హైదరాబాద్: దేశాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో కెసిఆర్ మాట్లాడారు. వ్యవసాయాన్ని నిలబెట్టి, రైతుల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. రాజకీయ పంథాల్లో తక్కువ నష్టాలతో తెలంగాణ సాధించుకున్నామని పేర్కొన్నారు. పార్లమెంటరీ పంథాలో ఏదైనా సాధించవచ్చని స్వరాష్ట్ర సాధనతో దేశానికి తెలిపామని వివరించారు. ఆబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ఆకాల వర్షాలు రాకముందే పంట కోతల పూర్తయ్యేలా రైతులను చైతన్యం వంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశ జిఎస్‌డిపిలో వ్యవసాయం రంగం వాటా 23 శాతంగా ఉందని, కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూములు నిరుపయోగంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పాలన పారదర్శకంగా ఉండడ వల్లే పెట్టుబడులు తరలివస్తున్నాయని కెసిఆర్ చెప్పారు.
దేశంలో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని, తెలివి ఉంటే బండ మీద కూడా నూకలు పుట్టించుకోవచ్చన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని ప్రశంసించారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి విజన్ లేదని, మనం అమలు చేస్తున్న పథకాలు అమలు చేస్తే దివాలా తీస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం అంటుందని, కానీ తెలంగాణ ఎందుకు దివాలా తీయడంలేదని అడిగారు. 2021-22 ముందు జిఎస్‌టి ఆదాయం రూ.34 వేల కోట్లు ఉండగా అంచనా 44 వేల కోట్లు పెట్టుకున్నామని వివరించారు. మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63 సీట్లు, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు, మూడో అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు సాధిస్తామని కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గాల వారీగా ఇద్దరు నాయకులు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలన్నారు. అన్ని రంగాల్లో దేశమే ఆశ్చర్యపోయే ప్రగతిని తెలంగాణ నమోదు చేసిందని కొనియాడారు.