Monday, December 23, 2024

తెలంగాణలో వైద్య విప్లవం

- Advertisement -
- Advertisement -

13MB01

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్య విప్లవం కొనసాగుతోంది. గతేడాది ఒకేసారి ఎనిమిది మెడికల్ కాలేజీలను ప్రారంభించిన ప్రభుత్వం, శుక్రవారం మరో తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రారంభించనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఐదు మెడికల్ కాలేజీలు ఉండగా, స్వరాష్ట్రంలో వైద్య విద్యను అందరికీ చేరువు చేయాలని భావించిన సర్కార్.. జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తోంది. కొత్తగా ఏర్పాటవుతున్న కాలేజీలతో రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్యకు 26కు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెరిగిన ఎంబిబిఎస్ సీట్లతో.. పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందనున్నాయి. మరోవైపు మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు సైతం ఏర్పాటు చేస్తోంది.
నాలుగు రెట్లు పెరిగిన ఎంబిబిఎస్ సీట్లు
తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో ఉన్నది 2,950 ఎంబిబిఎస్ సీట్లు మాత్రమే. అందులో ప్రభుత్వ విభాగంలో 850 సీట్లే. అలాగే 1,180 పిజి వైద్య విద్య సీట్లు ఉంటే అందులో 515 మాత్రమే ప్రభుత్వ విభాగంలో ఉన్నాయి. 2014 నుంచి వైద్య విద్యపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీ లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇఎస్‌ఐ, ఎయిమ్స్ మెడికల్ కాలేజీలు కలిపి ప్రస్తుతం రాష్ట్రంలో 28 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రాగా.. ప్రభుత్వ విభాగంలో ఎంబిబిఎస్ సీట్ల సంఖ్యను 3,915కి పెంచింది. పిజి సీట్లు సైతం 1,300లకు పైగా చేరటం గమనార్హం. అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ విభాగంలో ఎంబిబిఎస్ సీట్ల సంఖ్య 4 రెట్లు, పిజి సీట్ల సంఖ్య రెండున్నర రెట్లు పెరిగాయి. దేశ సగటుతో పోలిస్తే ప్రతి లక్ష మందికి 22 ఎంబిబిఎస్ సీట్లతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా.. ప్రతి లక్షకు 8 పిజి వైద్య విద్య సీట్లతో రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. వచ్చే ఏడాది ప్రారంభించేందుకు మంజూరు చేసుకున్న 8 మెడికల్ కాలేజీలతో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు పూర్తవుతున్నది. 2023 నాటికి 26 మెడికల్ కాలేజీలతో మెడికల్ సీట్ల సంఖ్య 3,690కి చేరనుంది.
రేపు 9 మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్న సిఎం
రాష్ట్రంలో శుక్రవారం(సెప్టెంబర్ 15) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తొమ్మిది మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్నారు. గతేడాది ఎనిమిది మెడికల్ కాలేజీలను ప్రారంభించగా, ఈ ఏడాది కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాంలో మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. తాజాగా ప్రారంభించే తొమ్మిది మెడికల్ కాలేజీలు కలుపుకొని ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 26కు చేరనుంది. తొమ్మిది కొత్త మెడికల్ కాలేజీలలో రాష్ట్రంలో కొత్తగా 900 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర సొంత నిధులతో ఒకే ఏడాదిలో ఇంత పెద్ద సంఖ్యలో మెడికల్ కాలేజీలు ప్రారంభించుకోవడం దేశంలో ఇంకెక్కడ జరగలేదు. దేశ వైద్య విద్య చరిత్రలో తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించింది.
సామాన్యులకు చేరువైన వైద్య విద్య
ఒకప్పుడు తెలంగాణ విద్యార్థులు పొరుగు రాష్ట్రాలకు లేదా ఇతర దేశాలకు వెళ్లి వైద్యవిద్య అభ్యసించాల్సిన పరిస్థితి ఉండేది. చైనా, పిలిప్పిన్స్, ఉక్రెయిన్, రష్యా వంటి దేశాలకు వెళ్లి తెలంగాణ విద్యార్థులు అనేక కష్టాలు పడుతూ వైద్య విద్యను అభ్యసించేవారు. ఆయా దేశాల బాషలు నేర్చుకొని మరీ ఎంబిబిఎస్ పూర్తి చేయాల్సిన దుస్థితి ఉండేది. విదేశాలలో వైద్య విద్య చదవడం తల్లిదండ్రులకు ఆర్థికంగా పెనుభారంగా మారేది. ఈ పరిస్థితులకు చెరమగీతం పాడాలని నిర్ణయించిన సిఎం కెసిఆర్ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు సైతం స్పెషాలిటీ వైద్యంతో పాటు, వైద్య విద్యను చేరువ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. మెడికల్ కాలేజీల ఏర్పాటుతో కేవలం విద్యార్థులకు మాత్రమే కాకుండా, కళాశాల చుట్టుపక్కల వారికి సైతం మెరుగైన వైద్యం అందేందుకు అవకాశాలు మెరుగుపడ్డాయి. ఒకప్పుడు చిన్నాచితకా వ్యాధులకు సైతం రోగులను గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు రిఫర్ చేసే వారు ఇప్పుడు అందుకు భిన్నంగా జిల్లా ఆస్పత్రుల్లోనే మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చింది.
60 ఏళ్లలో ఏర్పాటైన మెడికల్ కాలేజీలు రెండే
తెలంగాణ ఏర్పడ్డ నాడు రాష్ట్రంలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే, అందులో 3 మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వాల ప్రమేయం లేకుండానే ఏర్పాటయ్యాయి. ఉస్మానియా మెడికల్ కాలేజీ 1856, గాంధీ ఆసుపత్రి 1954లో ఏర్పాటు కాగా, వరంగల్‌లో రీజినల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో 1959లో కాకతీయ మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. ఇలా ఏర్పాటైన మూడు మెడికల్ కాలేజీల విషయంలో ఉమ్మడి పాలకుల పాత్ర శూన్యం. 60 ఏళ్ల ఉమ్మడి పాలనలో ఏర్పాటు చేసినవి కేవలం రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే. తెలంగాణ ఉద్యమ సమయంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అప్పటి ఉద్యమనేత కెసిఆర్ పాలకులను ప్రశ్నిస్తే.. కంటితుడుపు చర్యగా 2008లో ఆదిలాబాద్ రిమ్స్, 2013లో నిజామాబాద్ కాలేజీని ఏర్పాటు చేశారు.ఆరు దశాబ్దాల ఉమ్మడి పాలనలో రెండు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, దశాబ్దకాలంలోనే సిఎం కెసిఆర్ 21 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు.
100 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే
రాష్ట్రంలో 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లోని కాంపిటేటివ్ అథారిటీ కోటా(కన్వీనర్ కోటా)లోని 100 శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈమేరకు తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్‌కు సవరణ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, ఈ నిర్ణయం సరైందని హైకోర్టు సైతం స్పష్టం చేసింది. గతంలో 85 శాతం మాత్రమే స్థానిక విద్యార్థులకు ఉండగా, మిగతా 15 శాతం అన్ రిజర్వుడుగా ఉండేది. ఇందులో తెలంగాణతో పాటు ఎపి విద్యార్థులు కూడా పోటీ పడేవారు. తాజా నిర్ణయం వల్ల మన విద్యార్థులకు మరో 520 సీట్లు దక్కాయి. దీంతో పాటు ఎంబిబిఎస్ బి కేటగిరి సీట్లలో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే చెందేలా లోకల్ రిజర్వ్ చేసుకోవడం వల్ల తెలంగాణ విద్యార్థులకు మరో 1,300 ఎంబిబిఎస్ సీట్లు దక్కాయి. తెలంగాణ ప్రభుత్వం ముందు చూపుతో తీసుకున్నఈ రెండు నిర్ణయాల వల్ల తెలంగాణ విద్యార్థులకు మొత్తం 1,820 సీట్లు ప్రతి ఏటా దక్కనున్నాయి. 1,820 సీట్లు అదనంగా అంటే దాదాపు 20 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో సమానం. ప్రతి ఏటా కాలేజీలు పెరిగిన కొద్ది ఈ సీట్ల మరింత పెరగనుంది.
రాష్ట్రంలో ఏటా 10 వేల మందికి వైద్య విద్య
ప్రభుత్వ ప్రైవేటులో కలిపి ఏటా పది వేల మంది వైద్య విద్యార్థులను తయారు చేసే స్థాయికి నేడు తెలంగాణ ఎదిగింది. ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబిబిఎస్ సీట్లతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2022 -23లో దేశవ్యాప్తంగా పెరిగిన ఎంబిబిఎస్ సీట్లలో తెలంగాణ వాటా 43 శాతంగా ఉంది.
పెద్ద ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు మెడికల్ సీటు
రాష్ట్రంలో ఎస్‌టి రిజర్వేషన్ కోటాను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుకోవడం వల్ల గతేడాది 2,09,646 ర్యాంకు వచ్చిన విద్యార్థికి సీటు లభించింది.కన్వీనర్ కోటా రెండో విడతలోనే,2.66 లక్షల బిసి మహిళకు సీటు లభించింది. ఇటీవల మొదటి విడత కన్వీనర్ కోటా కౌన్సెలింగ్‌లో 2.38 లక్షల నీట్ ర్యాంకు సాధించిన విద్యార్థికి ఎంబిబిఎస్ సీటు రాగా, ఇప్పుడు రెండో విడత కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటాలో ఏకంగా 2,66,945 ర్యాంకు సాధించిన బిసి సి మహిళా విద్యార్థినికి సీటు లభించింది. ఇంతటి పెద్దస్థాయి ర్యాంకుకు సీటు రావడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. అలాగే మొదటి విడత కౌన్సిలింగ్ జనరల్ కోటాలో 1.31 లక్షల ర్యాంకు సాధించిన విద్యార్థికి సీటు రాగా, ఇప్పుడు రెండో విడత కౌన్సెలింగ్ 1.59 లక్షల ర్యాంకు సాధించిన జనరల్ కేటగిరీ విద్యార్థికి సీటు వచ్చింది. రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో మొత్తం 5,514 సీట్లు ఉన్నాయి. గతేడాది ఓ ప్రైవేట్ కాలేజీలో చివరి (నాలుగో విడత కౌన్సిలింగ్‌లో 2.28 లక్షల ర్యాంకరు బిసి ఎ కేటగిరీలో కన్వీనర్ సీటు లభించగా. ఈసారి రెండో విడత కౌన్సెలింగ్‌లోనే 2.66 లక్షల ర్యాంకు సాధించిన బిసి సి విద్యార్థికి కన్వీనర్ సీటు వచ్చింది. అలాగే గతేడాది జనరల్ కేటగిరీలో చివరి విడతలో 1.25 లక్షల ర్యాంకుకు సీటు రాగా, ఇప్పుడు రెండో విడతలోనే 1.59 లక్షల ర్యాంకుకు జనరల్ కేటగిరీలో సీటు వచ్చింది. బిసి సి కేటగిరీలో గతేడాది 1.37 లక్షల ర్యాంకుకు సీటు రాగా, ఈసారి రెండో విడతలోనే 1.82 లక్షల ర్యాంకర్‌కు సీటు వచ్చింది. అలాగే గతేడాది బిసి డి కేటగిరీలో 1.28 లక్షల ర్యాంకర్‌కు సీటు రాగా, ఈసారి 1.75 లక్షల ర్యాంకర్‌కు సీటు అభించింది.
తమకు ఇష్టమైన, అనువైన కాలేజీ కోసం రెండో విడత కౌన్సెలింగ్‌లోనూ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. రాష్ట్రంలో మెడికల్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కొందరు విద్యార్థులు జాతీయ స్థాయి అవకాశం పొందుతారు. ఇంకా పెద్ద ర్యాంకులు వచ్చిన వారు కూడా సీట్లు పొందే అవకాశం ఉంటుంది.
మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రం వివక్ష..
కేంద్ర ప్రభుత్వం మూడు దశల్లో దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. తాజాగా నర్సింగ్ కాలేజీలను కూడా మంజూరు చేసింది. అయితే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ గానీ, నర్సింగ్ కాలేజీ గాని మంజూరు చేయలేదు. ఉత్తరప్రదేశ్‌కు 26, రాజస్థాన్‌కు 23, మధ్యప్రదేశ్‌కు 12,ఇటీవల ఎన్నికలు జరిగిన బెంగాల్‌కు 12, తమిళనాడుకు 11 కేటాయించి తెలంగాణకు మొండి చేయి చూపారు. తెలంగాణకు జరిగిన ఈ అన్యాయంపై ఏ ఒక్క బిజెపి, కాంగ్రెస్ నాయకులు ఏనాడు మాట్లాడలేదు. ఒక్కనాడూ పార్లమెంట్‌లో ప్రశ్నించలేదు. తెలంగాణపై కేంద్రం వివక్షను ఒకవైపు ఎండగడుతూనే, తెలంగాణ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని, వైద్య విద్యను చేరువ చేసేందుకు రాష్ట్ర సొంత నిధులతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News