Monday, November 18, 2024

దేశమంతా తెలంగాణ మోడల్‌

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ మోడల్‌ను దేశమంతా అమలు చేస్తామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా ఉచిత విద్యుత్‌ను అందిస్తానని ఆయన హామినిచ్చారు. బుధవారం ఖమ్మంలో జరిగిన బిఆర్‌ఎస్ ఆవిర్భావ సభలో కెసిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బిజెపి, కాంగ్రెస్‌లపై సిఎం కెసిఆర్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కొద్దిరోజుల్లోనే బిఆర్‌ఎస్ విధానాలను ప్రజల ముందుంచుతామని కెసిఆర్ తెలిపారు. 150 మంది మేధావులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, మాజీ సుప్రీంకోర్టు జడ్జిలు బిఆర్‌ఎస్ విధానాలను రూపొందిస్తున్నారని, ఫైనల్ డ్రాఫ్టింగ్ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రగతిశీల పార్టీలతో కలిసి బిఆర్‌ఎస్ పనిచేస్తుందని ఆయన తెలిపారు. అంతిమ విజయం తమదేనని, న్యాయం, ధర్మం గెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. దేశంలో చైతన్యం తెచ్చేందుకు పుట్టిందే బిఆర్‌ఎస్ పార్టీ అని ఆయన తెలిపారు. మహిళలకు 35శాతం రిజర్వేషన్లు చట్టసభల్లో బిఆర్‌ఎస్ ప్రతిపాదిస్తోందని, బిజెపిని గద్దె దించడానికి అందరం ఏకం కావాలని, త్వరలోనే బిఆర్‌ఎస్ టోటల్ ఫాలసీని దేశం ముందు పెడతామని కెసిఆర్ ప్రకటించారు.

దుర్మార్గమైన దోపిడీదారుల ప్రభుత్వం….

బిజెపి చెప్పే నీతి సోషలైజ్ ది లాసెస్.. ప్రైవేటైజ్‌ది ప్రాఫీట్ అని, దుర్మార్గమైన దోపిడీదారుల ప్రభుత్వం బిజెపి పార్టీదని కెసిఆర్ విమర్శించారు. మోడీ పాలసీ ప్రైవేటైజేషన్ అయితే మా పాలసీ నేషనలైజేషన్ అని కెసిఆర్ పేర్కొన్నారు. మోడీ ఎల్‌ఐసీని అమ్ముతా అని అంటున్నవ్.. అమ్మేయ్ పర్వాలేదు…. 2024 తర్వాత నువ్వు ఇంటికి… మేం ఢిల్లీకి గ్యారంటీగా వెళతామని ఎల్‌ఐసీ, పబ్లిక్ సెక్టార్లను వాపస్ తీసుకుంటామని కెసిఆర్ పేర్కొన్నారు. ఎల్‌ఐసీ సోదరులకు 42లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయని, లక్షలాది మంది ఏజెంట్లు, ఉద్యోగులు ఉన్నారని కెసిఆర్ తెలిపారు. నష్టాలు సమాజానికి లాభాలు ప్రైవేటు వ్యక్తులకా? అని కెసిఆర్ ప్రశ్నించారు. ఎల్‌ఐసీని అడ్డీకి పావుసేరుకు అమ్ముతారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌ఐసీ సంస్థ, ఉద్యోగుల కోసం బిఆర్‌ఎస్ పోరాడుతుందని కెసిఆర్ తెలిపారు. ఎల్‌ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులు బిఆర్‌ఎస్‌ను బలపరచాలని కెసిఆర్ సూచించారు.

బిజెపి దేశంలో మతపిచ్చి లేపుతోంది

దళితబంధును దేశమంతా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నానని, బిజెపి ఇవ్వకపోతే తామే దేశమంతా దళితబంధు ఇస్తామని కెసిఆర్ ప్రకటించారు. ఈ పథకాన్ని భారతదేశమంతా అమలు చేయాలన్నదే బిఆర్‌ఎస్ నినాదం, డిమాండ్ అని కెసిఆర్ స్పష్టం చేశారు. బిజెపి దేశంలో మతపిచ్చి లేపుతోందని సిఎం ఆరోపించారు. దీంతోపాటు అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తానని ఆయన వెల్లడించారు.

మేక్ ఇన్ ఇండియా జోక్ ఇన్ ఇండియాగా….

బిఆర్‌ఎస్ భావజాలం ఉన్న పార్టీ అని అధికారంలోకి వస్తే రెండేళ్లలో భారత్‌ను వెలుగుజిలుగుల దేశంగా తయారు చేస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించారు. కరెంట్ కార్మికులారా? పిడికిలి బిగించండి….విద్యుత్‌ను ప్రభుత్వ రంగంలోనే ఉంచుతాం. ఇంకా దేశంలో లక్ష కోట్ల మెగావాట్ల జల విద్యుత్‌కు అవకాశం ఉంది. అవసరం ఉన్నచోట వ్యాపారం చేయడం ప్రభుత్వ విధానమని కెసిఆర్ పేర్కొన్నారు. విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వమని కెసిఆర్ ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కును మోడీ అమ్మితే తాము అధికారంలోకి వచ్చాక కొంటామని కెసిఆర్ పేర్కొన్నారు. లొడలొడ మాట్లాడే ప్రధానికి మంచి నీళ్లు ఇవ్వడం చేతకాదా? అని కెసిఆర్ విమర్శించారు. మేక్ ఇన్ ఇండియా జోక్ ఇన్ ఇండియాగా మారిందని కెసిఆర్ ఎద్దేవా చేశారు.

దేశ దుస్థితికి కాంగ్రెస్, బిజెపి పార్టీలే కారణం

దేశ దుస్థితికి కాంగ్రెస్, బిజెపి పార్టీలే కారణమని కెసిఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే బిజెపిని తిడుతుందని, బిజెపి అధికారంలో ఉంటే కాంగ్రెస్‌ను తిడుతుందని కెసిఆర్ ధ్వజమెత్తారు. భారత్ అన్ని విధాలా సుసంపన్నమైన దేశమని సిఎం పేర్కొన్నారు. జలవనరులు, సాగు భూమి విషయంలో మన దేశమే అగ్రగామిగా ఉందన్నారు. కానీ, కెనడా నుంచి కందిపప్పు దిగుమతి చేసుకోవడం సిగ్గుచేటు కాదా అని ఆయన ప్రధానిని ప్రశ్నించారు. దేశంలో వ్యవసాయరంగం అభివృద్ధి చెందాల్సిన అవసరం- ఉందని కెసిఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

దేశంలో పెద్ద రిజర్వాయర్ ఉందా ?

ఇండియాలో అందుబాటులో ఉన్న నీటిలో 50 శాతం ఆవిరైపోయిందని, ఇప్పటికీ 70 టిఎంసీల నీరు వినియోగానికి ఉపయోగపడుతోందని కేవలం 20 వేల టిఎంసీలు మాత్రమే వాడుకుంటున్నామని కెసిఆర్ పేర్కొన్నారు. దేశానికి నిర్ధిష్ట లక్ష్యం లేకుండా పోయిందని కెసిఆర్ విమర్శించారు. జింబాబ్వేలో 6 వేల టిఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ ఉందని కెసిఆర్ పేర్కొన్నారు. చైనాలో 5 వేల టిఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్ ఉందని, కానీ దేశంలో అతిపెద్దదైన ఒక్క రిజర్వాయర్ ఉందా అని కెసిఆర్ ప్రశ్నించారు. బకెట్ నీళ్ల కోసం చెన్నై నగరం అర్రులు చాచాలా అని కెసిఆర్ ప్రశ్నించారు. రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాల అవసరం ఎందుకు వచ్చిందని కెసిఆర్ నిలదీశారు.

41 కోట్ల ఎకరాల భూమి సాగుకు యోగ్యమైనది

భారతదేశం విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని కెసిఆర్ పేర్కొన్నారు. భారతదేశం యొక్క లక్ష్యం ఏమిటీ ? భారత్ దిక్కును కోల్పోయిందని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. నేడు భారతదేశం, యూఎస్‌ఏ ఇతరుల నుంచి రుణాల కోసం సహాయం కోరుతోందన్నారు. భారతదేశం పూర్తి ఆస్తులు, సమృద్ధి వనరులతో నిండి ఉన్నాయని, కానీ, ఇండియా మాత్రం ఇతరుల నుంచి సహాయం కోరుతోందని కెసిఆర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భౌగోళికంగా యూఎస్‌ఏ పెద్దదని, కానీ దాని వ్యవసాయ భూమి 29 శాతం మాత్రమేనని, చైనాలో కేవలం 16 శాతం మాత్రమే ఉందని, 83 కోట్ల ఎకరాల భూమిలో 41 కోట్ల ఎకరాల భూమి ఉన్న భారతదేశం సాగు యోగ్యమైయ్యిందని కెసిఆర్ తెలిపారు.

చాటలో తవుడు పోసి కుక్కలకె కొట్లాట…

కేంద్ర వైఖరి చాటలో తవుడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టినట్లుందిగా తయారైందని కెసిఆర్ విమర్శించారు. డొల్ల మాటలు, కల్ల మాటలతో బిజెపి పొద్దుపుచ్చే పరిపాలన చేస్తుందని కెసిఆర్ మండిపడ్డారు. దేశంలో 4.10 లక్షల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉండగా 2 లక్షల మెగావాట్ల విద్యుత్‌ను మించి వాడలేదని ఆయన పేర్కొన్నారు. దేశమంతా తెలంగాణలో ఇస్తున్నట్లుగా ఉచిత కరెంటు ఇవ్వాలని, దీనికయ్యే ఖర్చు లక్షా 45 వేల కోట్లు మాత్రమేనని ఆయన తెలిపారు. రోజూ వేలాది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకు కేంద్రం సిగ్గుపడాలని కెసిఆర్ దుయ్యబట్టారు. ఎన్పీఏల పేరుతో రూ.14 లక్షల కోట్లను దోచిపెట్టారని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పప్పులు, పామాయిల్ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి…

ఇండియాలోని పలు రాష్ట్రాల్లో తేమతో కూడిన వాతావరణం ఉంటుందని కెసిఆర్ పేర్కొన్నారు. భారతదేశంలో పంజాబ్ వంటి చలి ప్రాంతాలు కూడా ఉన్నాయని, యాపిల్, మామిడిపండ్లు మనదగ్గర విరివిగా పండుతాయన్నారు. మనదేశంలో 139 కోట్ల హార్డ్ వర్కింగ్ మ్యాన్ పవర్ ఉందని, కానీ, మనం పిజ్జా, బర్గెట్‌లు తినడం దురదృష్టకరమని కెసిఆర్ తెలిపారు. మనం అద్భుతమైన ఆహార గొలుసు, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఉద్యోగాలు, ప్రపంచంలోని ఉత్తమ ఆహార గొలుసును సృష్టించవచ్చని కెసిఆర్ తెలిపారు. కానీ, పప్పులు, పామాయిల్ దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంకా త్రాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాం

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా భారతదేశం ఇప్పటికీ త్రాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటోందని కెసిఆర్ ఎద్దేవా చేశారు. దేశానికి లక్ష్యాలు లేవనీ, కొన్ని ప్రాజెక్టులు మాత్రమే చేపట్టిందని ఆయన విమర్శించారు. ట్రిబ్యునల్‌లు ఏర్పాటైనప్పటికీ నీటి వివాదాల పరిష్కారంలో ఎలాంటి చర్యలు లేవనీ, ప్రాజెక్టులను ఎప్పుడు పూర్తి చేసి సాగునీరు అందించి వ్యవసాయాన్ని బాగు చేస్తారో చెప్పాలని ఆయన బిజెపిని డిమాండ్ చేశారు. నీటిని వినియోగించుకునే ప్రణాళికలు కూడా మన వద్ద లేవనీ ఆయన ఆరోపించారు.

బిఆర్‌ఎస్ లక్ష్యాలను సాధించడానికి….

రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని కెసిఆర్ దుయ్యబట్టారు. రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించడంలో బిజెపి ప్రభుత్వం విఫలమైందన్నారు. తాగునీటి సంక్షోభం, నీటిపారుదల సమస్యలను పరిష్కారానికై బిఆర్‌ఎస్ ముందుంటుందని కెసిఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమం మాదిరిగానే బిఆర్‌ఎస్ లక్ష్యాలను సాధించడానికి భారతదేశంలో మరో ఉద్యమం చేపట్టనున్నట్టు కెసిఆర్ పేర్కొన్నారు. నదీజలాల కోసం హర్యానా, తమిళనాడు, కర్ణాటకలు కావేరీ నీటి కోసం పోరాడుతున్నాయని, తెలంగాణ, మహారాష్ట్ర, ఎపి, కర్ణాటకలు గోదావరి కోసం పోరాడుతున్నాయని కెసిఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమం తరహాలోనే…

రష్యాలోని అంగారా నదిపై 5968 టిఎంసీల ప్రాజెక్టు ఉండగా, ఘనాలో 5085 టిఎంసీల ప్రాజెక్టు, కెనడాలో 4944 టిఎంసీల ప్రాజెక్టు, ఈజిఫ్ట్ నైలునదిపై 4500 టిఎంసీల ప్రాజెక్టు, పొరుగు దేశం చైనాలో యాంగ్జీ నదిపై 1400, అమెరికాలోని కొలరాడోలో 1200 టిఎంసీల ప్రాజెక్టు ఉందని కెసిఆర్ వివరించారు. సువిశాల దేశమై మన ఇండియాలో ఒక్క ప్రాజెక్టు వద్దా ? మంచినీళ్లకు బాధపడుదామా? సరైన పరిపాలన వచ్చి నదుల నీళ్లు భూమి మీదకు వచ్చి ప్రజల, పొలాల దాహం తీర్చాలా అని కెసిఆర్ ప్రశ్నించారు. ఇలాంటివి ప్రశ్నించడానికి, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి బిఆర్‌ఎస్ పుట్టిందని కెసిఆర్ తెలిపారు. కచ్చితంగా ఆరు,నూరైనా తెలంగాణ ఉద్యమం తరహాలో భారతదేశంలో ఉద్యమం తెచ్చేందుకు సిద్ధమని కెసిఆర్ ప్రకటించారు.

తమకు ప్రజలు తప్ప వేరే ఉద్దేశం లేదు…

పొద్దుపుచ్చే పరిపాలకులు కావాలా? నిజాయితీగా పనిచేసే వారు కావాలా? మన కాళేశ్వరం కాలేదా? పాలమూరు అవుతలేదా? సీతారామ ఖమ్మంలో పరుగులు పెడుతలేదా? అనవసరంగా పడుతున్న, పెడుతున్న కష్టాల నుంచి భారత జాతిని విముక్తి చేసేందుకే బిఆర్‌ఎస్ పోరాటం చేయనుందని కెసిఆర్ తెలిపారు. తమకు ప్రజలు తప్ప వేరే ఉద్దేశం లేదనీ, ఈ దుర్మార్గానికి కారణభూతులు కాంగ్రెస్, బిజెపిలేనని ఆయన ఆరోపించారు. మన గొంతులు తడవాలా? పొలాలు పండాలా? దయచేసి ఆలోచించాలని ఆయన ప్రజలకు కెసిఆర్ పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News