హైదరాబాద్: చేయగలిగే సామర్థ్యం, సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదిగే వనరులను భారత్ కలిగి ఉందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. బుధవారం మాదాపూర్ లో నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. ”దేశం బాగు కోసం ఒక ప్రాసెస్ జరగాలి. దేశానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్‌లు కాదు..దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా కావాలి. భారతదేశ ప్రజలకు అనుకూలమైన ఫ్రంట్ రావాలి. దేశం బాగుపడటానికి మన రాష్ట్రం నుంచి ప్రారంభం జరిగితే అది మనందరికీ గర్వకారణం. 2000 సంవత్సరంలో నేను తెలంగాణ అని మాట్లాడితే, ఏం పని లేదా అని అన్నారు. కానీ, తెలంగాణ సాధించడమే కాకుండా దేశానికి రోల్‌మోడల్‌గా తెలంగాణ నిలిచేలా చేశాం. సమైక్య పాలనలో పాలమూరు జిల్లాలో వలసలు పోయేవారు. ఇవాళ వలసలు రివర్స్ వచ్చాయి. 11 రాష్ట్రాల నుంచి మన వద్దకు వలసలు వస్తున్నారు. బీహార్ హమాలీ కార్మికులు లేకపోతే తెలంగాణ రైస్‌మిల్లులు నడవవు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ లో భవన నిర్మాణ రంగంలో ఉత్తరప్రదేశ్, బీహార్ కార్మికులు పని చేస్తున్నారు. దేశాన్ని ఒక అద్భుతమై ప్రగతి పథంలో తీసుకెళ్లే ఎజెండా కావాలి. ఆ సిద్ధాంతానికి ప్రతిపాదిక పడాలి. నూతన వ్యవసాయ విధానం, నూతన ఆర్థిక విధానం, నూతన పారిశ్రామిక విధానం రావాలి. అందుకు అవసరమైన వేదికలు తయారు కావాలి. ఆ భారతదేశం లక్ష్యంగా పురోగమించాలి. దేశానికి కావాల్సింది అభ్యుదయ పథం కావాలి. అప్పుడే దేశం అద్భుతంగా బాగుపడతది” అని అన్నారు.
CM KCR Speech at TRS Party Plenary