రంగారెడ్డి: కాళేశ్వరంతో పాటే పాలమూరు ప్రాజెక్టు కూడా ఇప్పటికే పూర్తయ్యేదని, కాంగ్రెస్ నేతలు కోర్టుకు వెళ్లడంతోనే పాలమూరు ప్రాజెక్టు ఆలస్యమైందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో తుమ్మలూరులో హరితోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. తుమ్మలూరు అర్భన్ ఫారెస్ట్‌లో సిఎం కెసిఆర్ మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తుమ్మలూరుకు కోటి రూపాయలు కమ్యూనిటీ హాలుకు మంజూరు చేశామన్నారు. జల్‌పల్లి, తుక్కుగూడకు చెరో రూ.25 కోట్లు ఇస్తున్నామని, బడంగ్‌పేట పురపాలికకు రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. ప్రజలకు సాగు, తాగునీరు ఇస్తుంటే అడ్డుకోవడం దారుణమైన విషయమన్నారు.
Also Read: పవన్ రాజకీయ వ్యభిచారి: ద్వారంపూడి
త్వరలో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, వికారాబాద్‌లో నీటి కష్టాలు తీరుతాయని హామీ ఇచ్చారు. గోదావరి నీళ్లను గండిపేట, హిమాయత్ సాగర్ వరకు లింక్ చేస్తామని, చేవెళ్ల ప్రాంతానికి రాబోయే కొద్ది రోజుల్లోనే నీళ్లందిస్తామని కెసిఆర్ హామీ ఇచ్చారు. ఒకప్పుడు వంద పీట్లు వేసినా నీళ్లు రాని పరిస్థితి ఉండేదని, శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో రైలు వేస్తామని, కందుకూరు వరకు మెట్రో పొడగించేందుకు ప్రయత్నిస్తామన్నారు. వానలు వాపసు రావలె… కోతులు వాపసు పోవాలె అనే పాట రాశానని కెసిఆర్ గుర్తు చేశారు. మహేశ్వరానికి వైద్య కళాశాల మంజూరు చేస్తామని, బిహెచ్‌ఇఎల్ నుంచి మహేశ్వరం వరకు మెట్రో తెచ్చేందుకు కృషి చేస్తానని వివరణ ఇచ్చారు. తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో మనమే తొలి స్థానంలో ఉన్నామన్నారు.