Saturday, November 23, 2024

ప్రధా(న)నే శత్రువు

- Advertisement -
- Advertisement -

కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా సతాయిస్తున్న కేంద్రం 

పాలమూరురంగారెడ్డి జాప్యానికి మోడీయే కారణం ప్రాజెక్టులు 

ప్రాజెక్టులు కట్టకుండా కిరికిరి పెడుతున్నరు
కేసులతో అడ్డుకుంటున్నరు

బావులకాడ మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయాలంటున్నరు 
మోసపోతే గోసపడుతాం 

మాయమాటలను నమ్మితే దోపిడీకి గురవుతాం

కేంద్రంలోని ఎన్‌డిఎ సర్కార్‌ను సాగనంపాలి

వికారాబాద్ సభలో బిజెపిపై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి కెసిఆర్
జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనం, టిఆర్‌ఎస్ కార్యాలయం ప్రారంభం, మెడికల్ కాలేజీకి శంకుస్థాపన

మనతెలంగాణ/వికారాబాద్/ హైదరాబాద్: తెలంగాణ ప్రజలు మోసపోతే గోసపడే పరిస్థితులు వస్తాయి… వచ్చిన తెలంగాణను మళ్లీ గుంటనక్కలు వచ్చి పీక్కొని తినకుండా చూడాలి…కైలాసం ఆటలో పెద్దపాము మిం గిన కత అయితది జాగ్రత్తగా ఉండాలి… తెలంగాణ ఆగం కాకుండా బుద్ధి జీవులు కా పాడుకోవాలని సిఎం కెసిఆర్ పిలుపు ఇచ్చా రు. పాత పద్ధతికి మళ్లీ పోకుండా, పరిస్థితులు దిగజారకుండా, వా రి రాజకీయ స్వా ర్ధానికి బలికాకుండా ఈ తెలంగాణను కాపా డుకోవాల్సిన అవసరం ఉందని కెసిఆర్ స్ప ష్టం చేశారు. తెలంగాణ ఊరికే రాలేదని, ఇవాళ ఎవడు పడితే వాడు అది, ఇది మాట్లాడుతున్నాడని, మన బాధ లు చూడని వారు మన అవస్థలు పట్టించుకో ని వారు, నవ్విన వారు ఇప్పుడు అడ్డం, పొడ వు మాట్లాడుతున్నారని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నాడు 14 సంవత్సరాలు ఉద్యమం చేశానని, చావు అంచుదాకా వెళ్లి ఈ రాష్ట్రాన్ని సాధించానని ఆయన పేర్కొన్నారు. తెలంగాణను తెచ్చే వరకు తెచ్చాను, తెచ్చిన తర్వాత మీరు ఆశీర్వాదం ఇస్తే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాను, ఈ పథకాలన్నీ కొనసాగాలి,పరిశ్రమలు, ఐటి,వ్యవసాయ రంగాల్లో ముందుకు పోతే ఇంకా లాభం జరుగుతు ంది, అందరూ కలలుగన్న బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని కెసిఆర్ పేర్కొన్నా రు. బిజెపి జెండాను చూసి మోసపోతే మళ్లీ పాత కథనే వస్తుందని సిఎం హెచ్చరించారు.
మన రాష్ట్రం బాగుంటే సరిపోదు….
మంగళవారం మధ్యాహ్నం వికారాబాద్‌లో సమీకృత కలెక్టరేట్ భవనం ప్రారంభించిన కెసిఆర్ అనంతరం టిఆర్‌ఎస్ కార్యాలయం, వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రం బాగుంటే సరిపోదని, వివేకంతో మనందరం ఆలోచించాలన్నారు. ఈ దేశంలో ఏం జరుగుతుందని కెసిఆర్ ప్రశ్నించారు. తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తుందని, అన్ని రంగాల్లో ముందుకు పోతున్నామన్నారు. కేంద్రంలో ఉన్నవారు మనం ఇచ్చే వాటిని ఉచితాలు అని చెబుతున్నారని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 ఏళ్ల నుంచి బిజెపి ఒక్క మంచి పని చేసిం దా? దీనిపై మీరందరూ చర్చ పెట్టాలి. రాజకీయంగా చైతన్యం లేని సమాజం లేకపోతే దోపిడీకి గురవుతామని కెసిఆర్ సూచించారు. మోసపోతే గోస పడుతాం. సమైక్య పాలకుల చేతిలో విలవిలలాడిపోయాం. పెరుగు అన్నం తినే రైతులు పురుగుల మం దు తాగి చచ్చిపోయారు… ఆ బాధలు మళ్లీ తెలంగాణకు రావొద్దంటే మనం అప్రమత్తం గా ఉండాలి. యువకులు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని కెసిఆర్ సూచించారు.
పంద్రాగస్టు సందర్భంగా ఎర్రకోట మీద ప్ర ధాని మోదీ ఇచ్చిన ప్రసంగంపై కెసిఆర్ సెటై ర్లు వేశారు. తలకు రుమాలు కట్టి డైలాగులు చెబితే సరిపోతదా? దేశానికి ఉపయోగపడే ఒక్క మాటైనా చెప్పారా? అంటూ ప్రధాని ఉద్దేశించి కెసిఆర్ ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నా కూడా ఇంతకాలం ఏం చెయ్యలేదు. మిగతా రెండేళ్ల కోసమైనా ఏమైనా చెబుతారా అని ప్రధాని మోడీ పంద్రాగస్టు ప్రసంగం విన్నానని, మోడీ దేశానికి ఉపయోగపడే ఒక్క మాట కూడా చెప్పలేదని కెసిఆర్ ఎద్దేవా చేశారు. అందుకే చెబుతున్నా అందరం చైతన్యవంతులం కావాలి. రాష్ట్రంలో మనం ఎంత బాగున్నా కేంద్రంలో ప్రభుత్వం సరిగా లేకపోతే అభివృద్ధి అంతగా జరగదని, కాబట్టి అక్కడ కూడా మంచి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నానని కెసిఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ పరిస్థితి దిగజారుతోందని, నిరుద్యోగం పెరుగుతోందని, రూపాయి విలువ పడిపోతోందని, కాబట్టి ఇప్పుడున్న కేంద్రలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి, మంచి ప్రభుత్వాన్ని తీసుకురావడంలో మనందరం భాగస్వాములం కావాలని కెసిఆర్ సూచించారు.
ప్రధానమంత్రే మనకు శత్రువు
కృష్ణా జలాల్లో వాటాలను అడ్డుకుంటున్నది బిజెపి పార్టీయేనని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వల్లే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యమవుతుందని, ఎనిమిదేళ్ల నుంచి వందకుపైగా దరఖాస్తులు ఇచ్చినా పట్టించుకోకుండా ఈ రోజు ప్రధానమంత్రే తెలంగాణకు ప్రధాన శత్రువు అయ్యాడని సిఎం కెసిఆర్ ఆరోపించారు. వికారాబాద్, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాలకు నీళ్లు రప్పించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా తన ప్రయత్నాలకు మోడీ అడ్డుపుల్ల వేస్తున్నారన్నారు. రాష్ట్రం ఎంత బాగున్నా కేంద్రంలో బాగాలేకపోతే ఆశించిన అభివృద్ధి జరగదని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడున్న బిజెపి నేతలకు దమ్ముంటే ఢిల్లీ పోయి కేంద్ర ప్రభుత్వం దద్ధమ్మతనం వల్ల పాలమూరు రంగారెడ్డి ఆగిపోతుందన్న విషయాన్ని అడగాలని సిఎం కెసిఆర్ సూచించారు. అంతేకానీ కెసిఆర్ బస్సు ముందు జెండాలు పట్టుకొని ఊపడం తప్ప వారితో ఏమీ కాదన్నారు. బస్సుకు అడ్డం వచ్చిన ఆ ఐదారు మంది పోరగాళ్లను మనోళ్లు కొడితే తుప్పుతుప్పు అవుతారని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీకి వెళితే ఇక్కడి బిజెపి నాయకుల లాగులు తడిచిపోతాయని కెసిఆర్ ఎద్దేవా చేశారు.
ప్రాజెక్టులు కట్టకుండా కేసులు..
ప్రధాని కృష్ణానదిలో తెలంగాణ వాటా తేల్చకుండా 8 ఏళ్లుగా దాదాపు 100 దరఖాస్తులు ఇచ్చినా తేల్చలేదన్నారు. మేం కరువులో ఉన్నాం, ఎన్ని నీళ్లు ఇస్తారో చెబితే అలా ప్రాజెక్టు కట్టుకుంటామని విజ్ఞప్తి చేశానని కెసిఆర్ పేర్కొన్నారు. కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు పెట్టి ప్రధానమంత్రి సతాయిస్తున్నారని ఆయన తెలిపారు. అయినా తాము ప్రాజెక్టులను కడుతుంటే బిజెపి పార్టీ వాళ్లు రకరకాల కిరికిరిలు చేసి కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టులను ఆపుతున్నారని కెసిఆర్ విమర్శించారు. అయినా ప్రాజెక్టును పూర్తి చేసి నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకొస్తామని తాను మాటిస్తున్నానని కెసిఆర్ పేర్కొన్నారు.
బావుల కాడ మీటర్లకు కరెంట్ బిల్లులు వసూలు చేయాలని…
ప్రధాని మోడీ ఈ దేశానికి ఏం చేశారో చెప్పాలని సిఎం కెసిఆర్ డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి ఇప్పటి వరకు చెప్పిన ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదని కెసిఆర్ ఆరోపించారు. ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తానని హామినిచ్చిన ప్రధాని కనీసం పదిహేను పైసలు కూడా ఇవ్వలేదని కెసిఆర్ ఎద్దేవా చేశారు. వికారాబాద్ ప్రజలంతా కలిసి ఈ దుష్టశక్తులకు తగిన బుద్ధి చెప్పాలని, భవిష్యత్‌లో ఉజ్వల భారతం దిశగా అందరం కంకణ బద్దులు కావాలని కెసిఆర్ సూచించారు. కేంద్రంలోని బిజెపి వల్ల రైతులకు, గిరిజనులకు, ముస్లింలకు, దళితులకు ఎవరికీ మేలు జరిగిందో చెప్పాలని కెసిఆర్ డిమాండ్ చేశారు. వారికి మేలు చేయకపోగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను ఉచితాలు అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని కెసిఆర్ ఎద్దేవా చేశారు. బావుల కాడ మీటర్లకు కరెంట్ బిల్లులు వసూలు చేయాలని బిజెపి నాయకులు రైతుల మెడపై కత్తి పెట్టారని, బిజెపి జెండాను చూసి మోసపోతే కరెంట్ బావుల కాడ మీటర్లు పెట్టి, శఠగోపం పెట్టి, పెద్ద షావుకార్ల కడుపులు నింపుతారని కెసిఆర్ హెచ్చరించారు. అలాంటి ప్రమాదం రావాల్నా..? కరెంట్ ఫ్రీగా రావాలా..? మీరే ఆలోచించుకోవాలని ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని కెసిఆర్ ప్రజలకు సూచించారు.
నియోజకవర్గానికి వెయ్యిమందిని కర్ణాటక బోర్డర్‌కు…
ఇవాళ గ్యాస్, పెట్రోల్ ధరలు పెరిగిపోయాయని కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి హయాంలో పెద్దోలంతా బ్యాంకులను దోచుకుంటున్నారని, పెద్ద పెద్ద షావుకార్లకు లక్షల కోట్ల రూపాయలను ప్రధాని దోచిపెట్టారని కెసిఆర్ ఆరోపించారు. వికారాబాద్‌కు కెసిఆర్ ఏ తక్కువ చేసిండు. కరెంట్ ఇవ్వలేదా? మంచినీళ్లు ఇవ్వలేదా? కలెక్టరేట్ ఇవ్వలేదా? నిధులు ఇవ్వలేదా? సంక్షేమ పథకాలు అమలు కాలేదా? ఇవన్నీ మీరు ఆలోచించాలి. గోల్‌మాల్ కావొద్దు. నియోజకవర్గానికి 1,000 మంది చొప్పున కర్ణాటక బోర్డర్‌కు తీసుకెళ్లాలని స్థానిక టిఆర్‌ఎస్ నాయకత్వానికి సూచిస్తున్నానని ఆయన తెలిపారు. బిజెపి పాలిత రాష్ట్రంలో ఏం జరుగుతుందో పరిశీలించండి. అక్కడ కల్యాణలక్ష్మిఅమలవుతుందా? ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తున్నారా? ఉచిత కరెంట్ ఇస్తున్నారా? అని సిఎం ప్రశ్నించారు. అనేక బాధలు పడి తెచ్చుకున్న తెలంగాణ బ్రహ్మాండంగా ముందుకు పోతోంది. మన తెలంగాణను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కెసిఆర్ స్పష్టం చేశారు.
కర్ణాటక ప్రజలు తమను తెలంగాణలో కలపాలని….
కర్ణాటక ప్రజలు తమను తెలంగాణలో కలిపేయండి లేదా తెలంగాణలోని పథకాలను అమలు చేయాలని ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి అడుగుతున్నారని కెసిఆర్ పేర్కొన్నారు. తాండూరులో ఉండే వాళ్లకు ఈ విషయం బాగా తెలుసన్నారు. గతంలో రైతులు నీళ్లు, కరెంటు లేక హైదరాబాద్ వచ్చి కూలీలుగా, ఆటోరిక్షావాలాలుగా పనిచేసేవారని, కానీ, ఈరోజు పల్లెప్రగతి కార్యక్రమాలతో రైతాంగం ఎకరానికి రూ.10 వేల రూపాయల పంట పెట్టుబడి తీసుకుంటుంది తెలంగాణ రైతు ఒక్కరేనని ఆయన తెలిపారు. రైతులకు ఉచిత కరెంటే కాదు, ప్రాజెక్టులు ఉన్న చోట ఉచితంగా నీరు అందిస్తున్నామని కెసిఆర్ తెలిపారు.
10 లక్షల పెన్షన్లను మంజూరు చేశాం
ఒంటరి మహిళలు, వృద్ధులకు, భర్తలు చనిపోయిన మహిళలకు గతంలో కేవలం 200 రూపాయల పెన్షన్ దక్కేదని, ఇప్పుడు రూ.2016 ఠంఛన్‌గా ప్రతినెలా 36 లక్షల మందికి అందిస్తున్నామని కెసిఆర్ పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం, 57 ఏళ్లు పైబడిన వారికి కూడా పెన్షన్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నామన్నారు. 10 లక్షల పెన్షన్లను మంజూరు చేశామని, కరెంటు బాధలు పోయాయని, గతంలో కరెంటు ఎప్పుడొస్తదో? ఎప్పుడు రాదో? ఎన్ని మోటార్లు కాల్తయో? ఏసిన పంట పండుతదో లేదో తెల్వని పరిస్థితి ఉండేదన్నారు. కానీ, ఈనాడు వ్యవసాయానికి, పరిశ్రమలకు, దుకాణాలకు, ఇళ్లకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించే రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని ఆయన పేర్కొన్నారు. మంచి నీళ్ల బాధ పోయింది. కరెంటు బాధ పోయింది. సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటున్నాం. దివ్యాంగులకు నెలకు రూ.3,016లు ఇచ్చి ఆదుకుంటున్నాం. ఆడపిల్లల పెళ్లికి కుల, మతాలతో సంబంధం లేకుండా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ స్కీంలతో ఆదుకుంటున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. ఆస్పత్రుల్లో ఎలా ప్రసవాలు జరుగుతున్నాయో, వారికి కెసిఆర్ కిట్‌లు ఎలా అందిస్తున్నామో అందరికీ తెలుసునని, ఇవి మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా లేవని కెసిఆర్ తెలిపారు.
రైతుభీమా కింద రూ.5 లక్షల ఆర్థిక సాయం
గతంలో ఉన్న నీటి బకాయిలను కూడా రద్దు చేశామని కెసిఆర్ తెలిపారు. గతంలో ప్రమాదాల్లో రైతులు చనిపోతే ఆపద్భందు అని చెప్పి రూ.50 వేలు ఇచ్చేవాళ్లని, అది కూడా ఆరేడు నెలలపాటు ప్రభుత్వాఫీసుల చుట్టూ తిరిగితే, ఏ పదివేలో ఇచ్చి మిగతావి మేసేవాళ్లు మేసి, మిగతావి రైతులకు ఇచ్చేవారని కెసిఆర్ ఆరోపించారు. పల్లె సీమలు పచ్చదనంతో కళకళలాడాలని, వ్యవసాయ స్థిరీకరణ జరగాలని, పల్లెల్లో ఉన్న వారికి పనులు దొరకాలన్న ఆలోచనతో ప్రభుత్వం నేడు ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు. దీనిలో భాగంగానే గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా కూడా పదిరోజులు తిరగకముందే రైతుభీమా కింద రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఏ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా ఎవరికీ లంచాలు పొందే అవకాశం లేకుండా నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోనే వాటిని జమ చేస్తున్నామని ఆయన తెలిపారు.
పరిగి, వికారాబాద్‌లకు డిగ్రీ కళాశాలలు మంజూరు
ఉద్యమ సమయంలో ఈ ప్రాంతానికి వస్తే రంగారెడ్డి జిల్లా కార్యాలయాలు వికారాబాద్‌లో పెట్టాలని కోరేవారు. ఇప్పుడు వికారాబాద్‌నే జిల్లాగా చేసుకొని కలెక్టరేట్‌ను అద్భుతంగా కట్టుకొని ప్రారంభించుకున్నామని కెసిఆర్ తెలిపారు. వికారాబాద్‌కు గొప్ప చరిత్ర ఉందని, ఇక్కడి అనంతగిరి కొండల్లో ఉన్న ఔషధాల గాలి ఆరోగ్యానికెంతో మంచిదని కెసిఆర్ పేర్కొన్నారు. ఉద్యమ సమయంలోనే వికారాబాద్ ను జిల్లాగా ఏర్పాటు చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్ ను జిల్లాగా ఏర్పాటు చేసుకున్నామన్నారు.33 జిల్లాలకు మెడికల్ కాలేజీలు ఇస్తున్నామన్నారు. వికారాబాద్‌కు వైద్య కళాశాల, డిగ్రీ కళాశాల మంజూరయ్యిందన్నారు. తెలంగాణ రాకుంటే వికారాబాద్ జిల్లా అయ్యేదా అని ప్రజలు ఆలోచించాలన్నారు.
ఇక్కడ ఒక ఎకరం అమ్మితే పొరుగు రాష్ట్రాల్లో నాలుగు ఎకరాలు
గతంలో తెలంగాణ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో, ఇప్పుడు ఎట్లా ఉన్నాయో అందరూ ఆలోచించాలన్నారు ప్రతి గ్రామంలోని ప్రజలు ఆలోచించి చర్చించుకోవాలన్నారు. ఆనాడు రంగారెడ్డి జిల్లాలోని కొంతమంది సమైక్యవాదుల తొత్తులు భూముల ధరలు పడిపోతాయని దుష్ప్రచారం చేశారు. తెలంగాణలో ఈరోజు ఒక ఎకరం అమ్మితే పొరుగు రాష్ట్రాల్లో నాలుగు ఎకరాలు కొంటున్నారని, మంచినీళ్ల కోసం ఎంతో గోసపడ్డారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని కెసిఆర్ పేర్కొన్నారు. భవిష్యత్‌లో ప్రజల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తామని సిఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పరిగి, వికారాబాద్‌లకు డిగ్రీ కళాశాలలు మంజూరు చేస్తున్నట్టు కెసిఆర్ ప్రకటించారు. ఎన్నేపల్లి వద్ద 36 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.61 కోట్ల వ్యయంతో వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను సకల సౌకర్యాలతో ప్రభుత్వం నిర్మించగా, మొత్తం 42 విభాగాలు ఇక్కడ నుంచి పని చేయనున్నాయి.
రూ. 235 కోట్లతో నిర్మించనున్న మెడికల్ కళాశాలకు శంకుస్థాపన
ముందుగా నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్ కాంప్లెక్స్)ను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించారు. అనంతరం 5 ఎకరాల స్థలంలో రూ.235 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత కలెక్టర్ ఛాంబర్‌లో లక్ష్మీమాతకు పూజలు నిర్వహించారు. సర్వ మత ప్రార్ధనల అనంతరం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ నిఖిలకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, వాణీదేవి, కాటేపల్లి జనార్దన్ రెడ్డి, దయానంద్, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, పైలట్ రోహిత్ రెడ్డి, కొప్పుల మహేష్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, ఏ.జీవన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, బిసి కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఐజీ కమల్ హాసన్ రెడ్డి, ఎస్‌పి కోటిరెడ్డి, ఈఎన్సీ గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

CM KCR Speech in Vikarabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News