హైదరాబాద్: ఆనాటి నుంచి నేటి వరకు కూడా మన విద్యార్థి శ్రేణులు చాలా అద్భుతంగా మందుకు వచ్చి పోరాటం చేశారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రశంసించారు.ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్మారక కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కెసిఆర్ ప్రసంగించారు. ఉద్యమం ప్రారంభించిన మొదట్లో వి.ప్రకాశ్, మధుసూదనాచారి లాంటి పిడికెడు మందితో మేధోమదనం చేశామని కెసిఆర్ తెలిపారు. ఈ సారి రాష్ట్రం సాధించి తీరాలన్న ఉద్దేశంతో అనేక మంది వ్యక్తులను కలిశామన్నారు. ఒక వ్యూహాం రచించుకొని బయల్దేరామని, ఆ బయల్దేరే సందర్భంలో ప్రొఫెసర్ జయశంకర్‌ను కలిశామని కెసిఆర్ పేర్కొన్నారు. ఆయన ఆజన్మ తెలంగాణవాది అని, కానీ, ఆయనకు రెండు సిద్ధాంతాలు బలంగా ఉండేవని కెసిఆర్ తెలిపారు.
ఒకటి తెలంగాణ రాష్ట్ర సాధన కాగా, రెండోది శనివారం పూర్తిగా నిరాహారంగా ఉపవాసం ఉండేవారని కెసిఆర్ పేర్కొన్నారు. ఏ ఒక్క సందర్భంలో కూడా జయశంకర్ వెనుకడగు వేయలేదన్నారు. 1969 ఉద్యమం తర్వాత ఏం జరిగిందని జయశంకర్‌ను అడిగామని, కెసిఆర్ లాంటి వ్యక్తి రాకపోతడా అని చెప్పేవారన్నారు. తెలంగాణ ఉద్యమ సోయి బలతికుండాలని ప్రయత్నాలు చేశామని కెసిఆర్ చెప్పారు. లెఫ్ట్ పార్టీలు కూడా ఉద్యమానికి జీవం పోశాయని, ఉద్యమాన్ని సజీవంగా ఉంచేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయని కెసిఆర్ తెలిపారు. మలిదశ ఉద్యమంలో అనేక రకాల చర్చలు, వాదోపవాదాలు, హింస, పోలీసు కాల్పులు, ఉద్యమం నీరుగారిపోవడం వంటివి చూశామని కెసిఆర్ గుర్తు చేశారు.