Tuesday, January 28, 2025

రైతు వ్యతిరేక పార్టీలకు బుద్ధి చెప్పాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/మెదక్ ప్రతినిధి : ఎన్నికలగానే అధికారదాహంతో కొన్ని పార్టీలు ప్రజలను మో సపూరిత వాగ్దానాలతో మభ్యపెడుతున్నాయి. అలాంటి మోసగాళ్ల మాటలను నమ్మితే గోసపడతామని బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్, బిజెపిలకు బుద్ధి చెప్పాలని స్పష్టం చేశారు. అధికార కాంక్షతో ఈ రెండు పార్టీలు అలవికాని వాగ్దానాలు చేస్తున్నాయని అన్నారు. మేం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వనివి కూడా అమలు చేశామన్నారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే తెలంగాణ ఆర్థికంగా ఎంతో ప్రగతిని సాధించిందన్నా రు. బుధవారం మెదక్‌జిల్లాలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, పార్టీకార్యాలయాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన చర్చ్ గ్రౌండ్‌లో జరిగిన ప్రగతి శంఖారావం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రజల్లో మంచి నాయకులు ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఒకప్పటి సమైఖ్యాంధ్ర పాలనలో వివక్షకు గురైన మెతుకుసీమ స్వరాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చెందిందని అభివర్ణించారు.

గతంలో ఇక్కడి ప్రాంత వాసులు జిల్లా కేంద్రం కోరుకోగా అది తమ ప్రభుత్వం నెరవేర్చిందని, మనం 33 జిల్లాలను ఏర్పాటు చేసుకోవడమేగాక 24వ కలెక్టరేట్లను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని సిఎం చెప్పారు. అదేవిధంగా దివ్యాంగులకు ఇదివరకు 3016 రూపాయల అసరా పెన్షన్ అందేదని ప్రస్తుతం రూ.4016లకు పెంచుతామని ప్రకటించి 50 మంది లబ్ధిదారులకు నూతన కలెక్టరేట్ భవనంలో పెంచిన పెన్షన్ చెక్కులను అందజేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా గతంలో బీడీ కార్మికులు ఇప్పుడు బీడీ, టీకేదార్లకు ఆసరా పించన్ వర్తింపు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించారు. అందే విధంగా రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తూ రెండు రోజుల్లో అందుకు సంబంధించిన జీఓను కూడా అధికారికంగా విడుదల చేస్తామన్నారు. దీంతో పాటు రామాయంపేట, కౌడిపల్లిలో డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేస్తామని, మెదక్‌కు రింగ్ రోడ్డు కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ఏడుపాయలలోని ఘనపురం ఆయకట్ట ఎత్తు పెంపు కోసం రూ.100 కోట్లు ప్రకటించామని అవి వెంటనే మంజూరు చేస్తున్నామన్నారు. జిల్లాలో గల 469 గ్రామ పంచాయతీలకు 15లక్షల చొప్పున ప్రత్యేక నిధులను విడుదల చేయడంతో పాటు మెదక్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట మున్సిపాల్టిలకు 25కోట్ల చొప్పున మంజూరు నిధులు చేయనున్నట్లు పేర్కొన్నారు.

అద్భుత పనులు చేశాం:
తెలంగాణలో తాము ఎన్నో అద్భుత పనులు చేసి దేశానికే మార్గదర్శకంగా నిలిచామని కెసిఆర్ అన్నారు. తెలంగాణలోని అనేక జలాశయాలు 365 రోజులూ పారే జీవధారలుగా మారాయని అన్నారు. పచ్చటి పంటపొలాలతో తెలంగాణ కళకళలాడుతున్నాయని అన్నారు.రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. పరిపాలన రాదని ఎద్దేవా చేసిన వారికి పాలన ఎలా చేయాలో చేసి చూపించామని చెప్పారు. తెలంగాణలో జరిగిన అభివృధ్దే నిదర్శనమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మంచి పాలన అందించేందుకు కలెక్టరేట్ కార్యాలయాన్ని నిర్మించుకున్నామన్నారు. తెలంగాణకు అద్భుతమైన సచివాలయాన్ని నిర్మించుకున్నామని, ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాల్లో సచివాలయాలు కూడా సరిగ్గా లేవు. ప్రజలు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నది కూడా తెలంగాణ రాష్ట్రమేనని అన్నారు.రైతులకు అద్భుతమైన పథకాలు రైతుబంధు, రుణమాఫీ, రైతుబీమా వంటి అనేక పథకాలకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రజలు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి నిజంగా ప్రజలకు ఎవరు చేస్తున్నారో గుర్తుంచుకోవాలన్నారు. విజ్ఞతతో వ్యవహరించి నిండు మనసుతో బిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు.

రైతు రాజ్యాన్ని స్ధాపించాం:
తెలంగాణలో రైతుల కోసం అనేక పదకాలు అమలుజరుగుతున్నాయని, దేశంలో ఇలాంటి పథకాలు ఏరాష్ట్రంలోనూ లేవని సీఎం పేర్కొన్నారు. కుంట భూమి ఉన్న రైతుకు సైతం 5లక్షల బీమా కల్పిస్తున్నాం. గతంలో ఎవరైనా రైతు చనిపోతే 50 వేల రూపాయలు ఇచ్చేవారు. ఆర్నెళ్ళు, ఎనిమిదినెళ్లు చెప్పులరిగేలా తిరిగితే 20-30 వేలు చేతుల పెట్టి పంపించే పరిస్థితి ఉండేది. అమెరికా, ఇంగ్లాండే కాదు,దేశంలోని ఏరాష్ట్రంలోనూ తెలగాణలోని పధకాలు అమలు కావడం లేదన్నారు. రైతుబంధుతో పాటు ఇప్పటి వరకూ 37వేలకోట్ల రైతు రుణమాఫీ చేశామన్నారు.అంగన్ వాడీల సంక్షేమానికి పాటుపడుతున్నాం.

రాష్ట్రంలో రైస్ మిల్లులు కూడా సరిపోని విధంగా ధాన్యం ఉత్పత్తి జరుగుతోందని,వరి ధాన్యం పండియ్యడంలో పంజాబ్ ను తలదన్ని మొదటి స్థానికి ఎదిగామని ముఖ్యమంత్రి అన్నారు. జపాన్ నుంచి ఆధునిక రైస్ మిల్లులు ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఏగ్రామంలో చూసినా కల్లాలన్నీ నిండిపోయి కనిపిస్తున్నాయి. గ్రామపంచాయితీలకు నిధులు ఇస్తున్నాం. ఇటీవల తాను మహారాష్ట్రంలో పర్యటిస్తే అక్కడి రైతులు కూడా మన పథకాలకు ఎంతో ఆకర్షితులవుతున్నారు. మా రాష్ట్రంలోనూ ఇలాంటి పధకాలు కావాలని మేం ఇక్కడ గెలిపించుకుంటామంటున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రైతుల ఆత్మహత్యలు లేవని, ఎటుచూసినా పల్లెలు పచ్చదనంతోనిండిపోయాయని, రైతుల ముఖాలు తెల్లబడ్డాయని ముఖ్యమంత్రి పేర్కొన్నరు.

కాంగ్రెస్‌కు ఒక్కఛాన్స్ ఎందుకివ్వాలి?
వచ్చే ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు పాలించి, ఏం ఒరగబెట్టిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, టిడిపి అధికారంలో ఉన్నా ప్రజలకు ఒరిగింది శూన్యమని సీఎం కేసీఆర్ అన్నారు. బిఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ పచ్చబడి లక్ష్మీకళతో ఓలలాడుతున్నదని సీఎం తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని ఆయా రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారని సీఎం పేర్కొన్నారు.కర్నాటకలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్ధానాలను అమలు చేయకుండా రైతులకు ఉదయం 3 గంటలు,

రాత్రి 4 గంటల చొప్పున కేవలం 7 గంటల కరెంటునిస్తున్నది. తెలంగాణలో సంక్షేమం వర్ధిల్లాలంటే ప్రజలు మరోమారు బిఆర్‌ఎస్ ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆనాడు 200 రూపాయల పెన్షన్ ఇచ్చినోడు నేడు నీకు కొండమీద కోతిని తెచ్చిస్తా. ఏడు చందమామలను తెచ్చిస్తా, సూర్యుని తెచ్చిస్తా, 4000 రూపాయల పెన్షన్ ఇస్తా అంటున్నాడు. 200 రూపాయలు ఇచ్చినోడు నేడు 4000 ఇస్తా అంటే నమ్మొచ్చా అంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు.
ఇదేమన్నా అర్రాస్ పాటనా.. మేం కూడా ప్రకటించి మోసం చేయవచ్చు గదా.. కానీ మేం మోసం చేయం. క్రమపద్ధతిలో ఏ విధంగా పెంచాలో ఆ విధంగా పెంచుకుంటూ పోతాం. అక్టోబర్ 16 నాడు జరిగే మహాసభలో ప్రకటించుకుందామని అన్నారు.

ధరణి తీయడం ఎవరి తరం కాదు:
తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ధరణి పోర్టల్ ప్రారంభించింది. దీని వల్ల అవినీతి తగ్గింది. దీనిని కొనసాగించాలని ప్రజలు కోరుకుంటున్నారని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు.తాము అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ధరణిని తీసేస్తామన్న వారిని బంగాళాఖాతంలోకి విసిరి కొట్టాలన్నారు. ధరణి రావడంతోనే 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయి. ముఖ్యమంత్రి, సీఎస్‌లు కూడా మార్చలేరని, ఇలాంటి మంచి విధానాన్ని కాదని ధరణిని తొలగిస్తే మళ్లీ పైరవీ కారుల రాజ్యం వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

భగీరథతో నీటి సమస్యలకు ఫుల్‌స్టాప్:
మిషన్ భగీరధతో తెలంగాణలోని ప్రతి పల్లెలోనూ ఇంటింటికీ శుభ్రమైన తాగునీరు సరఫరా అవుతోంది. 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ప్రజలు, రైతులు నిత్యం నీటి సమస్యతో కొట్టుమిట్టాడేవారు. ప్రతి గ్రామానికి, పట్టణానికి నీళ్లు ఇవ్వడమే కాకుండా నగరాల్లో రూపాయికే నీటి కనెక్షన్ ఇచ్చామని కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలోని 1.3 కోట్ల కుటుంబాలకు నీటి సౌకర్యం కల్పిస్తున్నరాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని అన్నారు. బ్రహ్మాండంగా ప్రాజెక్టులు కట్టుకున్నాం, పుష్కలంగా నీటి లభ్యత వుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఘనపూర్ ఆయకట్టులో గతంలో నీళ్లు వచ్చేవి కాదు. కానీ పుష్కలంగా నీరు వుందన్నారు. ఘనపరం హైటు పెంచుకొని, కాల్వలు బాగు చేసుకున్నాం. ఈ రోజు 30 నుంచి 40 వేల ఎకరాలకు నీళ్ళు బ్రహ్మాండంగా అందించుకుంటున్నాము.

గతంలో భూములున్న రైతన్నలు వ్యవసాయానికి నీరు లేక హైదరాబాద్‌కు వలసపోయే వారని, భూములున్న ఆసాములు కూడా రిక్షాలు, ఆటో రిక్షాలు నడిపిన రోజులున్నాయని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వుందా? అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ అధికారంలో ఉన్నప్పడు నీళ్లు కావాలంటే ఆర్డీవో ఆఫీసు వద్ద ధర్నా చేయాలి. ధర్నా చేస్తే తప్ప నీళ్లు వచ్చే పరిస్థితి వుండేది కాదు. ఘనాపూర్ కాల్వలో తుమ్మ చెట్లు మొలిచేవి. కానీ నేను సీఎం అయ్యాక ఘనాపురం ఎత్తు పెంచుకున్నాం. కాల్వలు బాగు చేసుకున్నాం. 30 నుంచి 40 వేల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నామని అన్నారు. గతంలో కాంగ్రెస్ నాయకులు సింగూరు ప్రాజెక్టును హైద్రాబాద్‌కు ఇచ్చి ఇక్కడ మన పొలాలను ఎండబెట్టారని అన్నారు. కానీ ఇప్పుడు సింగూర్‌ను మెదక్‌కే డెడికేట్ చేసుకున్నాం, దీం జోగిపేట ప్రాంతంలో నీళ్లు పారుతున్నాయి. ఘనపూర్ ఆయుకట్టు కింద ఒక్క గుంట కూడా ఎండిపోకుండా పంటలు పండించుకుంటున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు.కాళేశ్వరం లో భాగంగా కట్టుకున్న మల్లన్నసాగర్ నుంచి అవసరమైనప్పుడు నీళ్ళు కాల్వలలోకి విడుదల చేసుకుంటున్నామన్నారు.

ప్రాణం పోయినా మీటర్లు పెట్టనివ్వను:
తెలంగాణలో రైతులకు 24గంటలు విద్యుత్ సరఫరా చేస్తుంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఓర్వలేక పోతున్నాయని ముఖ్యమంతి విమర్శించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతుల విద్యుత్‌మోటార్లకు మీటర్లు బిగించాలని ఒత్తడి తెస్తుంటే, కాంగ్రెస్ పార్టీ నేతలు ౩గంటలే సరిపోతాయని అంటున్నారన్నారు. మీటర్లను పెట్టుకోమని అన్నందుకే కేంద్రం 25వేల కోట్ల నష్టం కలిగించిందన్నారు. నా ప్రాణం పోయినా విద్యుత్ మోటార్లకు మీటర్లను పెట్టనివ్వనని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇంత అభివృద్ధి చేసి ప్రజలను కాపాడుకుంటున్న మనం దుర్మార్గులకు, చేతకాని వారికి అధికారం అప్పగిద్దామా? అంటూ ప్రజల్ని ప్రశ్నించారు.

రామాయం పేటను రెవెన్యూ డివిజన్ చేస్తాం:
రామాయంపేట రెవెన్యూ డివిజన్ కావాలని పద్మ కోరింది. రెండు రోజుల్లో అది మంజూరు చేసి జీవో కూడా ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే రామాయం పేట డిగ్రీ కాలేజీని కూడా మంజూరు చేస్తున్నాం.మెదక్ రిండు రోడ్డు కూడా మంజూరు చేస్తాం. గతంలో ప్రకటించిన టూరిజం ప్యాకేజీలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం.మదన్ రెడ్డి కోరిక మేరకు కౌడిపల్లిలో డిగ్రీ కాలేజీని మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.మెదక్ జిల్లాలో 469 గ్రామపంచాయతీలకు, ప్రతి పంచాయతీకి రూ. 15 లక్షల రూపాయల చొప్పున ప్రత్యేకమైన నిధిని కూడా మంజూరు చేస్తున్నామని అన్నారు. అదే విధంగా మెదక్ లో నాలుగు మున్సిపాలిటీలున్నాయి. నర్సాపూర్, రామాయంపేట, తూఫ్రాన్ లకు తలా 25 కోట్ల రూపాయల చొప్పున, మెదక్ మున్సిపాలిటీలకు 50 కోట్ల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఉద్యమ కార్యకర్త నుంచి జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా ఎదిగిన బిడ్డ పద్మను భారీ మెజార్టీతో గెలిపించాలని కెసిఆర్ కోరారు. పద్మా దేవేందర్ రెడ్డిగారి పనితనం చూసి మళ్ళీ ఆమెకే టికెట్ ఇచ్చాం. మెదక్ నియోజకవర్గాన్ని, పట్టణాన్ని ఆదర్శ నియోజకవర్గంగా సిద్దిపేట మాదిరి తీర్చిదిద్దే బాధ్యతను మంత్రి హరీష్ రావు కు నేను అప్పగిస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు.

 

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించిన సీఎం
మెదక్ జిల్లా సమీకృత కార్యాలయాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రారంభించారు. కొత్త కలెక్టరేట్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాకముందు మీకు పరిపాలన చేతకాదన్నారు. తెలంగాణ బిడ్డలకు పరిపాలన ఎంత చేతనైతదో చూపించేందుకు నేడు ప్రారంభించుకున్న జిల్లా ఎస్పీ కార్యాలయం, కలెక్టరేట్ కార్యాలయాలే నిదర్శనమన్నారు. 33 జిల్లాలు ఏర్పాటు చేసుకోవడమే కాదు, 24వ కలెక్టరేట్ బిల్డింగ్ ను ప్రారంభించుకున్నామని అన్నారు.దేశం, రాష్ట్రం, పట్టణం, జిల్లా ఏ స్థాయిలో ఉన్నవో తెలుసుకోవడానికి కొన్ని గీటురాళ్ళు ఉంటాయి. అనతి కాలంలోనే తెలంగాణ గొప్ప ప్రగతిని సాధించిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలను కూడా అధిగమించి తెలంగాణ రాష్ట్రం తొమ్మిది సంవత్సరాల అనతి కాలంలోనే తలసరి ఆదాయంలో నెంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం పేర్కొన్నారు.ద ఎక్స్ లెన్స్ ఆల్వేస్ రిమేన్స్ అండ్ ద క్వెస్ట్ నెవర్ ఎండ్స్ అదే పద్ధతిలో మనం రిలాక్స్ కాకుండా చాలా చక్కగా ముందుకు పోతున్నామని సీఎం అధికారులను అభినందించారు. రాష్ట్రాన్ని మరింతగా తీర్చిదిద్ది, గొప్పగా తయారుచేయడంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు,

భారీగా తరలి వచ్చిన నేతలు:
ఈ కార్యక్రమాల్లో మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, మధుసూదనా చారి, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, మదన్ రెడ్డి, జీవన్ రెడ్డి, మాణిక్ రావు, జాజాల సురేందర్, గూడెం మహిపాల్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, వివిధ సంస్థల చైర్మన్లు పోలేటి దామోదర్, భిక్షపతి, ఒంటేరు ప్రతాప రెడ్డి, తన్వీర్, దేవేందర్ రెడ్డి, ఆర్ అండ్ బి మున్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లు హేమలత, రోజాశర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, డీజీపీ అంజనీ కుమార్, పంచాయితీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సిఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, ఆర్ అండ్ బీ ఈఎన్ సి గణపతి రెడ్డి, ఆర్కిటెక్ట్ ఉషా రెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మన్ శివ కుమార్, మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News