ఆలయ పునర్నిర్మాణ పనుల ప్రగతిని పరిశీలించనున్న ముఖ్యమంత్రి
ప్రధాన ఆలయం, పుష్కరిణి, కళ్యాణకట్ట తదితర నిర్మాణాలకు దిద్దుతున్న తుది మెరుగులను స్వయంగా చూడనున్నారు
ఆర్‌టిసి టెర్మినల్, డిపోల నిర్మాణ స్థలాలు పరిశీలించే అవకాశం
పనులపై అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వనున్న సిఎం
లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన ముహుర్తాన్ని నిర్ణయించే సూచన
హైదరాబాద్ : ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలిస్తారని సమాచారం. ప్రధానాలయంతో పాటు భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణకట్ట నిర్మాణంతో పాటు వివిఐపిల విడిది కోసం నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్ సూట్ తుదిమెరుగుల పనులను వీక్షించనున్నారు. అలాగే ఆర్‌టిసి బస్ టెర్మినల్, డిపోలను నిర్మించనున్న స్థలాలు పరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆలయ నిర్మాణ పనుల పురోగతిని సిఎం సమీక్షించి, నిర్మాణ పనులపై అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సిఎం కెసిఆర్ క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించిన అనంతరం లక్ష్మీనృసింహస్వామి ఆలయ ఉద్ఘాటన ముహూర్తాన్ని నిర్ణయించే అవకాశముందని కూడా అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం.