మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరిట జిల్లా ఏర్పాటు యోచన
కరీంనగర్ పర్యటనలో సిఎం కెసిఆర్ ప్రకటించే అవకాశం
మనతెలంగాణ/హైదరాబాద్/కరీంనగర్ ప్రతినిధి: హుజురాబాద్‌ను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయించినట్టుగా తెలిసింది. భారతదేశ ఆర్థిక పితామహుడు, బహుభాషా కోవిదుడు, అపర చాణుక్యుడిగా గుర్తింపు పొందిన మాజీ ప్రధాని స్వర్ణీయ పివి నరసింహరావు పేరిట కొత్త జిల్లాను ఏర్పాటు చేయనున్నట్టుగా సమాచారం. ఈనెల 28వ తేదీన పివి వందో జయంతిని పురస్కరించుకొని రాష్ట్రం ప్రభుత్వం ఆయన పేరు చిరస్థాయిలో నిలిచిపోయే లా హుజురాబాద్‌ను కొత్త జిల్లా గా ప్రకటించడంతో పాటు పివి పేరును ఆ జిల్లాకు పెట్టాలన్న యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోం ది. ఇప్పటికే 33 జిల్లాలు ఉండగా కొత్త జిల్లా ప్రకటిస్తే మొత్తం రాష్ట్రంలో 34 జిల్లాలను ఏర్పాటు చేసినట్టు అవుతుంది. దీనిపై త్వరలో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనున్నట్టుగా సమాచారం. ఇప్పటికే చాలా ఏళ్లుగా హుజురాబాద్ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిసింది.
వంగర పివి నరసింహరావు స్వగ్రామం
హుజురాబాద్ 8 కిలోమీటర్ దూరంలో ఉన్న పాత తాలుకా కేంద్రమైన వంగర పివి నరసింహరావు స్వగ్రామం. సమీపంలోనే ఉన్న హుజురాబాద్ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసి వరంగల్ అర్చన్ జిల్లాలో చేర్చిన భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్తో పాటు కరీంనగర్ జిల్లాలో ఉన్న హుజురాబాద్, శంకరపట్నం, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, సైదాపూర్, చిగురుమామిడి మండలాలను కలుపుతూ పివి జిల్లాగా ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిసింది. నాలుగైదు రోజుల్లో సిఎం కెసిఆర్ కరీంనగర్‌లో పర్యటించనున్న నేపథ్యంలో పివి జిల్లా ఏర్పాటుతో పాటు చల్లూరు, వావిలాలను మండలాలు ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.
CM KCR to announce Huzurabad as new district?