Wednesday, January 22, 2025

ఢిల్లీ ఆఫీసు రెడీ

- Advertisement -
- Advertisement -

తొలుత పార్టీ జెండా ఆవిష్కరణ హాజరు కానున్న మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంపిలు పంజాబ్, హర్యానా, యుపి,
ఒడిషా, తమిళనాడు నుంచి రైతు నాయకులు హాజరు

పాల్గొనున్న కర్ణాటక మాజీ సిఎం కుమారస్వామి, ఎస్‌పి అధినేత అఖిలేశ్ యాదవ్
పార్టీ సొంత భవన నిర్మాణ పనులను పరిశీలించిన కెసిఆర్

తాత్కాలిక కార్యాలయాన్ని సందర్శించిన సిఎం మార్పులు, చేర్పులపై నేతలకు సూచనలు

సర్దార్ పటేల్ మార్గ్‌లోని కార్యాలయంలో ప్రారంభమైన రాజశ్యామల యాగం

హైదరాబాద్: దేశ రాజధానిలో బిఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రారంభిస్తారని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. కార్యాలయం ప్రారంభం నేడు మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషాల నుంచి 12 గంటల 47 నిమిషాలకు ముహూర్తంగా నిర్ణయించామని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రులు, శాసనసభ్యులు, ఎం పీలు ఇతర ప్రజా ప్రతినిధులు  హాజరుకానున్నారని తెలిపారు. అలాగే పంజాబ్, హ ర్యా నా, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతు నాయకులు కూడా వస్తారన్నారు. కేవ లం ఎనిమిదేళ్లలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టిన వ్యక్తి కెసిఆర్ అని ఈ సందర్భంగా మంత్రి కొనియాడారు. రాష్ట్రంలో రైతులు, పేదల కోసం అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు కావాలని కెసిఆర్ భావిస్తున్నారన్నారు. తాను కెసిఆర్‌కు ఒక సైనికుడిగా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం మాదిరిగా దేశంలో ప్రాజెక్టులు కట్టి ప్రజలకు సాగు, తాగు నీరును ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. ఇప్పటికీ ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాలను ఎందుకు దిగుమతి చేసుకుంటున్నామని నిలదీశారు. పేదలు, రైతులు, మహిళలు అన్నివర్గాల ప్రజల కోసం కెసిఆర్‌తీసుకుంటున్న చర్యలు దేశవ్యాప్తంగా అమలు కావాలన్నారు. అప్పుడే స్వాతంత్య్ర ఫలితాలు అందరికి అందుతాయన్నారు. అలా జరగకపోవడం వల్లే దేశంలో ధనవంతుడు ధనవంతుడుగా ఎదుగుతూనే ఉన్నాడన్నారు. ఈ పరిస్థితిలో మార్పును తీసుకరావాలన్న లక్షంతోనే కెసిఆర్ బిఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేశారన్నారు. ఇదేదో చిల్లర, మల్లారగా కాకుండా ఒక నిర్ధిష్టమైన ఎజెండాతో ముందుకు వస్తున్నారన్నారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న ఇప్పటి వరకు అనేక రాష్ట్రాల్లో ప్రజలకు సాగు, తాగు నీటిని ఇవ్వలేకపోతున్నారన్నారు. వ్యవసాయ సాగుకు ఎంతో అనువైన దేశంగా భారత్‌కు పేరునప్పటికీ ఆహారాధాన్యాలను ఇంకా దిగుమతులు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దేశ సంపద కొంతమంది గుప్పిట్లోకి పోతున్నదన్నారు. ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్నవి మంచి ఆర్థిక విధానాలు కావన్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా, అభివృద్ధి కాంక్షించేలా దేశ ఆర్థిక విధానాలు ఉండాలన్నదే కెసిఆర్ ఆలోచన అని అన్నారు. బుద్ధి జీవులు, మేధావులు, రైతులు, ప్రజలు రాజకీయాల్లో విప్లవాత్మక మార్పు కోరుకుంటున్నారన్నారు.

కార్యాలయాన్ని పరిశీలించిన కెసిఆర్
నేడు ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బిఆర్‌ఎస్(భారత రాష్ట్ర సమితి) కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ మధ్యాహ్నం సందర్శించారు. కార్యాలయాన్ని పరిశీలించిన ఆయన…ఈ సందర్భఁగా పలు సూచనలు చేశారు. అనంతరం యాగం, పూజలు జరుగుతున్న ప్రదేశాలను సందర్శించారు. తదనంతరంసర్దార్ పటేల్ మార్గ్ నుంచి వసంత్ విహార్‌కు వెళ్లారు. అక్కడ నిర్మాణంలో ఉన్న బిఆర్‌ఎస్ శాశ్వత భవనాన్ని ఆయన పరిశీలించారు. అన్ని ఫ్లోర్లను కలియ తిరిగి పలు సూచనలు చేశారు. సిఎం కెసిఆర్ వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వర్ రావు, సంతోష్ కుమార్, పలువురు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ఉన్నారు. కాగా ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి ప్రముఖ రాజకీయ నాయకులు హాజరు కాబోతున్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా హాజరు కానున్నారు. అలాగే యుపిమాజీ సిఎం అఖిలేష్ యాదవ్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

మొదలైన యాగాలు
దేశం సుభిక్షంగా ఉండడంతో పాటు బిఆర్‌ఎస్ పార్టీ విజయవంతం కావాలని కాంక్షిస్తూ ఢిల్లీలో రాజశ్యామల యాగాన్ని మంగళవారం ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు 12 మంది ఋత్విక్కులు గణపతి పూజతో రాజశ్యామల యాగానికి శ్రీకారం చుట్టారు. యాగ నిర్వహణ కోసం వారు సోమవారమే ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం పుణ్యహవాచనం, యాగశాల ప్రవేశం, చండీ పారాయణం, మూలమంత్ర జపాలు చేశారు. కాగా బుధవారం నవ చండీహోమం, రాజశ్యామల హోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. శృంగేరిపీఠం గోపీకృష్ణశర్మ, ఫణి శశాంకశర్మ ఆధ్వర్యంలో యాగాలు జరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News