Wednesday, January 22, 2025

సమాలోచన

- Advertisement -
- Advertisement -

CM KCR talks with several leaders in Delhi

ఢిల్లీలో పలువురు నేతలతో ముఖ్యమంత్రి కెసిఆర్ మంతనాలు

రాజ్యసభలో బిజెపి సభ్యులు సుబ్రహ్మణ్యన్ స్వామి, రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయత్‌తో చర్చలు

సిఎం కెసిఆర్ ఆహ్వానంపై గురువారంనాడు ఢిల్లీ తుగ్లక్‌రోడ్డులోని ఆయన నివాసానికి వచ్చిన సుబ్రహ్మణ్యన్ స్వామి, రాకేశ్ టికాయత్
మధ్యాహ్న భోజనం తర్వాత ఉభయులతో సమావేశం
3గంటలపాటు సాగిన సంభాషణ
రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న ప్రధాని మోడీ ప్రభుత్వ వైఖరిపై సమాలోచన
బిజిపియేతర రాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు అంశం ప్రస్తావన
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత జాతీయస్థాయిలో బిజెపి వ్యతిరేక కూటమి నిర్మాణానికి సారథ్యం వహించాలని కెసిఆర్‌కు సూచించిన స్వామి, టికాయత్

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గురువారం బిజెపి ఎంపి సుబ్రహ్మణ్యన్ స్వామితో పాటు బికెయు (భారతీయ కిసాన్ యూనియన్) రైతు సంఘం నేత రాకేష్ సింగ్ టికాయత్ సహా పలువురు పలువురు జాతీయ నేతలు కలిశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై వారు చర్చించారు. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ 23లో ఉన్న కెసిఆర్ నివాసంలో ఈ భేటీ జరిగింది. వారిని లంచ్‌కు ఆహ్వానించిన కెసిఆర్.. మధ్యాహ్న భోజనం చేసిన తరువాత వారితో తన నివాసంలో సమావేశమయ్యారు. అయితే దేశంలో బిజెపి వ్యతిరేక కూటమి వైపు సిఎం కెసిఆర్ శరవేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో అదే పార్టీకి చెందిన ఎంపి సుబ్రమణ్యస్వామితో పాటు టికాయత్ తదితరులు సుమారు మూడు గంటల సేపు సమావేశం కావడం దేశ రాజకీయాల్లో చాలా ఆసక్తికరంగా మారింది. సొంత పార్టీ (బిజెపి) మీదనే సుబ్రమణ్య స్వామి తరుచూ ఆరోపణలు, విమర్శలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి అనేక అంశాల్లో సవాళ్లు విసురుతుంటారు. అనేక అంశాలలో ఆయన బాహటంగానే తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. అలాంటి వ్యక్తి కెసిఆర్‌తో భేటీ కావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

దేశంలో నెలకొన్న రాజకీయాలు, కేంద్రంలోని బిజెపి సర్కార్ ప్రజావ్యతిరేక నిర్ణయాలు, బిజెపియేతర రాష్ట్రాల పట్ల మోడీ సర్కార్ చూపుతున్న వివక్ష…ఫెడరల్ స్పూర్తికి విఘాతం కలిగిస్తున్న తీరు…. తదితర అంశాలపై కూలంకషంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా మోడీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్న విధానంపై కూడా చర్చించారని సమాచారం. మోడీ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే…దేశ భవిష్యత్తు పూర్తిగా ఆగం అవుతుందని సమావేశంలో పాల్గొన్న నేతలు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసినట్లుగా అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే బిజెపియేతర రాష్ట్రాల పట్ల కేంద్రం చిన్న చూపు చూడడమే కాకుండా నిధుల కేటాయింపుల్లోనూ అన్యాయం చేస్తున్న విధానలపై కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాల్సిన ఆవశ్యకతపై కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమతో కలిసివచ్చే ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలతో ఢిల్లీలో పెద్దఎత్తున ఒక సమావేశాన్ని నిర్వహిస్తే…ఎలా ఉంటుందన్న అంశంపై కూడా సమాలోచనలు చేసినట్లుగా తెలుస్తోంది.

అయితే మరో వారం రోజుల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడి అయిన తరువాత….బిజెపి సర్కార్‌కు వ్యతిరేక కూటమి ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో సిఎం కెసిఆర్‌ను ముందుండి నడవాలని వారు సూచించినట్లుగా సమాచారం. మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా మీరు (కెసిఆర్) ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా….ఎటువంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చానా…తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా బిజెపి, కాంగ్రెసేతర పార్టీలతో జాతీయ స్థాయి కూటమిని ఏర్పాటు చేసేందుకు వివిధ పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఉన్న సిఎం కెసిఆర్ ఇటీవలే మహారాష్ట్రలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో పాటు ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్‌తో కెసిఆర్ సమావేశమై జాతీయ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు.

జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నేతలు, పౌర సమాజ సభ్యలు, భావ సారూప్యత కలిగిన వ్యక్తులు, సంస్థలు ఉమ్మడి వేదిక పైకి రావాల్సిన అవసరం ఉందని కెసిఆర్ ప్రధానంగా భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా అన్ని పార్టీల, వివిధ ప్రజా సంఘాల నేతలతో కొంతకాలంగా సిఎం కెసిఆర్ సమావేశమవుతున్నారు. కాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలతోనూ కెసిఆర్ ఫోన్‌తో జోరుగా మంతనాలు జరుపుతున్నారు. అలాగే మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ కూడా ఇప్పటికే కెసిఆర్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత తదితరులు కూడా పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News