హైదరాబాద్: కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దళితులు దయనీయ స్థితిలో ఉన్నారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. నేటికి అవకాశాలు లేక దళితులు సతమతమవుతున్నారన్నారు. తెలంగాణ ఏర్పడింది కూడా అంబేద్కర్ పుణ్యమేనని, క్రమంగా అంబేద్కర్ ఆలోచనా సరళి బయటకు వస్తుందన్నారు. శాసన సభలో దళితబంధుపై చర్చ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. తరతరాలుగా సామాజిక వివక్షకు గురైన జాతి దళిత జాతి అని అన్నారు. స్వాతంత్య్రానికి ముందు కూడా దళిత జాతి హింసకు గురైందన్నారు. అనేక రాష్ట్రాల్లో అనేక భిన్నమైన ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయని సిఎం కెసిఆర్ తెలిపారు. ఒక్క దళితులే కాదు అన్ని వర్గాలు వారు అణగారి ఉన్నారని, మనం చేసిన తప్పును ఎవరో వచ్చి సరి చేయరని, మన సమాజం చేసిన తప్పును మన సమాజమే పరిష్కరించాలన్నారు.
దళిత్ ఎంపవర్‌మెంట్ కింద రూ.1000 కోట్లు కేటాయించామని, ఇలాంటి ప్రయోగం దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. గరీభ్ హఠావో అన్నారు… ఇంకోటి అన్నారు కానీ ఫలితం మాత్రం రాలేదని దుయ్యబట్టారు. 75 లక్షల మంది దళితుల దగ్గర 13.95 లక్షల ఎకరాలు ఉన్నాయని వెల్లడించారు. నినాదాలు వచ్చాయి కానీ… పరిస్థితుల్లో గణనీయమైన మార్పు జరగలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును విఫలయత్నంగా చూపించాలనే ప్రయత్నాలు జరిగాయని, బాలారిష్టాలన్నీ అధిగమించుకుంటూ సంక్షేమం కోసం పాటుపడ్డామని, ఆసరా ఫెన్షన్లు పెంచుకున్నామని, వికలాంగుల ఫించన్లు మూడు వేల రూపాయలకు పెంచామని కెసిఆర్ స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతులు చెల్లాచెదురైపోయారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల్లో స్థిరత్వం వచ్చిందని, ఆత్మస్థైర్యం వచ్చిందని, తెలంగాణ భూములకు రేటు పెరిగిందని, తెలంగాణలో ఎకరం రూ.20 లక్షలకు తక్కువ ఎక్కడా లేదన్నారు. ఒకప్పుడు ఎపిలో ఎకరం అమ్మి తెలంగాణ నాలుగు ఎకరాలు కొనేవారని, ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మి ప్రకాశం జిల్లాలో ఆరు ఎకరాలు కొంటున్నారన్నారు. ఎక్కడ చూసిన పచ్చదనం అద్భుతంగా ఉందన్నారు.