Monday, December 23, 2024

సంపదను పెంచాలి.. పేదలకు పంచాలి: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  2013-14లో తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర జి.ఎస్.డి.పి 5 లక్షల 5 వేల 849 కోట్ల రూపాయలు కాగా 2021-22 నాటికి 11 లక్షల 54 వేల 860 కోట్ల రూపాయలకు పెరిగిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు.  తెలంగాణ వ్యాప్తంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. సిఎం కెసిఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు.  తలసరి ఆదాయం పెరుగుదలలోనూ తెలంగాణ రాష్ట్రం జాతీయ సగటును అధిగమించిందని, 2014 -15 లో రాష్ట్ర తలసరి ఆదాయం 1 లక్షా 24 వేల 104 రూపాయలు కాగా, 2021-22 నాటికి 2 లక్షల 78 వేల 833 రూపాయలకు పెరిగిందన్నారు. జాతీయ సగటు కన్నా మన రాష్ట్ర తలసరి ఆదాయం 86 శాతం అధికం కావడం మనందరికీ గర్వకారణమన్నారు.

సంపదను పెంచాలి.. పేదలకు పంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిందని,  అనేకరకాల సంక్షేమ పథకాల కోసం ఏటా 50 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తోందని, పేద, బలహీన వర్గాల ప్రజలకు జీవన భద్రతను కల్పిస్తుందన్నారు.  తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకున్న ఉద్దీపన చర్యల ఫలితంగా వ్యవసాయం విస్తరించడమేగాకుండా, వ్యవసాయోత్పత్తులు కనీవినీ ఎరుగని స్థాయిలో పెరిగిపోయాయని కెసిఆర్ వివరించారు.

స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత కేవలం ఆరునెలల వ్యవధిలోనే అన్నిరంగాలకు 24 గంటలు నిర్విరామంగా, వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తుందని, నేడు దేశంలో అన్నిరంగాలకూ 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ కావడం మనందరికీ గర్వకారణమన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన నిర్విరామ కృషి ఫలితంగా నేడు రాష్ట్రంలో దాదాపు కోటి ఎకరాలకు సాగునీటి సదుపాయం కలిగిందని, కరువు కాటకాలతో విలవిల్లాడిన తెలంగాణ నేడు సస్యశ్యామల తెలంగాణగా అవతరించిందని ప్రశంసించారు. రైతు రుణమాఫీతో పాటూ రైతుబంధు, రైతుబీమా వంటి పథకాల ద్వారా రైతన్నల గుండెల్లో విశ్వాసం నింపిందని, పంటల దిగుబడి విపరీతంగా పెరిగి వ్యవసాయ సమృద్ధితో తెలంగాణ దేశానికే అన్నంపెట్టే అన్నపూర్ణగా అవతరించిందన్నారు.

మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన రక్షిత జలాలను నల్లాల ద్వారా ఉచితంగా అందిస్తున్నామని, దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని,  గురుకుల ఆదివాసీల విద్యలో దేశంలో తెలంగాణదే అగ్రస్థానంలో ఉందని, 1,011 గురుకుల విద్యాలయాలున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రశంసించారు. ఈ గురుకులాల్లో ఐదున్నర లక్షల మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యాబోధన జరుగుతుందని, గురుకులాల్లో చదివే ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ప్రతి ఏటా 1 లక్షా 25 వేల రూపాయలు ఖర్చు చేస్తుందని,  వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందని, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసే యజ్ఞం కొనసాగుతునందని, రాష్ట్రంలో తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – టిమ్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతోపాటు, వరంగల్ నగరంలో మరొక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు.

హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రుల్లో మరో 2 వేల పడకలను ప్రభుత్వం అదనంగా అందుబాటులోకి తేవాలని నిర్ణయించిందని, వీటితోపాటు పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు – పల్లె దవాఖానాలు చక్కని సేవలందిస్తున్నాయని చెప్పారు.  తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న వినూత్నమైన పథకం హరితహారమని, గత ఏడు సంవత్సరాలుగా ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం 7.7 శాతానికి పెరిగినట్టు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొందని కెసిఆర్ గుర్తు చేశారు. నేడు రాష్ట్రంలో ఎటు చూసినా పచ్చదనం కనువిందు చేస్తుందని, అడవుల పునరుద్ధరణతో పాటు సామాజిక వనాల పెంపకం, వాటి సంరక్షణ ఉద్యమ స్ఫూర్తితో కొనసాగుతుందని, హరితవనాల అభివృద్ధి కోసం నూతనంగా అటవీ విశ్వవిద్యాలయాన్ని సైతం తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పుతుందన్నారు.

ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా హరిత నిధిని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం నూతన ఒరవడిని సృష్టించిందని, ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణకు హరితహారంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ హరిత క్రాంతి నిరంతర స్రవంతిగా కొనసాగడం కోసం గ్రీన్ ఫండ్ ను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల అందరికి భాగస్వామ్యం కల్పిస్తూ వారందించే విరాళాల ఆధారంగా గ్రీన్ ఫండ్ ను ఏర్పాటు చేశామని వివరించారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థలు సైతం తమ బడ్జెట్లో 10 శాతం విధిగా గ్రీన్ బడ్జెట్ కోసం కేటాయిస్తున్నాయని,
ప్రశాంతమైన, సురక్షితమైన, ప్రగతిశీల వాతావరణం ఉన్నచోటనే పారిశ్రామిక అభివృద్ధి పరుగులు తీస్తుందని, అందుకు నిజమైన నిదర్శనంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు.

సుస్థిర పాలన, మెరుగైన శాంతిభద్రతలు, అవినీతికి, అలసత్వానికి ఆస్కారంలేని విధంగా రూపొందించిన టిఎస్-ఐపాస్ పారిశ్రామిక విధానం, ఈ మూడింటి వల్ల తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, పారిశ్రామిక రంగంలో ఈ ఎనిమిదేళ్లలో 2 లక్షల 32 వేల 111 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలివచ్చాయిని, 16 లక్షల 50 వేల ఉద్యోగాలు కల్పించామన్నారు.

ఐటీ రంగంలో తెలంగాణ సాటిలేని ప్రగతిని సాధిస్తూ పురోగమిస్తుందని, 2014లో తెలంగాణ ఐటిరంగ ఎగుమతుల విలువ 57 వేల 258 కోట్లు మాత్రమే ఉండగా, తెలంగాణ ప్రభుత్వ కృషితో 2021 నాటికి 1 లక్షా 83 వేల 569 కోట్లకు పెరిగిందని, ఐటి రంగ ఎగుమతుల్లో దేశం వృద్ధిరేటు 17.20 మాత్రమే ఉండగా తెలంగాణ వృద్ధి రేటు 26.14 శాతంగా ఉండటం మన రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింప చేస్తుందని,
ఐటి ఉద్యోగాల సృష్టిలో మొన్నటివరకూ దేశంలోనే ప్రథమస్థానంలో ఉన్న కర్ణాటకను తెలంగాణ రాష్ట్రం అధిగమించిందని ప్రశంసించారు. ఈ ఎనిమిదేళ్లలో ఐటి రంగంలో 7 లక్షల 80 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని కెసిఆర్ వివరించారు

పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ జీవన ప్రమాణాలను పెంచడంలో సఫలీకృతమైందని, నేడు రాష్ట్రంలోని అన్ని గ్రామాలకూ చక్కని మౌలిక వసతులు సమకూరాయని, ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టరు, ట్రాలీ ట్యాంకరును కలిగి ఉందని, అదేవిధంగా ప్రతి గ్రామంలో డంపు యార్డు, పల్లె ప్రకృతివనం, వైకుంఠధామాలు ఏర్పాటు చేశామని, యువతకు మానసికోల్లాసంతో పాటు దేహ ధారుఢ్యం కూడా పెంపొందంచడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడుతాయని, పల్లె-పట్టణ ప్రగతిలో భాగంగా యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు శరవేగంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ప్రభుత్వ కృషితో పరిశుభ్రమైన పచ్చని పల్లెలు రూపుదిద్దుకున్నాయని, కేంద్ర ప్రభుత్వం అందించే అవార్డులు వరుస పెట్టి తెలంగాణ గ్రామాలను వరించడం మనందరికీ గర్వకారణంగా ఉందన్నారు. అపూర్వమైన ఫలితాలను సాధించిన పల్లె-పట్టణ ప్రగతి కార్యక్రమం యావత్ దేశానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు.  ఎనిమిదేళ్లలో తెలంగాణ జీవన ముఖచిత్రం ఎంతగానో మారిపోయిందని, పచ్చని పొలాలతో, చక్కని మౌలిక వసతులతో శాంతికి నెలవుగా తెలంగాణ అలరారుతుందని, సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తూ రాష్ట్రం ప్రగతిబాటలో పయనిస్తుందని కెసిఆర్ చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News