హైదరాబాద్ : ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆసక్తికర కథ చెప్పారు. తిరుమల రాయుడు అనే రాజు ఉండేవారని, ఆయనకు దురదృష్టవశాత్తూ ఒకటే కన్ను ఉండేదని… ఇదే విషయంలో ఆయన బాధపడుతుండేవారని తెలిపారు. ఆ రాజ్యంలో ఒక కవి కూడా ఉన్నారని, అతడికి ఏవో సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. రాజుగారి దగ్గర బహుమానం పొందాలంటే ఆయనను పొగడాలని ఆ కవికి అందరూ సలహా ఇవ్వగా, కవికి అవసరం ఉంది కాబట్టి, ఆయనకు ఇష్టం లేకపోయినా పొగడ్తలతో కూడిన కవితను వినిపించారని చెప్పారు.సిఎం కెసిఆర్ కథ చెబుతుండగా సభ్యులు నవ్వుతూనే ఉన్నారు.“అన్నాతిగూడి హరుడవు.. అన్నాతిని గూడనపుడు అసుర గురుండవు.
అన్నా తిరుమలరాయ కన్నొక్కటే లేదు గానీ, కౌరవపతివే’ అని కవిత్వం చెప్పారని వివరించారు. అంటే రాజు భార్య ఉన్నప్పుడు నువ్వు మూడు కళ్ల శివుడవు… ఆయన భార్య రెండు కళ్లతో కలిపి మూడు కలిగినవాడని అర్ధం అని, ఇక భార్యతో లేనప్పుడు నువ్వు రాక్షసుల గురువైన శుక్రాచార్యుడంతటి వాడివి…శుక్రాచార్యుడికి ఒక కన్ను మాత్రమే ఉంటుంది కదా అని, ఆ ఒక్క కన్ను కూడా లేకపోతే నువ్వేమైనా తక్కువ వాడివా ‘కౌరవపతి’… అంటే ధృతరాష్ట్రుడంతటి వాడివి” అని పొగిడారని వివరించారు. ఇప్పుడు పార్లమెంట్‌లో ప్రధాని మోదీని ఉద్దేశించి బిజెపి ఎంపీలు ఇలాగే పొగుడుతున్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో జరిగే చర్చ చూస్తుంటే తనకు ఈ కథ గుర్తుకు వస్తోందని తెలిపారు. మంచి పనులు చేయాలి.. అభివృద్ధి చేయాలని చెప్పకుండా ‘బాగుంది.. బాగుంది..’ అని చెబుతున్నారని విమర్శించారు.
మాజీ ప్రధాని అయిన తర్వాత అప్పుడు అసలు సంగతి చెబుతారని అయినా మాజీ ప్రధాని అంటే తక్కువా అని పేర్కొన్నారు. మంచి ప్రదర్శన లేనప్పుడు కూడా అనవసరంగా పొగడటం మంచికి దారితీయదు అంటూ సిఎం కెసిఆర్ ప్రధాని మోడీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశ పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం విధానాలు, బిజెపి అవలంభిస్తున్న విధానాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతున్న సమయంలో షేమ్ షేమ్ అంటూ సభ్యులు నినాదాలు చేశారు.