Friday, November 22, 2024

ఎపిలో కూడా పార్టీ పెట్టాలని కోరుతున్నరు: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఇతర రాష్ట్రాల ప్రజలను ఆకర్షిస్తున్నాయని సిఎం కెసిఆర్ తెలిపారు. ప్లీనరీలో మాట్లాడుతూ.. దళిత బంధు ప్రకటించాక ఆంధ్రా నుంచి వేల విజ్ఞాపనలు వస్తున్నాయన్నారు. ఎపిలో కూడా టిఆర్‌ఎస్ పార్టీ పెట్టండని, గెలిపించుకుంటామని చెబుతున్నారన్నారు. తెలంగాణ పథకాలు తమకు కావాలని ఎపి ప్రజలు కోరుతున్నారని సిఎం కెసిఆర్ తెలిపారు. అదే విధంగా ఉత్తరాది నుంచి వేల సంఖ్యలో కూలీలు తెలంగాణకు వచ్చి పనిచేస్తున్నారని, తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలంటూ పొరుగు రాష్ట్రాల్లో డిమాండ్లు వినవస్తున్నాయన్నారు. నాంథేడ్, రాయ్‌చూర్ జిల్లాల నుంచి ఈ డిమాండ్లు వచ్చాయని, దేశ, విదేశాల్లో రాష్ట్ర ప్రతిష్ట ఇనుమడిస్తోందని అన్నారు. మన పథకాలు చూసి ఇతర రాష్ట్రాల సిఎంలు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. అంతేగాక ఈ పథకాలకు ఇంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తోందని అడిగారన్నారు. సాహసం లేకుంటే ఏ కార్యం సాధ్యం కాదని తెలిపారు. కలలు కని, ఆ కలలనే శ్వాసిస్తే సాకారమ వుతాయన్నారు.

తెలంగాణ వస్తే అరాచకం వస్తుందని.. పాలన చేతకాదని.. భూముల ధరలన్నీ పడిపోతాయని కొందరు దుష్ప్రచారం చేశారని, ఏడేళ్ల పాలనలో ఈ అపోహలన్నీ పటాపంచలు చేశామని తెలిపారు. ఎఫ్‌సిఐ కూడా కొనలేమని చెప్పే స్థాయిలో వరి పండించామని సిఎం కెసిఆర్ అన్నారు. అదే విధంగా ఆర్థికాభివృద్ధిలో దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచామన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంటు సమస్యలు వస్తాయని కొందరు ఎపి నేతలు అపోహలు సృష్టించారని, కానీ ప్రస్తుతం తెలంగాణలో 24 గంటలు నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తున్నామని, అదే ఆంధ్రాలో 24 గంటలు కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం సఫలీకృతమవుతోందని సిఎం కెసిఆర్ తెలిపారు.

CM KCR Speech at TRS Plenary

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News