Wednesday, January 22, 2025

మునుగోడులో మూడు రోజులు?

- Advertisement -
- Advertisement -

CM KCR to Election Campaign in Munugode

మన తెలంగాణ/హైదరాబాద్: మునుగోడు ప్రచార పర్వంలోకి స్వయంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దిగనున్నారు. ఈ నెల 31వ తేదీ నాటితో ఉప ఎన్నిక ప్రచారం ముగియనున్న నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలో మూడు రోజుల పాటు విస్తృతంగా ప్రచారం చేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఉపఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు సెమీఫైనల్‌గా భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మునుగోడులో టిఆర్‌ఎస్ అభ్యర్ధి కేవలం విజయం సాధించడమే కాకుండా భారీ మెజార్టీని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ మెజార్టీని చూసి ప్రతిపక్ష పార్టీలకు వణకుపుట్టాలన్న కసితో పనిచేయాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ పార్టీ పక్షాన జరుగుతున్న ఎన్నికల ప్రచారం గురువారం కెసిఆర్ ఆరా తీశారు. ఇందులో భాగంగా ఎన్నికల ఇన్‌ఛార్జీలతో ఆయన ఫోన్‌లో మాట్లాడారని సమాచారం. ప్రచార గడువు ముగియడానికి ఇంకా పది రోజులు కూడా లేవన్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత మేరకు ప్రజల్లోకి చొచ్చుకపోయి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించాలని ఆదేశించారు. అలాగే కేంద్రంలోని బిజెపి సర్కార్ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని వివరించాలని సూచించారు. బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి 18వేల కోట్ల రూపాయలకు ఆశపడే ఉపఎన్నిక తీసుకొచ్చారన్న అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఇప్పటి వరకు ప్రచార పర్వంలో అన్ని పార్టీలకే మనమే ముందున్నామన్నారు. ఇదే ఊపు…ఉత్సాహంతో ముందుకు వెళ్లాలన్నారు. అయితే ప్రచార పర్వానికి దీపావళి పండుగ సందర్భంగా కొంత అంతరాయం కలిగే అవకాశం ఉన్నప్పటికీ… రిలాక్స్ మాత్రం కావొద్దన్నారు.
కాగా, ఎన్నికల ఇన్‌ఛార్జీలు మీరు (కెసిఆర్) కూడా ప్రచార పర్వంలోకి దిగితే…వార్ వన్‌సైడ్ జరిగినట్లుగా ఓట్లన్నీ మనకే పడే అవకాశం ఉంటుందని సూచించారు. అందువల్ల కనీసం రెండు, మూడు రోజులైన మునుగోడు ప్రచారానికి సమయం కేటాయించాలని వారు కెసిఆర్‌ను కోరారు. వారి కోరిక మేరకు తాను కూడా స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని హామి ఇచ్చారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో మూడు రోజుల పాటు బస్సు యాత్ర, రోడ్ షోలు చేయాలని సిఎం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ నేతలకు తగు ఆదేశాలు సైతం జారీ చేశారని టిఆర్‌ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. కాగా చండూరులో ముందుగా నిర్ణయించిన ప్రకారం 30వ తేదీన భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాగా శుక్రవారం నుంచి వరుసగా మంత్రులు కెటిఆర్, హరీశ్ రావులు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ నెల 25 నుంచి పార్టీ కీలక నేతలు మునుగోడులోనే మకాం వేయనున్నారు. రోడ్ షోలు, ర్యాలీలతో మరింతగా హోరెత్తించనున్నారు.

CM KCR to Election Campaign in Munugode

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News