Monday, December 23, 2024

మల్లన్నకు జలబోనం

- Advertisement -
- Advertisement -

CM KCR to inaugurate Mallannasagar Reservoir today

11 జిల్లాల పరిధిలో 11.5లక్షల ఎకరాలకు సాగునీరు, మిషన్ భగీరథ కింద 7 జిల్లాల్లోని 9 నియోజకవర్గాల దాహం తీర్చనున్న జలప్రదాయిని.
జంటనగరాలకు, పరిశ్రమలకు జలధారలు

నదికి నడక నేర్పిన అపరభగీరథుడు కెసిఆర్

దేశంలోనే నదిలేని చోట కట్టిన అతిపెద్ద జలాశయం : మంత్రి హరీశ్‌రావు

ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు అనేక కుట్రలు పన్నాయి, దుష్ప్రచారం చేశాయి, ఇప్పుడవన్నీ పటాపంచలయ్యాయి, నిర్వాసితుల కోసం గజ్వేల్ వద్ద దేశంలో ఎక్కడాలేని విధంగా ఆర్‌అండ్ ఆర్ నిర్మాణం చేపట్టాం, బిజెపిది దివాళాకోరు రాజకీయమే, వివిధ రాష్ట్రాల ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం మన రాష్ట్రంలో మాత్రం ఒక్క ప్రాజెక్టుకూ ఇవ్వలేదు : తుక్కాపూర్ సభా స్థలి వద్ద మీడియాతో మంత్రి హరీశ్‌రావు

మన తెలంగాణ /తొగుట: నదికి నడక నేర్పిన ఆపరభగీరధుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. భారత దేశంలోనే నది లేని చోట కట్టిన అతి పెద్ద జలాశయం మల్లన్న సాగర్ అని పేర్కొన్నారు. మంగళవారం తొగుట మండలం తుక్కాపూర్‌లోని సభాస్థలి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి మాట్లాడారు. సిఎం కెసిఆర్ కలల ప్రాజెక్టుగా మల్లన్న సాగర్ నిర్మాణం జరిగిందన్నారు. దేశంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు అన్నారు. నడిగడ్డగా ఉన్న సిద్దిపేట ప్రాంతం కరువుకు, రైతుల ఆత్మహత్యలకు, వలసలకు ఇన్నాళ్లూ చిరునామాగా ఉంటూ వచ్చిందని, ఇకపై అటువంటి పరిస్థితులుండవన్నారు. తెలంగాణలోని ఏ ప్రాంతానికైన నీరు ఇచ్చేలా మల్లన్న సాగర్ జలాశయం నిర్మాణం చేపట్టామన్నారు. తెలంగాణలోని సగానికిపైగా జిల్లాలకు తాగు, సాగు నీరు పారిశ్రామిక అవసరాలు తీర్చేలా ప్రాజెక్ట్ నిర్మాణం చేశామన్నారు.

తక్కువ ముంపుతో బహుబలి ప్రాజెక్టుగా మల్లన్న సాగర్ జలాశయం నిర్మాణం, హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీర్చేలా జరిగిందన్నారు. నిర్వాసితులకు దేశంలో ఎక్కడి లేని విధంగా గజ్వేల్ పట్టణ సమీపంలో అర్ అండ్ ఆర్ నిర్మాణం చేపట్టామన్నారు. నిర్వాసితులకు త్యాగఫలితమే ఈ ప్రాజెక్ట్ అని వారి త్యాగాలు వెలకట్టలేనివన్నారు. ప్రభుత్వం తరుపున అన్ని రకాల సహాయ సహకాలు అందజేస్తామని తెలిపారు. సిఎం కుటుంబం కూడా ఒకప్పుడు నిర్వాసిత కుటుంబమే అన్నారు. నిర్వాసితుల బాధలు కెసిఆర్‌కు తెలుసన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును అడ్డుకోవడం కోసం విపక్షాలు అనేక కుట్రలు పన్నాయని, రైతులను మభ్య పెట్టి కోర్టుల్లో తప్పుడు కేసులు వేయించాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణం జరగదని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం భూములు సేకరిస్తున్నారని తప్పుడు ప్రచారం చేశాయని హరీశ్ గుర్తు చేశారు. ఇప్పుడు ఆ ప్రచారాలన్నీ పాటా పంచలై కెసిఆర్ కల సాకారమై ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్నారు. ఈ విషయంలో బిజెపిది దివాలాకోరు రాజకీయం తప్ప ఇంకేమీ లేదన్నారు. ఇకనైనా బిజెపి నాయకులకు గోబెల్స్ ప్రచారం చేయడం మానుకోవాలన్నారు.

ఆ పార్టీ నాయకులకు అభివృద్ధి చేయడం రాదని హరీశ్ అన్నారు. దేశంలో వివిధ రాష్ట్రాలలో ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. బిజెపి విద్వేష, విభజన, మత రాజకీయాలు తప్ప అభివృద్ధి గురించి పట్టించుకోదన్నారు. వారిది పాకిస్థాన్ భాష అని ఘాటుగానే విమర్శించారు. సమావేశంలో ఎఫ్‌ఢిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, సిఎం ఒఎస్‌డి దేశ పతి శ్రీనివాస్, తెలంగాణ వైద్య మౌలిక వసతుల అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ప్రజాప్రతినిదులు చిట్టి దేవేందర్‌రెడ్డి, దేవి రవీందర్. మాదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News