ఏండ్లలో ఏ సభలో కూడా మాట్లాడలేదన్నారు. 2001 నుంచి ఆయన ఉద్యమంలో ఉన్నోడన్నారు. తాను ఇక్కడకు వచ్చే ముందు బాధతో వచ్చానని అన్నారు. ఆయన ఏం తప్పు చేశాడని…ఎన్నికల సంఘం ఆంక్షలు విధించడానికి అని ప్రశ్నించారు.ఇక్కడ నుంచి ఆయనను ఎందుకు నిషేధించారని నిలదీశారు. ఆయన ఏమైనా గుండాగిరి చేశాడా? ఎవరినైనా కొట్టిండా? దౌర్జన్యం చేసిండా? అని కెసిఆర్ అడిగారు. అసలు టిఆర్‌ఎస్ పార్టీకి ఆ చరిత్ర ఉందా? అని కెసిఆర్ అన్నారు. ప్రశాంత వాతావరణంలో తమ ప్రచారాన్ని తాము మేం చేసుకుంటున్నామన్నారు.

ఏ ప్రధాని చేయని దుర్మార్గం చేసిండు
దేశంలో ఏ ప్రధాని కూడా చేయని దుర్మార్గం మోడీ చేసిండని కెసిఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇబ్బందుల్లో ఉన్న చేనేతపై 5 శాతం జిఎస్‌టి వేసి శిక్షిస్తున్నారన్నారు. ఇంత కఠినంగా వ్యవహరించిన బిజెపికి చేనేత బిడ్డలు ఎలా ఓటు వేస్తారన్నారు. దీనిపై చేనేత కార్మికులు ఆలోచించాలన్నారు. తమకే ఓటు వేయమని అడగడం బిజెపికి ధర్మమేనా? అని ప్రశ్నించారు. ఇవాళ వామపక్షాలు టిఆర్‌ఎస్ కలిసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు పోరాటం చేస్తున్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైనదన్నారు. ఆ ఓటు బలంతోనే పోటు పొడుస్తానని చెప్పిన తర్వాత కూడా బిజెపికి ఓటు వేయాలనా? ఒక్కసారి ఆలోచించాలన్నారు. మీ చేతిలో ఉన్న ఓటును బాగు, భవిష్యత్, దేశం కోసం వినియోగించమని చెబుతున్నానని అన్నారు.

బావులకే కాదు….ఇళ్లకు మోటార్లు బిగించాల్సిందే
కేంద్రం మరీ బరితెగిస్తోందని కెసిఆర్ మండిపడ్డారు. విద్యుత్ సంస్కరణల పేరిట వ్యవసాయ బావులకే కాకుండా ఇళ్లకు కూడా మోటర్లు బిగించాలని ఇటీవలనే కేంద్రం అన్ని రాష్ట్రాలకు సర్కులర్ పంపిందన్నారు. ఈ మీటర్లను ఏర్పాటు చేసుకోవడానికే రూ.30 వేలు ఖర్చు అవుతుందంటా? అని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ బావులకు, ఇళ్లకు కొత్తగా మోటార్లు బిగించేందుకు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. దేశంలో విద్యుత్‌కు కొరత లేదన్నారు. ప్రస్తుత దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉందని కెసిఆర్ తెలిపారు. కానీ ఈ దేశం 2 లక్షల మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదన్నారు. ఏంది ఈ దుర్మార్గమని ప్రశ్నించారు. మన రాష్ట్రంలో తప్పా ఎక్కడా కూడా 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. కేవలం కార్పొరేట్ల జేబులు నింపాలన్న లక్షంతోనే బిజెపి ప్రభుత్వం యత్నిస్తోందని మండిపడ్డారు. ఇందులో భాగంగానే విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రయివేటీకరణ అనే పాలసీని తీసుకొస్తుందని కెసిఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంగట్లో సరకు కాదని నిరూపించారు
వందల కోట్ల రూపాయలతో ప్రలోభ పెట్టిన వాళ్లను ఎడమకాలి చెప్పుతో కొట్టి…… అమ్ముడుపోవుడు కాదురా? మేం అంగట్లో సరుకు కాదని తెలంగాణ బిడ్డలమని తనతో వచ్చిన టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు నిరూపించారని కెసిఆర్ ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ ఆత్మగౌర బావుటాను హిమాలయపర్వతం అంత ఎత్తుకు ఎత్తారన్నారు. ఎంఎల్‌ఎలు పైలెట్ రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్‌రెడ్డి, రెగా కాంతారావు లాంటివారే ప్రస్తుతం రాజకీయాలకు కావాలన్నారు. వారిని సభకు హాజరైన అశేష జనవాహినికి ఈ సందర్భంగా కెసిఆర్ పరిచయం చేశారు. జాతి గౌరవాన్ని, దేశగౌరవాన్ని అంగట్లో పశువుల్లా అమ్ముడుపోకుండా వందకోట్లు ఇస్తామన్నా గడ్డిపోచతో సమానంగా విసిరికొట్టారని ప్రశంసించారు. తెలంగాణను కాపాడిన బిడ్డలు వందల కోట్ల అక్రమ ధనం తెచ్చి శాసనసభ్యులను పార్లమెంట్ సభ్యులను ఇతరులను సంతలో పశువుల్లా కొని ప్రభుత్వాలను కొలగొట్టే అరాచక వ్యవస్థ మంచిదా? అని ప్రశ్నించారు.
గొడ్డలిని తెచ్చిపెట్టుకున్నారు
గోదె ప్రభాకర్‌రెడ్డిలాంటి వాడిని ఓడగొట్టి నియోజకవర్గం ప్రజలు గొడ్డలిని తెచ్చిపెట్టుకున్నారని కెసిఆర్ వ్యాఖ్యానించారు. నిత్యం ప్రజల్లో ఉండే మనిషి… సామాన్యుడు…అరమరికలు తెలియని మనిషి… గజకర్ణ గోకర్ణ విద్యలు తెలియని వ్యక్తి ప్రభాకర్‌రెడ్డి అని అన్నారు. తెచ్చుకున్న గొడ్డలి పుణ్యమా కారణంగా ఏ రోడ్డు సక్కగా లేదన్నారు. ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే అద్దాల్లా రోడ్లను బాగు చేయించే బాధ్యత తనదేనని కెసిఆర్ అన్నారు. పనులు, సేవ చేసేవారు కావాలన్నారు. గెలిచినోళ్లు పత్తాలేకుండా పోయారు… కానీ ఓడిపోయిన ప్రభాకర్‌రెడ్డి మీ మధ్యలోనే మీ మనిషిగా ఉన్నజన్నారు. ఇలాంటోళ్లను గెలిపించుకుంటే మీ పనులు చేస్తారన్నారు.

CM KCR Speech at Chandur Public Meeting

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News