సాగర్ నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష
ఉదయం 10.40గంటలకు హెలీకాప్టర్‌లో చేరుకోనున్న ముఖ్యమంత్రి
10.55కు మార్కెట్ యార్డ్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులతో నియోజకవర్గ అభివృద్ధిపై చర్చ
మన తెలంగాణ/హాలియా: నాగార్జునసాగర్ ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి కెసిఆర్ నేడు హాలియాకు రానున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రగతి సమీక్ష చేయనున్నారు. అందుకోసం నియోజకవర్గ కేంద్రమైన హాలియాలో ఏర్పాట్లు చేశారు. జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి మార్గదర్శకంలో టిఆర్‌ఎస్ నేతలు, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నేడు ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గం గుండా బేగంపేట విమానాశ్రయానికి సిఎం రానున్నారు. 10.40 గంటలకు హెలికాప్టర్ ద్వారా హాలియాకు చేరుకోనున్నారు. 10.55 గంటలకు మార్కెట్ యార్డులో నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1.10 గంటలకు స్థానిక ఎంఎల్‌ఎ నోముల భగత్ నివాసంలో లంచ్ చేయనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 2.10 గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం చేయనున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో సమీక్షా సమావేశం కావడంతో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ వర్గాల ప్రముఖుల భాగస్వామ్యానికే పెద్దపీటవేస్తున్నారు. సమావేశ స్థలానికి పరిమితుల దృష్టా ముందస్తుగా పాస్‌లు పొందిన వారినే పోలీసులు అనుమతించనున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలే ప్రధాన ఎజెండాగా సమీక్ష నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. హాలియా వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రగతి సమీక్ష నిర్వహించనుండగా ప్రత్యేక శామీయానాలతో ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా దృష్టిసారించారు.
సమీక్షకు జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు నియోజకవర్గంలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ రంగాల్లోని ప్రముఖులకు సుమారు 2 వేల మందికి పాసులు జారీ చేశారు. వీరంతా సిఎం రాకకు అరగంట ముందే సభా స్థలానికి చేరుకోవాలని సూచించారు. సిఎం ఎంఎల్‌ఎ భగత్ నివాసం సమీపంలోని హెలిఫ్యాడ్ నుంచి రోడ్డు మార్గం ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించనున్న మార్కెట్ యార్డుకు చేరనున్న దృష్టా హాలియా ప్రధాన రహదారిపై మధ్యలో బారీకెట్లు ఏర్పాటు చేశారు. ఒక వైపు సిఎంకు ఘనస్వాగతం పలకడానికి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలను తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు సిఎం కాన్వాయిని అడ్డుకోకుండా పటిష్టబందోబస్తు, బారీకెట్లు ఏర్పాటు చేశారు. సిఎం సమీక్షా సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, డిఐజి ఏవీ రంగనాధ్, ఎంపి బడుగుల లింగయ్యయాదవ్, ఎంఎల్‌ఎ నోముల భగత్ తెలిపారు.
భారీ పోలీస్ బందోబస్తు
సిఎం కెసిఆర్ హాలియాలో సోమవారం నిర్వహించనున్న ప్రగతి సమీక్షా సమావేశానికి 2100 మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించడానికి హాలియాకు చేరుకున్నారు. వీరిలో 2 ఐపిఎస్‌లు, 2 నాన్ క్యాడర్ ఎస్‌పిలు, 8 మంది ఎడిషనల్ ఎస్‌పిలు, 12 మంది డిఎస్‌పిలు, 52 మంది సిఐలు, 170 మంది ఎస్‌ఐలు, 1850 మంది కానిస్టేబుళ్లు, హోంగార్డ్‌తో బందోబస్తు నిర్వహించనున్నట్లు మిర్యాలగూడ డిఎస్‌పి వెంకటేశ్వర్‌రావు, సిఐ వీరరాఘవులు తెలిపారు.