Friday, November 22, 2024

మోడీ మాటలు వింటే సొంత పొలంలోనే రైతులు కూలీలు అవుతారు: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అధికార మదం నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన సభలో కెసిఆర్ మాట్లాడారు. ఏ ఎన్నికలలో కూడా బిజెపికి 50 శాతం ఓట్లు రాలేదని చురకలంటించారు. బిజెపి కేవలం 36 శాతం ఓట్లతో దేశాన్ని పాలిస్తుందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు ఎంతో బాధపడుతున్నారని, ఇప్పటి వరకు బిజెపోళ్లు 11 రాష్ట్రాలను కూలగొట్టారని మండిపడ్డారు. తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న బిజెపి… ఇక్కడ ప్రభుత్వాన్ని కూలగొడుతామంటున్నారన్నారు. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, బిజెపి ప్రభుత్వం ఒక్క మంచిపని చేసిందా? అని ప్రశ్నించారు. జాతీయ తలసరి విద్యుత్ వినియోగం 957 యూనిట్లుగా ఉందని, తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1250 యూనిట్లగా ఉందని చెప్పారు. చిన్న దేశాల కంటే మనదేశంలోనే విద్యుత్ వినియోగం తక్కువగా ఉందని కెసిఆర్ వివరించారు.

తలసరి విద్యుత్ వినియోగంలో మనదేశ ర్యాంకు 104గా ఉందని తెలిపారు. మన దేశంలో అన్ని రంగాలను అమ్మేస్తున్నారని, ఇంకా అమ్మేందుకు వ్యవసాయ, విద్యుత్ రంగాలే మిగిలి ఉన్నాయని, సంస్కరణల పేరుతో వ్యవసాయ, విద్యుత్ రంగాలనూ అప్పగించేందుకు మోడీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని విరుచుకపడ్డారు. రైతుల భూములను కబళించేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మాటలు వింటే సొంత పొలంలోనే రైతులు కూలీలుగా మారే అవకాశం ఉందని కెసిఆర్ హెచ్చరించారు. ధాన్యం కొనాలని కోరితే కేంద్రమంత్రులు ఎగతాళి చేస్తున్నారని, వ్యవసాయరంగంపై కేంద్రానికి స్పష్టమైన ప్రణాళిక లేదని, నూకలు కూడా ఎగుమతి చేయకుండా నిషేధం విధిస్తే ఎలా అని ప్రశ్నించారు.

అసమర్థ విధానాలు, దూరదృష్టి లేకపోవడం వల్ల సాగు రంగం సమస్యల్లో ఉందని, ఏం చేసైనా సరే తెలంగాణలో ఉచిత విద్యుత్ బంద్ చేయాలని బిజెపోళ్లు చూస్తున్నారని కెసిఆర్ మండిపడ్డారు. ఎపికి మూడు వేల కోట్ల విద్యుత్ బకాయిలు కట్టాలని కేంద్రం చెప్పిందని, మరో మూడు వేల కోట్ల వడ్డీ అంటున్నారని, నెలలో చెల్లించకపోతే చర్యలు తీసుకుంటామని కేంద్రమే చెబుతుందన్నారు. 66 లక్షల మందికి తాము ఇచ్చే రైతు బంధు నిజమైన ఉద్దీపన కార్యక్రమం అని కెసిఆర్ ప్రశంసించారు. గతంలో 20 ఎకరాలున్న రైతు కూడా నగరాలకు వచ్చి కూలీపనులు చేసుకునే పరిస్థితి ఉండేదన్నారు. విద్యుత్ బిల్లును వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. మేకిన్ ఇండియా అనేది పూర్తి అబద్ధపు ప్రచారం అని, మాంజా, జాతీయ జెండాలు, టాపాసులు అన్నీ చైనా నుంచే వస్తున్నాయన్నారు. ఎపి నుంచి తెలంగాణకు రూ.17,828 కోట్లు రావాలని, ఆరు వేల కోట్ల రూపాయలను మినహాయించుకొని మిగతా మొత్తాన్ని కేంద్రం ఇప్పించాలన్నారు. కృష్ణపట్నం సహా అనేక రంగాల్లో తెలంగాణ వాటా ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News