మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో అనాధ బాలల పూర్తి సంరక్షణ భాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు. సోమవారం పార్టీ ప్లీనరి సమావేశాల సందర్బంగా సంక్షేమ తెలంగాణ సాకారం అంశంపై స్త్రీ శిశుసంక్షమ శాఖ మంత్రి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా సిఎం కెసిఆర్ కల్పించుకుని అనాధ బాలలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఎదిగివచ్చిన అనాధ పిల్లలు ఎక్కడికి పోవాలి, వారికి దిక్కెవరూ భవిష్యతు ఏమిటి అన్నదానిపై ఆలోచిస్తే ఒకరోజు రాత్రంతా తనకు నిద్ర పట్టలేదన్నారు. వారికోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని ఆరోజే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమే వారికి ఇకపై తల్లి తండ్రిగా నిలబడి వారి యోగక్షేమాలను చూస్తుందన్నారు. అందుకు సంబంధించి న విధానాన్ని త్వరలోనే తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో ఎక్కడైనా అనాధ బాలలు ఉన్నట్టు తెలిస్తే ఎంపిలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు వెంటనే స్త్రీ శిశుసంక్షమ శాఖ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎక్కడ మహిళలు సంతోషంగా ఉంటే అక్కడ దేవతలు సంచరిస్తారన్నారు.
మహిళలకు పలు పదవుల్లో రిజర్వేషన్లు కల్పించి అధికారాలు అప్పగిస్తే ఇంకా వారి భర్తలు వారి వెంట వస్తూన్నారెందుకని చురకలు వేశారు. మహిళా ప్రజాప్రతినిధులను వారి పని వారిని చేసుకోనిస్తే ఎంతో మంది వజ్రాల వంటి వారు బయటకు వస్తారన్నారు. మహిళల ప్రతిభకు పదును పెట్టాలన్నారు. మహిళలను చులకన భావంతో చూస్తూ వంటింటికి పరిమితం చేయటం తగదన్నారు. మహిళలకు అవకాశం ఇచ్చి చూస్తే ప్రతిభను చాటుకుంటారన్నారు. పురుషుల్లో కూడా సగం మంది నన్నాసులు లేరా అని ప్రశ్నించారు. మహిళలను ముందు వరుసలోకి రానివ్వనంత వరకూ ప్రతిభ ముందుకు సాగదని, వారిని ఎదగనిచ్చేందకు అవకాశాలు కల్పించాలని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.
CM KCR Speech on Orphaned children