Monday, December 23, 2024

రేపు మహారాష్ట్రకు సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR to visit Maharashtra tomorrow

 

హైదరాబాద్ : కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌కు చుక్కులు చూపించేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నడుం బిగించారు. జాతీయ స్థాయిలో బిజెపియేతర ప్రభుత్వాలన్నింటిని ఏకతాటిపై తీసుకొచ్చే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఆదివారం సిఎం కెసిఆర్ మహారాష్ట్రకు వెళ్ళనున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే ఇటీవల సిఎం కెసిఆర్‌కు ఫోన్ చేసి లంచ్‌కు రావాల్సిందిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆయన ఆహ్వానం మేరకు సిఎం కెసిఆర్ ఆదివారం ఉదయం 11 గంటలకు బేంగపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి బయలుదేరి వెళ్తారు. ఉద్దవ్ థాక్రేతో మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం జాతీయ స్థాయిలో తాజా రాజకీయాలపై ప్రధానంగా చర్చించనున్నారు. బిజెపియేతర ప్రభుత్వాల పట్ల మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు… రాష్ట్రాలను హక్కులను కాలరాసే విధంగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై వారిద్దరూ కలంకషంగా చర్చించనున్నారు. అలాగే దేశంలో నెలకొన్న ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు, వ్యూహాలు, కార్యాచరణ తదితర అంశాలపై కూడా పలు కోణాల్లో చర్చించనున్నారు. తదనంతరం మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రూపొందించాల్సిన ప్రణాళికపై కూడా చర్చించే అవకాశముందని తెలుస్తోంది. సిఎం కెసిఆర్‌తో పాటు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావు, పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు కూడా ముంబైకు వెళ్లనున్నారని తెలుస్తోంది.

తిరిగబడ్డ తెలంగాణ బిడ్డ

రైతులతో సహా అన్ని వర్గాల ప్రజల ఉసురు తీస్తూ….రాజకీయ ప్రత్యర్థులపై సిబిఐ, ఇడి, ఐటిలను ప్రయోగిస్తూ , రాష్ట్రాల అధికారాలను మెల్లగా సంస్కరణ పేరుతొ లాగేస్తూ ప్రజాస్వామ్య దేశాన్ని కాస్తా అధ్యక్ష తరహా, మతతత్వ దేశంగా మార్చేస్తున్న మోడీపై తిరిగబడ్డ ముఖ్యమంత్రుల్లో సిఎం కెసిఆర్ మొదటి వరసలో ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏళ్లు అలుపెరగని పోరాటం చేసి గాంధీబాటలో శాంతియుతంగా ఉద్యమం చేసి తెలంగాణను సాధించడమే కాకుండా ఏడేళ్లలోనే యావత్ దేశాన్ని తెలంగాణ వైపు చూసేలా సిఎం కెసిఆర్ తన పాలనతో మెప్పించారు. దేశంలోని పలు రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా మారింది. అయినప్పటికీ రాష్ట్రం పట్ల కేంద్రం చూపిస్తున్న వివక్షను సహించ లేక మోడీ సర్కార్‌పై నేరుగా యుద్దం ప్రకటించారు. కేవలం రెండు సభలు, రెండు ప్రెస్‌మీట్లతో దేశంలో రాజకీయాలను మార్చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. నిన్నా…మొన్నటి వరకు మోడీని ఎదిరించడానికి సరైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్న దేశ ప్రజలకు ప్రస్తుతం సిఎం కెసిఆర్ ఆశాకిరణంలా మారారు. మోడీ, బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై కెసిఆర్ సంధించిన ఒక్కో ప్రశ్న దేశ ప్రజల్లోకి తూటాలో దూసుకుపోయింది. దేశంలో మోడీని ఎదురించి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలా పడిపోయిన వేళ సిఎం కెసిఆర్ ఉత్తుంగ తరంగంలా దూసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే మమతాబెనర్జీ, స్టాలిన్, ఉద్ధవ్ థాక్రే వంటి బిజపియేతర రాష్ట్రాల సిఎంలతో కలిసి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు.

కెసిఆర్ చుట్టు తిరిగుతున్న దేశ రాజకీయాలు

ప్రస్తుతం దేశ రాజకీయాలు సిఎం కెసిఆర్ చుట్టూ తిరుగుతున్నట్లే కనిపిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్నామనే అహంకారంతో బిజెపి ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తోందని భావన బిజెపియేతర ముఖ్యమంత్రుల్లో నెలకొంది. అయితే నేరుగా మోడీపై ఆరోపణలు చేసే సాహసం లేని కారణంగా పలువురు ముఖ్యమంత్రులు కేంద్ర పత్తానాన్ని సహిస్తూ…కిమ్మనకుండా ఉండిపోతున్నారు. కానీ సిఎం కెసిఆర్ వారిలా మెతక వైఖరిని కాకుండా కేంద్రం కన్నెర్ర చేశారు. మోడీపై ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని ఘాటైన విమర్శలు చేశారు. మోడీపై సిఎం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశంలో హాట్‌టాపిక్‌గా మారాయి. మోడీ సర్కారను కెసిఆర్ ఎండగడుతున్న వైనానికి ఫిదా అవుతున్నారు. దేశ ప్రజల కోసం అసరమైతే పార్టీ పెట్టడమే కాదు…. అన్ని పార్టీలను ఏకం చేసేందుకు తానే ముందుంటానని కూడా సిఎం కెసిఆర్ బహిరంరంగానే వ్యాఖ్యానించారు.

దీనికి పలు రాష్ట్రల నుంచి సిఎం కెసిఆర్ అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలోనే పలువురు ముఖ్యమంత్రులు సిఎం కెసిఆర్‌కు ఫోన్ చేసి….. ఆయనను అభినందిస్తున్నారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాటను ఎంచుకుంటే తప్పకుండా తమ సంపూర్ణ మద్దతు…సహకారం ఉంటుందని కెసిఆర్‌కు భరోసా ఇస్తున్నారు. వారిలో మహరాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులతో పాటు మాజీ ప్రధాని దేవెగౌడ, వామపక్షాలు, ఆర్‌జెడి పార్టీలు కూడా కెసిఆర్‌కు ఫోన్‌కు చేసి అభినందిస్తున్న విషయం తెలిసిందే. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఆవశ్యకతను వారు కూడా గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కెసిఆర్ వేస్తున్న ప్రతి అడుగు….మాట్లాడుతున్న ప్రతి అక్షరం…ప్రతి పదంపై కూడా దేశంలో వాడివేడిగా చర్చకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో బిజెపియేతర ప్రభుత్వాలు…పార్టీలన్నీ సిఎం కెసిఆర్ వైపు చూస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News