హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. బుధవారం మాదాపూర్ లో నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. ”టీఆర్ఎస్ పార్టీ ఒక వ్యక్తిదో, శక్తిదో కాదు. తెలంగాణ ప్రజల ఆస్తి టీఆర్ఎస్ పార్టీ. అనుక్షణం తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజలను పరిరక్షించే కాపలాదారు టీఆర్ఎస్ పార్టీ.టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ కంచుకోట. దీన్ని ఎవరూ కూడా బద్దలు కొట్టలేరు. రెండు దశాబ్దాల క్రితం ఏడుపు వస్తే కూడా ఎవర్నీ పట్టుకొని ఎడ్వాలో తెలువని పరిస్థితి. రాష్ట్ర అస్థిత్వమే ఆగమయైపోయే పరిస్థితి. దిక్కుతోచని సందర్భంలో ఉవ్వెత్తున తెలంగాణ ప్రజల గుండెల నుంచి ఈ గులాబీ జెండా ఎగిసిపడింది. అపజయాలు, అవమనాలు ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించాం. తర్వాత ప్రజల దీవెనతో అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాం. దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ నిలిచింది.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు, రివార్డులే మన పనితీరుకు మచ్చుతునక. నిన్న కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో దేశంలో ఉత్తమమైన గ్రామాల్లో పది తెలంగాణవే. ఈ విషయాన్ని కేంద్రమే స్వయంగా ప్రకటించింది. కేంద్రం నుంచి అవార్డు రానటువంటి శాఖ తెలంగాణలో లేదు. ఒక నిబద్ధతతో అవినీతిరహితంగా, చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నాం. కరువు కాటకాలకు నిలయంగా ఉన్న తెలంగాణ ఇవాళ జలభాండగారంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై అంతర్జాతీయ చానెళ్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. విద్యుత్ రంగంలో అద్భుత ప్రగతి సాధించాం. ఏ రంగంలో అయినా అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాం. దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాం” అని పేర్కొన్నారు.
CM KCR Speech at TRS Plenary