మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ దేశానికి ప్రధాని అయితేనే మాదిగల చిరకాలం స్వప్నం వర్గీకరణ సాధ్యమవుతుందని రాష్ట్ర ఎస్‌సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. శనివారం విజయవాడలో నిర్వహించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మాదిగ సంఘాల సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ.. మాదిగలు వర్గీకరణ కోసం 26 ఏళ్లుగా ఉద్యమిస్తున్నప్పటికి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఎస్‌సి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టకుండా మాదిగ సమాజానికి తీరని మోసం చేశారని ఆరోపించారు. వర్గీకర-ణ అంశంపై ఎంతో చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి కెసిఆర్ ఏకంగా మూడుసార్లు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. కేంద్రం ఆ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. భవిష్యత్తులో కెసిఆర్ ప్రధాని అయితే ఎస్‌సి వర్గీకరణ ప్రధాన అంశంగా పార్లమెంట్‌లో పెట్టే వీలుందన్నారు. మాదిగలను అమితంగా ప్రేమించే ఉద్యమ నేత కెసిఆర్ భావి ప్రధాని కావాలని, తద్వారా వర్గీకరణ అంశం వెంటనే పరిష్కరించాలని మాదిగ సమాజం కోరుకుంటుందన్నారు.
CM KCR to Set SC Classification says Pidamarthi Ravi