Wednesday, January 22, 2025

కుల, మత విద్వేషాలతో తాలిబన్ల రాజ్యమే

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధులు: మతం పిచ్చితో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి, విధ్వేషాలు రా జేస్తే జనజీవనం అస్తవ్యస్తమై, మన దేశం మరో తాలిబన్ల రాజ్యం అవుతుంది. ఇటువంటి చర్యల పట్ల యువత జాగురకతతో ఆలోచించాలి. ఈ తరహా తీరు పట్ల జిల్లాలో, ఊరూరా మేధావులు చర్చ పెట్టాలని, నిజనిజాలు అందరికీ తెలియజేయాలి’ అని బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో గురువారం నాడు సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభల్లో ఆయన మా ట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రా ష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. నాడు కరువు ప్రాంతాలు నేడు సమృద్ధిగా నీటి వనరులతో పచ్చబడి మూడు పంటలు పుష్కలంగా పండుతున్నాయని కెసిఆర్ అన్నారు. నదీ జలాల సమస్య పరిష్కరించకుంటే ప్రాజెక్ట్‌లు ఎప్పడు క ట్టాలన్నారు.

దేశంలోని నదుల్లో సమృద్ధిగా నీరు అందుబాటులో ఉన్నా.. అవి రైతుల పొలాల వద్ద కు రావని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా నదిపై వేసిన ట్రైబ్యునల్ తీర్పు 19 ఏళ్లు గడిచినా రాలేదన్నారు. మనం మొండి పట్టుదలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకుని నీటి సమస్యలు అధిగమించామని కెసిఆర్ పేర్కొన్నారు. నదులపై ఉన్న వివాదాలను తేల్చకుండా కేంద్రం కాలయాపన చేస్తోందన్నారు. దేశ రాజధానిలో సైతం తాగునీటి సమస్య ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొందని ఎద్దెవా చేశారు. కర్నాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఇప్పటికీ ఎందుకు ఉందని నిలదీశారు. పది రోజులకోసారి నీటి సరఫరా చేసి దుస్థితికి కారణాలు ఆలోచించాలని ప్రజలను కోరారు.
మన చుట్టూ ఏం జరుగుతుందో ప్రజలు ఆలోచించాలి
మన చుట్టూ ఏం జరుగుతుందో ప్రజలు ఆలోచించాలని, రా ష్ట్రం ఏర్పడే నాటికి మన జిఎస్టి 5 కోట్లు ఉండేదని, ప్రస్తుతం 11.54 కోట్లకు చేరిందని సిఎం కెసిఆర్ అన్నారు. మన స్థాయిలో కేంద్రం కూడా పనిచేసి ఉంటే జిఎస్‌టి 14.5లక్షల కోట్లకు చేరేదన్నారు. కేంద్ర అసమర్ధ పాలన, పనితీరు వల్ల తెలంగాణ రాష్ట్రానికి దాదాపు రూ.3లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. అభివృద్ధిపై నిలదీస్తే కులం, మతం, వర్గ విభేదాలను తెరపైకితెచ్చి ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని కెసిఆర్ విమర్శించారు.
దేశాన్ని రక్షించేందుకే బిఆర్‌ఎస్
70 ఏళ్ల పాలనలో పాలించిన అన్ని ప్రభుత్వాలు ప్రసంగాలే తప్ప.. ప్రజలకు ఒరగబెట్టింది ఏమిలేదని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. రాష్ట్రాల మీద పెత్తనాలు చెలాయిస్తూ, దుష్ట పన్నాగాలు పన్నుతూ ప్రజలను మతం మత్తులో ముంచి దేశాన్ని తిరోగమనంలో తీసుకువెళ్తున్నారన్నారని అన్నారు. ఈ దుశ్చర్యలను ఖండిస్తూ.. దేశ పౌరులుగా మన బాధ్యతను నిర్వర్తిస్తూ భారతదేశానికి దిక్సూచిగా వ్యవహరించేందుకు టిఆర్‌ఎస్ బిఆర్‌ఎస్‌గా అవతరించిందన్నారు. తెలంగాణ విజ్ఞాన వీచికలు దేశమంతా ప్రసరించాలని, ఈ ప్రాంత ప్రజలు చైతన్య దీపికలని, తెలంగాణ ఉద్యమ సమయంలో వారి స్ఫూర్తి, పట్టుదల తనకు తెలుసునని బావోద్వేగంతో గుర్తు చేసుకున్నారు.

మరోసారి దేశం కోసం అటువంటి ఉద్యమాన్ని తిరిగి కొనసాగించాల్సిన అవసరం ఉందని ముఖ్యంగా యువత ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలని కెసిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర పథకాలు ఇప్పుడు దేశానికి దిక్సూచిగా మారాయని ప్రజలు తమ పార్టీని ఆదరిస్తారని, ఇందుకోసం ఈనెల 18న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు పెద్దఎత్తున జనం తరలిరావాలని పిలుపునిచ్చారు. ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశ పరిస్థితులను వివరిస్తారని, కల్లబొల్లి కబుర్లు చెప్పేవారి మాటలు నమ్మి మోసపోవద్దని హితవు పలికారు.
మన దేశం వ్యవసాయ సాంద్రతకు అనుకూలం మన దేశం ప్రపంచంలోనే వ్యవసాయ సాంద్రత కలిగినదేశమని, అమెరికాలో 29, చైనా 16 శాతమైతే ఇండియాలో 83 కోట్ల ఎకరాలలో దాదాపు 41 కోట్ల సస్యశ్యామలమైన మా గాని కలిగిన భూమి ఉందని సముద్ర, నదీ తీర ప్రాంతాల్లో అద్భుతమైన పంటలు పండుతాయని అంకెలతో సహా వివరించారు.
ఈ నీటి, వ్యవసాయ సాంద్రతను సద్వినియోగం చేసుకుంటే మన దేశానికి మించిన సుసంపన్నమైన దేశం మరెక్కడా ఉండదని, కానీ, పాలకులు ఈ దిశగా ఆలోచించడంలేదని, కేవలం విద్వేషాలతో కాలం గడుపుతున్నారన్నారు.
తెలంగాణ తేజం నూకల రాంచంద్రారెడ్డి..
మాజీ ప్రధాని స్వర్గీయ పివి నర్సింహరావుకే గురువైన మేధావి మహబూబాబాద్ జిల్లాకు చెందిన నూకల రాంచంద్రరెడి అని సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. నూకల సేవలను రాష్ట్ర ప్రభుత్వం తగిన రీతిలో గౌరవిస్తుందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తనకు మంత్రి పదవి ఇచ్చి, పివి నర్సింహరావుకు ఇవ్వకపోవడాన్ని అప్పట్లో ఆయన వ్యతిరేకించారని గుర్తు చేశారు. పివికి కూడా మంత్రి పదవి ఇస్తేనే తాను మంత్రి పదవిని స్వీకరిస్తానని ఖరాఖండిగా చెప్పి పివి తెలివితేటలను అప్పట్లోనే రామచంద్రారెడ్డి గుర్తించారన్నారు. పివి లాంటి మేధావి భావిష్యత్ రాజకీయాలకు అవసరమని పట్టుదలతో ఆయనకు మంత్రి పదవి ఇప్పించి ప్రోత్సహించిన నూకల లాంటి తెలంగాణ తేజాలను ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రస్తుతం వారి పేరు చిరస్థాయిగా నిలిచే విధంగా జిల్లాలో ఏర్పాటు చేసే విద్యాసంస్థకు వారి పేరు పెడుతామని ప్రకటించారు. అలాగే ఈ ప్రాంతంలో పుట్టిన నూకల రాంచంద్రారెడ్డి భావితరాలకు తెలిసేవిధంగా జిల్లా కేంద్రంతో పాటు వరంగల్ పట్టణంలో కూడా ఆయన కాంస్య విగ్రహాలను పెడుతామని సిఎం ప్రకటించారు.
ఉద్యమ సమయంలో తండాలో పడుకున్నాను..
ఉద్యమ సమయంలో తెలంగాణలోని అన్ని గ్రామాలను కలియతిరిగానని కెసిఆర్ చెప్పారు. అందులో భాగంగా జిల్లా పరిధిలోని నెల్లికుదురు మండలం జామా తండాలో తాను నిద్రచేసి తండావాసుల కష్టసుఖాలు తెలుసుకున్నానన్నారు. అలాగే మహబూబ్‌నగర్ ప్రాంతంలో ఉన్న కరువు దుర్భర పరిస్థితులు చూసి కంట నీరు పెట్టుకున్నామని, ఈ ప్రాంతంలోని తిరుమలగిరి, వర్దన్నపేట, పాలకుర్తి ప్రాంతాల్లో కరువు కాటకాలతో ప్రజలు అలమటించారంటూ ఆనాటి పరిస్థితులను సిఎం గుర్తు చేశారు. ములుగు, ఏటూర్‌నాగారం, రామగుండం, మంచిర్యాల ప్రాంతాల్లో పర్యటించే సమయాల్లో లెక్కలెనన్నిసార్లు నాణాలు గోదావరి నదిలో వేసి రైతుల గోస తీర్చాలని వేడుకున్నట్లు వెల్లడించారు. కురవి వీరన్నను దర్శించుకుని తెలంగాణ వస్తే అన్నివర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని మనసారా ప్రార్థించానని చెప్పారు.

స్వామి దయ, మానుకోట రాళ్ల బలం, ప్రజల ఆకాంక్ష నెరవేరి మనకు ప్రత్యేక రాష్ట్రం లభించిందని, ఆ తర్వాతనే అనేక ప్రజా రంజకమైన సంక్షేమ కార్యక్రమాలను అమలుచేసి అద్భుత విజయాలు సాధించామని సిఎ వివరించారు. తెలంగాణ రావడం వల్లే పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని, వీటితో జిల్లాలోని ప్రజలకు, ఉద్యోగులకు సౌకర్యంగా మారాయన్నారు. విలాసవంతమైన సమీకృత కలెక్టరేట్ భవనాలను నిర్మించుకుంటున్నామన్నారు. ఇతర రాష్ట్రాల మంత్రుల ఛాంబర్ కంటే తెలంగాణ కలెక్టర్ ఛాంబర్ అద్భుతంగా ఉన్నాయని, ఇటీవల పంజాబ్ మంత్రి సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారని కెసిఆర్ అనారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News