సిద్దిపేట: మల్లన్న సాగర్ జలాశయం సినిమా షూటింగ్‌లకు కేంద్రంగా మారాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఆ స్థాయిలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. జిల్లాలో మల్లన్న సాగర్ ప్రాజెక్టును బుధవారం సిఎం కెసిఆర్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. ”ఇల్లంతకుంటలో అన్నపూర్ణ రిజర్వాయర్ వద్ద బ్రహ్మాండమైన ప్రకృతి సౌందర్యం ఉంది. అక్కడ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కొట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నాబిడ్డ. ఏడుపాయల వద్ద అద్భుతమైన జలపాతం ఉంది. మల్లన్నసాగర్‌తో సింగూరు ప్రాజెక్టును నింపుతారు. కాబట్టి ఏడుపాయల వద్ద టూరిజం ప్యాకేజీ కావాలని ఆమె అడుగుతున్నారు. అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్ రిజర్వాయర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్, బస్వాపూర్ రిజర్వాయర్, ఏడుపాయల వనదుర్గామాత వద్ద టూరిజం అభివృద్ధికి రూ.1500 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నాను. ఈ ఐదు ప్రాంతాల్లో అద్భుతమైన టూరిజం అభివృద్ది చేయాలి. హాలీవుడ్ సినిమా, హిందీ సినిమాలు ఇక్కడ షూటింగ్ చేసుకునే విధంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి. మల్లన్న సాగర్ ప్రాజెక్టు మధ్యలో ఐలాండ్స్ ఉన్నాయి. మల్లన్న సాగర్ వద్ద 7,500 ఎకరాల అటవీ సంపద ఉంది. రిజీనల్ రింగ్ రోడ్డు కూడా రాబోతుంది. రెండు ఫోర్ లైన్ రోడ్లు ఈ ప్రాజెక్టు వద్దకు వేయాలి” అని పేర్కొన్నారు.
CM KCR Speech at Mallanna Sagar Project Inauguration