నల్లగొండ: ఎట్టి పరిస్థితుల్లో ఈ సభ జరగనీయొద్దని, మీరు నేను కలవకూడదని చేయని ప్రయత్నం లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావ్ అన్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన టిఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభలో సిఎం కెసిఆర్ పాల్గన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. ”ఈ సభ జరగకూడదని ఎంతో ప్రయత్నించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లి మమ్మల్ని సమర్థించమని అడుగుతారు. ఇది దేశ రాజకీయాల్లో ఉంది. ఎలక్షన్ రాగనే ఆగం కావొద్దు.. ఆలోచన, పరిణితితో ఓటు వేయాలి. అరవై ఏండ్ల పాలనలో తెలంగాణను కాంగ్రెస్ నాయకులు నాశనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు రూ.200 ఇస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్ల కింద ఒక్కో లబ్ధిదారుడికి రూ.2016 ఇస్తుంది. గ్రామాల్లో రైతుబంధు, రైతుబీమా వస్తలేదా, కల్యాణలక్ష్మి వస్తలేదా. గతంలో ఇవన్నీ ఉండేనా. గతంలో రైతు చనిపోతే పరిహారం ఇచ్చే విషయంలో కూడా దారుణాలు చేసేవారు.
ఇప్పుడు గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా.. రైతు బీమా కింద రూ.5 లక్షలు ఇస్తున్నాం. ఏ పైరవీ లేకుండా ధరణి పోర్టల్‌లో భూముల రిజిస్ర్టేషన్ జరిగిపోతోంది. ఫ్లోరైడ్‌తో బాధపడుతున్న ఈ జిల్లాకు మిషన్ భగీరథ నీళ్లు తీసుకొచ్చాం. ‘ఏమాయేనే నల్లగొండ.. ఏడుపే నీ గుండె నిండా’ అని నేనే పాట రాశాను. ఈ 30 ఏండ్ల చరిత్రలో జానారెడ్డి ఏం చేయలేదు. కృష్ణా నది ఒడ్డున ఉన్న గ్రామాలకు కూడా కాంగ్రెస్ గుక్కెడు మంచి నీళ్లు ఇవ్వలేదు. ఇవాళ మిషన్ భగీరథ ద్వారా మేము ప్రతి గ్రామానికి నీళ్లు ఇస్తున్నాం. రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ర్ట అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తుంది. ముండ్ల చెట్లు పెట్టి పండ్లు కాయమంటే కాయవు. పండ్ల చెట్లు పెడితేనే కాయలు కాస్తాయి. ఈ ప్రకారమే ఆలోచింది మీరు నిర్ణయం తీసుకోవాలి. ఎవరు గెలిస్తే మంచిదో.. ఎవరు గెలిస్తే ఈ నియోజవర్గం అభివృద్ధి చెందుతుందో మీరు ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చారు. నోముల నర్సింహయ్య వారసుడిగా మీకు తగు రీతిలో సేవ చేస్తడని నోముల భగత్‌ను అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. పనిచేసే ప్రభుత్వాన్ని గెలిపించాలి” అని కెసిఆర్ పేర్కొన్నారు.
CM KCR Speech at Halia Sabha in Nagarjuna Sagar