Wednesday, January 22, 2025

దుష్టశక్తులు అడ్డుపడుతున్నా ముందుకే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రగతి భవన్‌లోని ‘జనహిత’లో ‘శ్రీ శుభకృత్’ నామ సంవత్సర ఉగాది వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ, సాంస్కృతిక శాఖల సంయుక్తాధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఉదయం 10.30 గంటలకు పండితుల వేదమంత్రోచ్ఛారణలతో వేడుక ప్రారంభమైంది. ఈ సందర్భంగా పండితులు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వేద మంత్రాలతో ఆశీర్వచనాలిచ్చారు. అనంతరం శృంగేరి పీఠం వేద పండితులు బాచంపల్లి సంపత్ కుమార్ సిద్ధాంతి పంచాంగాన్ని పఠించారు. పంచాంగ శ్రవణం అనంతరం సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, ‘శుభకృత్’ నామ సంవత్సరంలో అందరికీ శుభం కలగాలని దేవున్ని ప్రార్ధిస్తున్నానన్నారు. ఎన్నో అపోహలు, అనుమానాల మధ్య పోరాటంతో తెలంగాణ సాధించినమన్నారు. తెలంగాణ జాతి అంతా ఒక్కటేనని, ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలన్నారు. కరెంటు బాధ, మంచినీళ్ల సమస్య.. ఇలా అనేక సమస్యలను అధిగమిస్తూ వచ్చామన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను తెలంగాణ సాధించిందన్నారు. ప్రజల దీవెన, అధికారుల పనితీరుతోనే ఇదంతా సాధ్యమైందన్నారు. ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ, గత 23 జిల్లాల సమైక్య రాష్ట్రాన్ని ఎప్పుడో అధిగమించిందన్నారు. రిజర్వ్ బ్యాంకు లెక్కల్లోనూ అనేక రాష్ట్రాలను అధిగమించి ప్రగతిపథంలో రాష్ట్రం పరుగెడుతున్నదని సిఎం అన్నారు.
విద్యుత్, విద్య, తలసరి ఆదాయం..ఇలా అనేక విషయాల్లో అద్భుతంగా పురోగతిలో ఉన్నామన్నారు. కొన్ని దుష్ట శక్తులు వ్యతిరేకించినా అభివృద్ధిలో ముందుకు పోతున్నామన్నారు. కుల మతాలకు అతీతంగా ముందుకెళ్లాలన్నారు. అనతికాలంలోనే తెలంగాణలో అద్భుతమైన సంపద సృష్టించబడిందని సిఎం తెలిపారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధితోనే భూముల ధరలు బాగా పెరిగాయని అన్నారు. ప్రస్తుత ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ‘ప్రాణహిత’ ద్వారా నాటి ఉమ్మడి రాష్ట్రంలోని సమస్యలను వ్యాసాలుగా రాసిన సందర్భాన్ని ఈ సందర్భంగా సిఎం గుర్తు చేశారు. నేడు స్వరాష్ట్రంలో నాటి సమస్యలన్నీ పరిష్కరించబడినాయని సిఎం అన్నారు.

మేధోమథనం చేసిన ఆవిష్కరించిన పథకమే దళితబందు
అనేక నెలల పాటు మేధోమథనం చేసి ఆవిష్కరించిన పథకమే ‘దళిత బంధు’ అని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల కోసమో, ఇంకేదాని కోసమో దళితబంధును తేలేదన్నారు. మన దళిత రత్నాలు ప్రపంచానికి తమ సత్తా చాటబోతున్నారని సిఎం స్పష్టం చేశారు. దళిత బంధుతో ఈ దేశానికి తెలంగాణ కొత్త మార్గదర్శనం చేయబోతోందన్నారు. రాష్ట్రంలో రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకున్నామన్నారు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేసుకున్నామన్నారు. మన వనరులు, మన ఉద్యోగాలు మనకే వచ్చాయన్నారు. దేశానికి అన్నం పెట్టే విధంగా తెలంగాణ పురోగమించాలని, సామూహిక స్వప్నమైన ‘బంగారు తెలంగాణ’ నిజం కావాలని మనసా వాచా కర్మణా కోరుకుందామని సిఎం ఆకాంక్షించారు.

ధర్మబద్దంగా పాలిస్తేనే…సమాజం సుభిక్షంగా ఉంటుంది
పరిపాలకుడు న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా పాలించినట్లైతే సమాజం సుభిక్షంగా ఉంటుందని సిఎం కెసిఆర్ అన్నారు. అన్ని వర్గాల ప్రజలూ ఆనందంగా ఉండేలా చేస్తున్నామన్నారు. వారి వారి మంచి చెడ్డల్ని సంస్కరించి సత్కరించే గొప్ప గుణం తెలంగాణకు ఉన్నదన్నారు. అన్నింటినీ అధిగమించి ప్రగతిపథంలో పయనిస్తున్నామన్నారు. దీంతో రాష్ట్ర ఆదాయం ఏటా పెరుగుతూనే ఉందన్నారు. ప్రస్తుతం దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ మారబోతున్నదన్నారు. అన్నివర్గాలు బాగున్నప్పుడే సమాజం శాంతియుతంగా ఉంటుందన్నారు. అనేక పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నమని, అనేక రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉన్నామన్నారు, ఆధ్యాత్మిక రంగంలో మన తెలంగాణ దేనికి తీసిపోదని సిఎం కెసిఆర్ అన్నారు. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించుకున్నామన్నారు. ప్రజలందరికీ సుఖం, శాంతి, ఐశ్వర్యం కలగాలని ఈ సందర్భంగా సిఎం ఆకాంక్షించారు.

పంచాంగ పఠనం ముఖ్యాంశాలు
తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ మరింత అద్భుతంగా పరిపాలనను కొనసాగించబోతున్నారని, ఈ సంవత్సరం రాష్ట్రంలోఅనేక శుభ ఫలితాలు కలుగుబోతున్నాయని పంచాంగం చదివారు. ఈ ఏడాది పరిపాలన అద్భుతంగా ఉండబోతున్నది. గత సంవత్సరం కంటే ఈ ఏడాది సిఎం కెసిఆర్ జాతకం ఇంకా బాగుంటుంది. సిఎం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఈ సంవత్సరం అనేక సంస్కరణలు చూడబోతున్నారు. దేశమంతా కెసిఆర్‌చేసే నిర్ణయాలపై ఆసక్తిగా ఎదురుచూడబోతున్నది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా నీళ్లు, పచ్చని పంటలు. రాష్ట్రంలో వేసవిలోనూ సమృద్ధిగా నీళ్లు లభ్యమౌతున్నాయి. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు అద్భుతంగా పండబోతున్నాయి. రైతులందరు మరల రాజులు కాబోతున్నారు. ప్రభుత్వ సలహాలు, సూచనలతో రైతులు పంటలు వేస్తే రైతులు అధిక లాభాలతో ఇంటికి వెళతారు. కరోనా వంటి చీకటి రోజులు తొలగిపోయి మంచిరోజులొచ్చాయి. ప్రజారోగ్యం భేష్. ఆనందంగా ఊపిరిపీల్చుకుందాం. ఇది ఉద్యోగనామ సంవత్సరం. మహిళలకు అనేక అవకాశాలు వస్తాయి.. వాళ్లే శాసిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అద్బుతమైన అవకాశాలు రాబోతున్నాయి. మహిళా ఐఏఎస్ అధికారులకు అద్భుతంగా ఉంది. యావత్ భారతదేశం దృష్టి హైదరాబాద్ పైనే ఉంటుంది. ప్రపంచంలోనే ముఖ్యమైన నగరంగా ఉండబోతోంది. 75 శాతం మంచి ఫలితాలు ఉండబోతున్నాయి.. 25 శాతం కొంచం గడ్డు ఫలితాలు ఉండవచ్చు. మీడియాకు ఈ సంవత్సరం పుష్కలంగా వార్తలు లభిస్తాయి. వారు వార్తలకోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు… అంటూ చేసిన పంచాంగ పఠనం వేడుకల్లో పాల్గొన్నవారిలో ఉత్సాహాన్ని భవిష్యత్తు పట్ల ఆశాజనక భరోసాను నింపాయి. పంచాంగ పఠనం సందర్భంగా విసిరిన ఛలోక్తులు ప్రకటించిన అంశాలు సభికులను ఆకట్టుకున్నాయి. సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవిష్యత్తు అత్యద్భుతంగా ఉంటుందని పంచాంగ పఠనం లో పండితులు వివరించారు. ఈ సందర్బంగా ఆహ్వానితులు కరతాళ ధ్వనులతో జై తెలంగాణ జై కెసిఆర్ నినాదాలతో తమ హర్షద్వానాలను ప్రకటించారు.
అనంతరం సిఎం కెసిఆర్‌ను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సహా వేద పండితులు శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. దేవాదాయ శాఖ మంత్రి వేదికపై ఆసీనులైన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా భధ్రాచలం సీతారాముల కళ్యాణానికి ఆలయ అర్చకులు దేవదాయ శాఖ మంత్రి సిఎం కెసిఆర్‌కు ఆహ్వానాన్ని అందచేశారు. సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ సంపాదకీయంలో సిఎం ఒఎస్‌డి శ్రీధర్ రావు దేశ్ పాండే ప్రచురించిన సాగునీటి రంగం పై సిఎం కెసిర్ అసెంబ్లీ లో చేసిన ప్రసంగాల సంకలనం “మా తెలంగాణం.. కోటి ఎకరాల మాగాణం” అనే పుస్తకాన్ని సిఎం ఆవిష్కరించారు. సంపత్ కుమార్ సిద్ధాంతి విరచిత పంచాంగాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

ఆకట్టుకున్న అలంకరణలు
ప్రభుత్వ సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో ఉగాది వేడుకల సందర్భంగా చేసిన ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. వేదికపై ఏర్పాటు చేసిన మామిడి చెట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మామిడి చెట్టుకిందనే పంచాంగ పఠనం జరిగింది. మామిడాకుల తోరణాలు ఒకవైపు, బంతిపూలు అరటి ఆకుల అలంకరణలు మరోవైపు జనహిత పరిసరాల్లో వసంతాన్ని నింపింది. ప్రగతి భవన్‌కు ప్రకృతి రమణీయతను అద్దింది. వేడుకల సందర్భంగా చేసిన ఏర్పాట్లతో సాంప్రదాయ పండుగ వాతావరణం సంతరించుకున్నది. ఉగాది పచ్చడి, భక్షాలతో సహా పలురకాల రుచికరమైన ప్రత్యేక వంటకాలను అందించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన గిరిజన ఆదీవాసీ జానపద కళాకారులు గుస్సాడీ, లంబాడీ, కొమ్ముకోయ, డప్పులు,ఒగ్గుడోలు బోనాల కోలాటం వంటి తెలంగాణ సాంస్కృతిక కళారూపాలను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో శానన మండలి చైర్మైన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శానన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, జి. జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, చామకూర మల్లారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పి.రాములు, మాలోత్ కవిత, ఎంఎల్‌సిలు పల్లా రాజేశ్వర రెడ్డి, ఎం.ఎస్. ప్రభాకర్ రావు, శాసనసభ్యులు దానం నాగేందర్, బాజిరెడ్డి గోవర్ధన్, రసమయి బాలకిషన్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, జీవన్ రెడ్డి, గ్యాదరి కిశోర్, చంటి క్రాంతి కిరణ్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్, జాజుల సురెందర్, కోనేరు కోనప్ప, మెతుకు ఆనంద్, బిగాల గణేష్ గుప్త, చల్లా ధర్మారెడ్డి, గండ్ర రమణా రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, కాలే యాదయ్య, పైలెట్ రోహిత్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గువ్వల బాలరాజు, బేతి సుభాష్ రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, మాగంటి గోపినాధ్, డా.సంజయ్ కుమార్, నన్నపునేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
వీరితో పాటు సిఎంఒ అధికారులు నర్సింగ రావు, భూపాల్ రెడ్డి, స్మితాసభర్వాల్, ప్రియాంకా వర్గీస్, రాహుల్ బొజ్జా, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, మీడియా అకాడెమీ చైర్మన్ అల్లం నారాయణ, సిఎస్ సోమేష్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు రమణాచారి, సాంస్కృతిక శాఖ డైరక్టర్ మామిడి హరికృష్ణ, సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి, సిఎం ఒఎస్‌డి దేశపతి శ్రీనివాస్, హైదరాబాద్ సిపిసి.వి.ఆనంద్ పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ వి.ప్రకాష్, మహిళా కమిషన్ చైర్మన్ సునితా లక్ష్మారెడ్డి, రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, ఎస్‌సి కార్పోరేషన్ చైర్మెన్ బండ శ్రీనివాస్, రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మైన్ డాక్టర్ కె.వాసుదేవరెడ్డి, రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్టమోహన్, బిసి కమిషన్ సభ్యులు కె.కిశోర్ గౌడ్, శుభప్రద పటేల్, ఉపేంద్ర, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మెన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మైన్ కోలేటి దామోదర్ గుప్తా, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రాష్ట్ర విద్యా, సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డితదితరులు పాల్గొన్నారు.

CM KCR Ugadi Wishes to People

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News