Sunday, December 22, 2024

దళారులు మోపైన్రు..

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ బ్యూరో / గద్వాల ః రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న ధరణిని తీసేస్తామంటున్న కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ది చెప్పాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలపునిచ్చారు. అదిలాబాద్ మొదలుకొని అన్ని జిల్లాలో రైతులకు అడుగుతున్నాను… రైతులందరూ ధరణి ఉండాలని కోరుకుంటున్నారు..ధరణి వలన నేను ఒక్క బటన్ నొక్కితే ఎలాంటి దళారుల బెడద లేకుండా నేరుగా రైతుల అకౌంట్లో జమ అవుతున్నాయి… కాంగ్రెస్ ధరణి తీసేస్తే డబ్బులు పడవు… తమ భూములు అమ్మాలన్నా, కొనుగోలు చేయాలన్నా ఒకప్పుడు ఎన్ని కష్టాలు, అన్నింటికి లాంచాలు ఇవ్వాలి. విఆర్‌ఒలు, పట్యారీలు, దళారులు ఇలా అందరూ కలిసి రైతును ముంచే వారు..

నేడు వారెవరూ లేరు. నేరుగా ఒక్క రోజులోనే వేలి ముద్ర వేస్తే చాలు అదే రోజు భూమి పాస్‌బుక్కు మీ చేతికిందిస్తారు. ఇంత మంచి ధరణిని తీసేస్తామంటున్న కాంగ్రెస్‌కు మీరే తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సోమవారం గద్వాల జిల్లాలో పర్యటించారు. ముందుగా నూతనంగా నిర్మించిన ఎస్‌పి భవనాన్ని,బిఆర్‌ఎస్ కార్యలయంతో పాటు,నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభ వేదిక చేరుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

ఆనాడు ఆర్‌డిఎస్‌ను గద్దల్లా తన్నుకు పోతే నేనే ఆపినా ః
ఉమ్మడి రాష్ట్రంలో అలంపూర్,గద్వాల ప్రాంతం కరువుతో విలవిలాడేది..ఎక్కడ చూసినా బీడు భూములే ఉండేవి. ఆ నాడు పాలమూరు లో ఎక్కడ చూసినా గంజి కేంద్రాలే..ఆ నాడు ఆంద్రా పాలకులు సాగునీరు రాకుండా ఆర్‌డిఎస్‌ను గద్దల్లా తన్నుకు పోయారు. రైతుల ఘోస చూసి నేను ఆ రోజు జోగులాంబ దేవాలయం నుంచి ఆర్‌డిఎస్ వరకు పాదయాత్ర చేసి అడ్డుకున్నాను. కృష్ణ, తుంగబద్ర నదుల మద్య ఉన్న నడిగడ్డలో ఆ నాడు ఎక్కడ చూసినా హృదయ విదారకర పరిస్దితులు చూసి కన్నీళ్లు పెట్టుకున్నట్లు కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రలయ గర్జనతో తెలంగాణాను సాధించుకున్న తర్వాత అనేక పాలనా సంస్కరణలు చేసుకున్నామని, అందులో బాగంగానే గద్వాల జిల్లాను ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. జిల్లాలో ప్రజలందరిపై జోగులాంబ అమ్మవారి దీవెనెలు ఉండాలని ఆకాకింక్షించి జిల్లాకు జోగులాంబ నామకరణం చేసుకున్నామన్నారు.

ఆ నాడు నాకంటే దుడ్డుగా,పొడుగ్గా ఉన్నోళ్లు ఏమి చేశారో చెప్పాలి ః
ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఉన్న మంత్రులు కెసిఆర్ కంటే దుడ్డుగా, పొడవు ఉన్న వారు ఏమి చేయలేదని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూలకు పడ్డ నెట్టెం పాడు, ర్యాలంపాడును మేము వచ్చిన తర్వాత బాగు చేసుకున్నామని స్పష్టం చేశారు. ఈ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఇద్దరూ తెలంగాణా ఉద్యమ కారులున్నారు.మంత్రి నిరంజన్ రెడ్డి ప్రజల్లో తెలంగాణా ఉద్యమాన్ని రగిలించగా, మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన ప్రభుత్వ ఉద్యోగాన్ని లెక్క చేయకుండా ఉద్యోగులను తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున చేపట్టారు., మరో మాజీ మంత్రి లకా్ష్మరెడ్డి కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమంకు కోసం ఊపిరి పోశారు..

వీరందరూ ఇప్పుడు ఉన్నారు కాబట్టే ఉమ్మడి పాలమూరు జిల్లా ఐదు జిల్లాలుగా మారిందన్నారు. ఐదు మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నామని తెలిపారు. కల్వకుర్తి, నెట్టెం పాడు,భీమా,జూరాల, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులు పూర్తి చేసుకొని 15 నుంచి 20 లక్షల ఎకరాల వరకు సాగునీరు తెచ్చుకున్నామని కెసిఆర్ తెలిపారు. గతంలో ఇక్కడి నేతలు అడ్డం పొడవు మాట్లాడారు..అయినా ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని కెసిఆర్ స్పష్టం చేశారు. గతంలొ పాలమూరు జిల్లాలో 14 రోజులకు ఒక సారి తాగునీరు వచ్చేది… తెలంగాణా వచ్చిన తర్వాత మిషన్ బగీరథ ద్వారా అడపిల్లల కోసం ప్రతి ఇంటికి నల్లాలు తెచ్చుకున్నామని, ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవని అన్నారు.
ఆ నాడు రాష్ట్రం విడిపోదామంటే కరెంటు రాదన్నారు…ఇప్పుడు కర్నూలుకు వెళ్లి చూడండి ః
ఆ నాడు రాష్ట్రం విడిపోదామంటే ఇక్కడ కరెంట్ రాదని.. కష్టాలు ఎదుర్కొంటారని ఏవేవో చెప్పారు.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 24 గంటలు కరెంటు ఇచ్చుకోగల్గుతున్నాము….పక్కనే తుంగబద్ర నది ఉంది.. దాని పక్కన ఆంద్రా రాష్ట్రం కర్నూలు ఉంది. అక్కడికెళ్లి కరెంట్ ఎన్ని గంటలు ఉంటుందో చూడాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. మనం 24 గంటలు కరెంటు ఇస్తుంటే అక్కడ నాలుగు గంటలు కూడ ఉండడం లేదన్నారు.

గతంలో పాలమూరు నుంచి ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లే వారని, తెలంగాణా తెచ్చుకున్న తర్వాత పాలమూరు గణనీయంగా అభివృద్ది పథంలో దూసుకుపోతోంది.. తాను బస్సులో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి జాతీయ రహదారి వెంబడి బస్సులో వెళ్తుంటే ఎక్కడ చూసినా దాన్యపు రాసులు, కొనుగోలు కేంద్రాలు, వరికోత యంత్రాలు కనిపించాయి. నేను ఎంతో సంతోషపడ్డాను. ఇప్పుడు కర్నూలు,రాయచూరు.బీహార్, ఉత్తర ప్రదేశ్ నుంచి పాలమూరుకు వలసలు వచ్చి జీవనం పొందుతున్నారని కెసిఆర్ సంతోషం వ్యక్తం చేశారు.

ధరణి ఉండాలని చేతులు పైకెత్తి మద్దతు పలికిన ప్రజలు ః
ధరణిని కాంగ్రెస్ తీసేస్తామని అంటోందని, ధరణీ తీసేద్దామా ? వద్దా ? ధరణి ఉండాలనుకునే వారు చేతులు పైకెత్తి మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపిచ్చిన వెంటనే సభలో ఒక్కసారిగా వేలాది మంది ప్రజలు తమ రెండు చేతులెత్తి మద్దతు పలికారు. ఈ సందర్బంగా రైతు బంధును తీసేస్తామనే కాంగ్రెస్‌కు తగిన బుద్ది చెప్పి బిఆర్‌ఎస్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కెసిఆర్ స్పష్టం చేశారు. ధరణి ఉంది కాబట్టే రైతు బందు డబ్బులు డబ్బలు పడుతున్నాయి… రైతు చనిపోయిన 15 రోజుల్లోనూ రూ. 5 లక్షలు బ్యాంకు అకౌంట్లలో జమ అవుతున్నాయి.

ధరణి ఉంది కాబట్టే దాన్యం డబ్బలు పడుతున్నాయి. ఇలా ఎంతో మేలు చేసే ధరణి తీసేస్తామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అదే జరిగితే ఇవేవి పడవని చెప్పారు. రాష్ట్రంలో 1001 రెసిడెన్సియల్ పాఠశాలలు ఏర్పాటు చేసుకొని ఎస్‌సి,ఎస్‌టి, బిసి,మైనార్టి విదార్దులకు నాణ్యమైన విద్యను అందించుకుంటున్నామన్నారు. ప్రజా సంక్షేమం కోసమే అనేక పథకాలు ఇస్తున్నామని కెసిఆర్ చెప్పారు.
గద్వాలకు వరాలు జల్లు ః
ఈ సందర్భంగా గద్వాల జిల్లాకు సిఎం కెసిఆర్ వరాల జల్లు కురిపించారు. గ్రామ పంచాయితీలకు రూ. 10 లక్షలు
, మండలాలకు రూ.12 లక్షలు, మున్సిపాల్టీలకు 15 లక్షలు, గద్వాల మున్సిపాల్టీకి రూ. 50 లక్షులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రజలందరి కోరిక మేరకు మల్లమ్మ కుంట రిజర్వాయర్‌ను త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ బహిరంగ సభలో మంత్రులు నిరంజన్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్, మహ్మద్ ఆలీ, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహాం, లకా్ష్మరెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రాంమ్మోహన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఎంఎల్‌సి చల్లా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేశంలో అన్ని రంగాల్లో తెలంగాణే నెంబర్ వన్ ః
నూతన కలెక్టరేట్ సమీకృత భవనం ప్రారంభించిన అనంతరం అధికారులతో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమ రంగాలతో పాటు అభివృద్ది రంగంలోనూ దేశంలో మన తెలంగాణనే నెంబర్ వన్‌గా ఉన్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. నూతన కలెక్టరేట్ సమీకృత భవనాన్ని ప్రారంభించిన ఆయన అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు.తెలంగాణా సాధించుకున్న తర్వాత ప్రగతి ఫథంలో ముందుకు సాగుతున్నామని అన్నారు. తలసరి ఆదాయంలోనూ మనమే ఆగ్రస్దానంలో ఉన్నామన్నారు. ఐటి ఎగుమతుల్లో గతంలో రూ.56 వేల కోట్లు ఉంటే తెలంగాణా సాధించుకున్న తర్వాత 2.67 లక్షల ఎగుమతులుకు చేరిందన్నారు. ఐటి ఇండస్ట్రీ రంగంలో సైతం తెలంగాణా దూసుకుపోతోందని కెసిఆర్ స్పస్టం చేశారు. ప్రపంచలోనే విద్యుత్, తాగునీటి రంగంతో పాటు అనేక రంగాల్లోనూ తెలంగాణాను ముందు వరసలో ఉన్నామని తెలిపారు.

మానవీయ కోణంలో ఆలోచించి కంటివెలుగు కార్యక్రమాన్ని తీసుకొచ్చామన్నారు. మరో ఐదేళ్లు కష్టపడితే తెలంగాణా భవిష్యత్‌లో మరింత ప్రగతి సాధిస్తుందని ఉద్యోగులకు సూచించారు. ఒకప్పుడు గద్వాల జిల్లా ఎట్లా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించాలన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అద్బుతంగా నూతన కలెక్టరేట్ భవనాలతో పాటు, నూతనంగా ఐదు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. గట్టు లిఫ్ట్ పూర్తి అయితే గద్వాల జిల్లా ఒక వజ్రపు తునక, బంగారు తునకలా మారుతుందన్నారు. తుమ్మిళ్ల పూర్తి చేసుకుంటే ఆర్‌డిఎస్ నుంచి నీరు అందించి అలంపూర్‌ను సస్యశ్యామలం చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News