Monday, January 20, 2025

మోసపోతే గోసపడ్తరు

- Advertisement -
- Advertisement -

ఎవరో వచ్చి ఏదో చెబితే నమ్మవద్దు, ఆ క్షణానికి తమాషా అనిపించినా తర్వాత ఫలితాలు దుర్మార్గంగా ఉంటాయి
ముమ్మాటికీ తెలంగాణ ధనిక రాష్ట్రమే 
రాష్ట్ర ప్రగతిని చూసి దేశమే ఆశ్చర్యపోతున్నది, జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలి 
కుల, మత రహిత భారతీయత కావాలి, చైనా, సింగపూర్‌ల బాటలో పురోగమించాలి 
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టరేట్ ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: విచ్ఛిన్న శక్తులు, ప్రతీప శక్తులు దుర్మార్గులు నీచరాజకీయాల కోసం ఎంతకైనా తెగించేవాళ్లు ఎప్పుడూ ఉంటారని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. అలాంటి వారి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. జాగ్రత్తగా ఉంటేనే రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోగలమన్నారు. సమాజంలో విద్వేషం పెచ్చరిల్లిందంటే మళ్లీ ఏకం కావడం చాలా కష్టమన్నారు. మోసపోతే చాలా గోసపడే ప్రమాదం ఉంటదన్నారు. ఈ నేపథ్యంలో దేశంలో జరిగే పరిణామాలపై ప్రతిగ్రామం, ప్రతిబస్తి, ప్రతి చోట చర్చ జరగాలన్నారు. నిజమేందో… అబద్ధమేందో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ సమీపంలోని అంతాయిపల్లి వద్ద 30 ఎకరాల్లో రూ.50 కోట్లతో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనాన్ని బుధవారం సిఎం కెసిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన దేశాల బాటలో భారత దేశం కుల, మత రహితంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అప్పుడే దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లువిరుస్తుందన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. కనీ ప్రస్తుతం దేశంలో అసమర్థ విధానాలు అమలు జరుగుతున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తోందన్నారు. రాష్ట్రంలో దాదాపు 12 రాష్ట్రాల నుంచి వలస వచ్చి బతుకుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో అందరూ ఐక్యంగా ఉండి రాష్ట్ర ప్రగతికి దోహదపడాలని పిలుపునిచ్చారు. దేశ రాజకీయాల్లో ప్రభావం చూపేలా చైతన్యంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.

పాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు
పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు జరిగిందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటే విద్యుత్, సంక్షేమం వచ్చేదా? అని కెసిఆర్ ప్రశ్నించారు. చైతన్యవంతమైన సమాజం ఉంటేనే ముందుకు పురోగమిస్తామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మంచి కార్యక్రమాలు ప్రజలకు త్వరగా చేరుతున్నాయని సిఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా 10 లక్షలు పింఛన్లు అందిస్తున్నామని మొత్తం 46 లక్షల మందికి కొత్త కార్డులు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ వచ్చాక ఎన్నో మంచి పనులు జరుగుతున్నాయన్నారు.

నిద్రాణమై ఉండడం వల్లే దెబ్బతిన్నాం
ఏ సమాజమైతే, ఏ ప్రజలైతే ఆలోచన లేకుండా నిద్రాణమై నిర్లక్ష్యంగా ఉంటరో వారు దెబ్బతినే అవకాశం ఉంటుందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. 60 సంవత్సరాల కిందట తెలంగాణ సమాజం నిద్రాణమై ఉండేదన్నారు. ఆ సమయంలో మనకు ఇష్టం లేకపోయినా పోరాడలేదన్నారు. కాబట్టి తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్‌లో కలిపారన్నారు. దీని వల్ల ఎన్నో బాధలు పడ్డామన్నారు. ఎంత మంది పిల్లలు చనిపోయారన్నారు. ఎంత మంది జైళ్లపాలయ్యారని కెసిఆర్ పేర్కొన్నారు. 58 సంవత్సరాలు మడమతిప్పని పోరాటం చేస్తే మళ్లా మన రాష్ట్రం మనకు వచ్చిందన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటే కరెంటు మనకు వచ్చేదా? ఈ సంక్షేమం వచ్చేదా? ఇన్ని పింఛన్లు వచ్చేవా? ఈ విధంగా మంచినీళ్లు వచ్చేవా? అని ప్రశ్నించారు.

ప్రజలను విడదీసే ప్రయత్నం జరుగుతోంది.
ఒక బంగ్లా కట్టాలంటే చాలా కష్టమైతద…అదే కూలగొట్టాలంటే పది రోజులుపడుతుందని కెసిఆర్ అన్నారు. అలాగే ఒక కూర్పు జరగాలన్నా.. ఒక ఇల్లు నిలబెట్టాలన్నా.. ఒక భవంతి నిర్మాణం కావాలంటే చాలా ప్రయాస పడాల్సి వస్తుందన్నారు. అలాంటి భారతదేశాన్ని మతం పేరు మీద, కులం పేరు మీద చాలా నీచమైన రాజకీయాల కోసం విడదీసే ప్రయత్నం జరుగుతుందని మండిపడ్డారు. ఇది ఏరకంగా మంచిది కాదన్నారు. ఏ పద్ధతుల్లో మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఎంతో మంది పెద్దలు స్వతంత్ర పోరాట యోధులు త్యాగాలు చేసి, దశాబ్దాల పాటు జైళ్లలో ఉండి ఈ దేశాన్ని తెచ్చి మనకు ఇచ్చారన్నారు. వారి త్యాగాల వల్లే నేటి స్వాతంత్య్రాన్ని మనం అనుభవిస్తున్నామన్నారు. ఈ స్వాతంత్య్ర పూర్తి ఫలాన్ని పూర్తిస్థాయిలో దేశం పొందాలంటే దేశంలో కులం, మతం, వర్గమని బేధం లేకుండా భారతీయత, భారతీయ ఐక్యత మనలో రావాలన్నారు. చైనా, సింగపూర్, కొరియాలాంటి దేశాలు పురోగమించాయో అదే బాటలో భారతీయులందరు కులమత రహితంగా బ్రహ్మండంగా ముందుకు సాగాలని అభిలాషించారు.

తెలంగాణ ఎలా జరుగతది.. ఢిల్లీలో ఎందుకు జరగదు?
దేశంలో అపారమైన నదులు ఉన్నాయని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. అపారమైన సంపద ఉన్నదన్నారు. కానీ దేశానికి చెందడం లేదన్నారు. ఇది మన దురదృష్టమని సిఎం వ్యాఖ్యానించారు. జాతీయ రాజకీయాల్లో కూడా గుణాత్మకమైన మార్పు రావాలన్నారు. తెలంగాణలో లేని కరెంటు ఎక్కడి నుంచి వచ్చింది ఏడేళ్ల కిందట మనం ఎట్ల ఉన్నామన్నారు. మన పక్కన ఉన్న మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లో రాదన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ల అసలు కరెంటు పోదని, కానీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం 24 గంటల కరెంటు రాదని సిఎం కెసిఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ వస్తది ఎట్లా? ఢిల్లీలో రాదెట్లా? అని కెసిఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో పుష్కలంగా మంచినీళ్లు ఉంటాయ్ కానీ ఢిల్లీలో ఎలా ఉండవన్నారు. అక్కడ ప్రతి రోజు నగరంలో నీటిని కొనుకుంటారన్నారు. ట్యాంకర్లకు వేల రూపాయలు పెట్టి.. ప్రతి ఇంట్లో గొయ్యి తవ్వి ఆ గోతిలో నింపుకుంటారన్నారు. తన మిత్రులే ఢిల్లీ వెళ్లిన సమయంలో చెప్పారన్నారు.
తెలంగాణలో జరిగేది బయట ఎందుకు జరుగుతలేదని ప్రశ్నించారు. ఎందుకు జరుగకూడదన్నారు. ఇక్కడ ఉన్నదాన్ని కూడా చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ గ్రామాల్లో ఏవిధంగా పచ్చని చెట్లున్నాయన్నారు. అలాగే బస్తీలు కూడా సర్వంగా సుందరంగా మారుతున్నాయన్నారు. మన రాష్ట్రంలో ఏవిధంగా కరెంటు ఉంటున్నది? రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అలా అమలు జరుగుతున్నాయి.? ప్రతి నెలా క్రమం తప్పకుండా పేదవాళ్లకు పింఛన్లు ఏవిధంగా అందుతున్నాయన్నారు. వీటిని ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక ధృడమైన ఆశయం ఉండాలన్నారు. అది తమ ప్రభుత్వానికి ఉండడం వల్లే నిర్విరామంగా అందజేస్తున్నామన్నారు.
సముజ్వల రాష్టంగా తెలంగాణ
భారతదేశంలోనే ఒక సముజ్వల రాష్ట్రంగా తెలంగాణ ముందుకు పురోగమించాలని కెసిఆర్ ఆకాంఁక్షించారు. చైతన్యంతో ప్రజలంతా ముందుకెళ్లాలన్నారు. రాష్ట్ర ప్రగతికి దోహదపడాలని తాను నేను కోరుతున్నామన్నారు. అదేపద్ధతిలో ముందుకుపోదామని.. భవిష్యత్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందామన్నారు. మేడ్చల్ జిల్లాలో మంజూరు చేసిన రూ.70కోట్లు శాసనసభ్యులు పేదల కోసం, ప్రజల కోసం వినియోగించుకోవాలన్నారు.

ముమ్మాటికి ధనిక రాష్ట్రమే
తెలంగాణ ధనిక రాష్ట్రమని తాను ఎప్పుడో చెప్పానని కెసిఆర్ అన్నారు. మనకున్న వనరులు అలాంటివన్నారు. ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కొలిచే విధానంలో రెండు ముఖ్యమైన విషయాలుంటాయన్నారు. వాటిలో ఒకటి తలసరి ఆదాయమన్నారు. ఇది ఒకప్పుడు కేవలం రూ.లక్షగా ఉండేదన్నారు. కాని ఇప్పుడు దేశంలో నాలుగవ స్థానంలో నిలిచిందన్నరు. ఈ ఆదాయం ప్రస్తుతం రూ. రూ.2,78,500కు పెరిగిందన్నారు. మనకన్నా ముందే రాష్ట్రాలుగా ఉన్న మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలను మనం దాటేశామన్నారు. ఇది వట్టిగానే జరుగుతుందా? అవినీతి రహితంగా అనుకున్నది అనుకున్నట్లు చేస్తేనే ఇది సాధ్యం అవుతుందన్నారు.

దేశమే ఆశ్చర్యపోతోంది
తెలంగాణ ఇంత అభివృద్ధి చెందడం చూసి దేశమంతా ఆశ్చర్యపోతుందని కెసిఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దేశంలోనే ఉత్తమమైన జీతాలు దొరుకుతాయని గతంలో చెప్పిన విధంగా ప్రస్తుతం అత్యధిక జీతాలు పొందుతున్నారన్నారు. పేద పిల్లల పెళ్లిళ్లు జరిగితే ఏ రాష్ట్రంలోనైనా రూ.లక్ష ఇస్తున్నారా? ఇప్పటికే పదకొండు లక్షల కుటుంబాలకు రూ.9వేల కోట్లపైగా ఖర్చు చేశామన్నారు. దేశంలో మరెక్కడా ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వరన్నారు. వికలాంగ సోదరులకు రూ.3016 ఇచ్చే రాష్ట్రం కూడా తెలంగాణ ఒక్కటేనని సిఎం కెసిఆర్ అన్నారు. ఈ మధ్యనే డయాలసిస్ పేషెంట్లకు కూడా ఆసరా పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
వీళ్లకే కాదు చేనేత, గీత కార్మికులకు, బోదకాలు బాధితులకు ఇలా ఎంతోమందికి ఇస్తున్నామన్నారు. చాలామంది తెలంగాణ పల్లెల్లో ఏమమ్మా ఎలా ఉన్నావ్? అనడిగితే హైదరాబాద్‌లో నా పెద్దకొడుకు కెసిఆర్ ఉన్నాడని….ప్రతి నెలా డబ్బులు పంపిస్తాడని చెబుతున్నారన్నారు. అందుకే చాలా మంది కోడళ్లు అత్తమామల్ని ఇంటికి తెచ్చి పెట్టుకుంటున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ముసలాళ్లే మోతుబరిగా ఉన్నారు. తాను పంపే డబ్బులో కూడా ఎంతో కొంత దాచుకుంటున్నారన్నారు. బియ్యానికి కూడా గతంలో ఇంట్లో ముగ్గురు, నలుగురికే ఇస్తామనే వారన్నారు. కానీ ఇప్పుడు ఎంత మంది ఉంటే అంతమందికి నాలుగు కాకుండా ఆరు కిలోలు ఇస్తున్నామన్నారు.

ఆర్ధికంగా బలోపేతం అయ్యాం
మన వనరులు మనకే దక్కడంతో ఆర్థికంగా మనం బలోపేతం అయ్యామని కెసిఆర్ అన్నారు. జిఎస్‌డిపి అంటే రాష్ట్ర స్థూలఉత్పత్తి అని ఇది కూడా ఒక గీటురాయని అని పేర్కొన్నారు. ఇది 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.5 లక్షలకోట్లు ఉండేదన్నారు. ఇవ్వాల అది అద్భుతంగా పెరిగి రూ.11.5 లక్షలకోట్లకు చేరిందన్నారు. అధికారులు అంకితభావం, ప్రజాప్రతినిధుల చిత్తశుద్ధి, ప్రభుత్వం లక్ష్యశుద్ధి వల్లే ఇది సాధ్యమైందని కెసిఆర్ అన్నారు.. చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు మనం ప్రారంభించుకున్న కలెక్టరేట్ వంటి భవనాలు కూడా లేవన్నారు. మొత్తం 33 జిల్లాల్లో వీటితోపాటు పోలీసు భవనాలు కూడా తీసుకొస్తున్నామన్నారు.
అత్యధిక గురుకులాలు ఉన్న రాష్ట్రం
దేశంలోనే అత్యధిక గురుకులాలు ఉన్న రాష్ట్రం కూడా మనదేనని కెసిఆర్ అన్నారు. వీటిలో చదువుకుంటున్న పేద విద్యార్థులు దేశం ఆశ్చర్యపోయే ఫలితాలు సాధిస్తున్నారన్నారు. కరోనా రాకుంటే మరిన్ని గురుకులాలు పెంచేవాళ్లమన్నారు. ఈ మధ్య బిసిల కోసం కొన్ని పెంచినా మరిన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మిషన్ భగీరథ ద్వారా మంచి నీళ్ల కొరత కూడా తీర్చుకున్నాం. ఒకప్పుడు మన రాష్ట్రం నుంచి కూలీల కోసం పోయేవారు. ఇప్పుడు పన్నెండు రాష్ట్రాల నుంచి ఇక్కడకు బతుకుతెరువు కోసం వస్తున్నారన్నారు. వాళ్లందరికీ పని కల్పించే అద్భుతమైన రాష్ట్రంగా మనం ఎదిగామన్నారు. ఉద్యమకాలంలో ఏది కావాలని కోరుకున్నామో అది సాధించుకున్నామని కెసిఆర్ పేర్కొన్నారు.

చైతన్యం ఉన్న జిల్లా
మేడ్చల్ చాలా చైతన్యం గల జిల్లా అని కెసిఆర్ అన్నారు. అందువల్ల ప్రజలంతా ఐకమత్యంతో ఉండి రాష్ట్ర ప్రగతికి తోడ్పడుతూ ఇదే పద్ధతిలో దేశ రాజకీయాల్లో ప్రభావం చూపాలని అభిలాషించారు. ఐకమత్యంతో, చైతన్యంతో ముందుకు సాగాలన్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారు? అనుకోవద్దన్నారు. ఆ నిమిషానికి తమాషా అనిపిస్తది…. కానీ, ఫలితాలు చాలా దుర్మార్గంగా ఉంటాయన్నారు.. మనం ఏ మాత్రం పొరపాటు చేసినా ఏ మాత్రం మోసపోతామన్నారు. ఇప్పటికే 58 సంవత్సరాలు గోసపడ్డాం… దగాపడ్డామన్నారు. మళ్లీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామన్నారు. కాబట్టి శాంతిని… సుఖాన్ని ఈ రోజు కలుగుతున్న ఆస్తులను ఇవన్నీ ప్రజల ఆస్తులన్నారు. వీటిని కాపాడడంతో పాటు ఇంకా పెంపొందించాలన్నారు. భవిష్యత్ తరాలకు అందించాలని సూచించారు.

జిల్లా శాసనసభ్యులకు రూ. 10 కోట్ల నిధులు
మేడ్చల్లో గ్రామీణ ప్రాంతాలు తక్కువ. దాంతో ఇక్కడ పరిశ్రమలు వస్తాయి. ఉపాధి దొరుకడంతో పాటు రియల్ ఎస్టేట్ పెరుగుతుందన్నారు. వీటి వల్ల చాలా పనులు చేయాల్సి వస్తుందన్నారు. వీటికోసం అందరు ఎమ్మెల్యేలకు రూ.5 కోట్ల నిధులు ఇచ్చామన్నారు. కాని ఇవి చాలడం లేదని ఎమ్మెల్యేలు చెప్పారు. అందుకే ఈ ఏడు నియోజక వర్గాల ఎమ్మెల్యేలకు మరో రూ.పది కోట్ల నిధులు మంజూరు చేస్తున్నానని అన్నారు. ఇందుకు సంబంధించిన జీవోను గురువారం విడుదల చేస్తా అని అన్నారు. మనకు నిధులు ఉనాయని…. కానీ కొందరు మూర్ఖులు కారుకూతలు కూస్తున్నారని మండిపడ్డారు.

జిల్లా అవుతుందని ఎవరైనా అనుకున్నారా?
మేడ్చల్ జిల్లా అవుతుందని ఎవరూ అనుకోలేదని సిఎం కెసిఆర్ అన్నారు. పరిపాలన ప్రజలకు ఎంత దగ్గరగా వస్తేపనులు అంత త్వరగా అవుతాయన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిందన్నారు. పరిపాలనా భవనాన్ని గొప్పగా నిర్మించుకున్నామన్నారు. కేవలం ఆరు నెలల వ్యవధిలో భవనాలు నిర్మించామని చెప్పారు. 11వేలకు పైగా ప్లే గ్రౌండ్స్ సిద్ధమవుతున్నాయన్నారు. మరో 10లక్షల కొత్త పెన్షన్లు ఇస్తున్నామన్నారు. అందరికీ కొత్త కార్డులు ఇస్తున్నామన్నారు.

CM KCR Speech in Shamirpet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News