ఒక గొప్ప సంకల్పానికి ఎదురయ్యే అడ్డంకులెన్నో, అడ్డంకుల ను అధిగమించి ఆ సంకల్పం సిద్ధించే వరకు విరామ మెరుగని సంకల్ప సాధకుడు, కృషీవలుడు కెసిఆర్. ‘అవహేళన చేసిన నోర్లే అభినందించేలా-, అడ్డుకోవాలనుకున్నవాళ్ళే అబ్బురపడే లా’ ఏప్రిల్ 14న చరిత్రాత్మక దృశ్యం ఆవిష్కృతం కాబోతుం ది. అణగారిన వర్గాల ఆర్థిక, సామాజిక సాధికారత కోసం తన తుది శ్వాస వరకు పోరాటం చేసిన, తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి మార్గం సుగమం చేసిన భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డా. బి.ఆర్.అంబేడ్కర్ జయంతి సందర్భంగా భావితరాలకు దిశానిర్దేశం చేసేలా, ఆ మహనీయుని ఆశయాలు అనునిత్యం స్ఫురించేలా అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున నూతన సచివాలయానికి అత్యంత సమీపాన ఏర్పాటు చేయడం తెలంగాణ చరిత్రలో సువర్ణాక్ష రాలతో లిఖించదగిన సంద ర్భం.
ఒక చూపుడు వేలు ఈ దేశ భవిష్యత్‌ను నిర్దేశించింది, అంబేడ్కర్ చూపిన మార్గం అను సరణీయం. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్రాలలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలకు ఆయు వు పోసింది ఆయన ఆలోచనలే అంటే ఏ మాత్రం సందేహం లేదు. ప్రస్తుతం దళిత సాధికారత కోసం అత్యంత ప్రతిష్ఠా త్మకంగా అమలు చేస్తున్నా దళిత బంధు పథకానికి స్ఫూర్తి ఆ మహనీయుని ఆశయాలే. భావిభారత స్ఫూర్తి ప్రదాత అంబేడ్కర్ ఆశయాల సాధనకు, ఆలోచన విధానానికి అనుగుణంగా దేశంలో పరిపాలన అందిస్తున్నా ఏకైక రాష్ట్రం కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రం అనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయ్యేలా బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ వాటి అమలు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కెసిఆర్ దార్శనికతను విమర్శకులు సైతం అభినందించాల్సిందే.
అంబేడ్కర్ అంటే అన్ని రాజకీయ పక్షాలకు ఎన్నిక వేళ అవసరమయ్యే నినాదం.కానీ ఆయన అందరివాడని, ఆయన మన భవిష్యత్తు అని గుర్తెరిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. వాస్తవానికి అంబేడ్కర్ ఆలోచన రూపానికి ప్రతిరూపంగా తెలంగాణలో దళిత, బహుజనుల అభివృద్ధి జరుగుతోంది.ఈ సందర్భంగా ఆయన జీవితంలోని అనేక ఘట్టాలను స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాజ్యాంగా నిపుణుడు, న్యాయ కోవిదుడైన అంబేడ్కర్ గురించి జోకిం అల్వా తన గ్రంథమైన ‘మెన్ అండ్ సూపర్ మెన్’లో ఈ విధంగా వర్ణిస్తారు ‘అంబేడ్కర్ పండితుడు, నిండైన విగ్రహంతో అందుకు తగిన నిశితమైన బుద్ధితో ఆయన ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ చోటైనా చొచ్చుకుపోగలరు. దళితుల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని ధారబోసిన ధీరుడాయన, వర్ణ, వర్గ వివక్ష, పరపీడన నిర్మూలనకై అవిరళ పోరాటం సాగించిన యోధుడు.
అమెరికాలో నల్లవారి కోసం విద్యాలయాలను ఏర్పాటు చేసి, వారి ప్రగతికి పాటుపడిన నల్లజాతి వజ్రం బుకర్ టి. వాషింగ్టన్ జీవితం అంబేడ్కర్‌కు ఎంతో ప్రేరణ కలిగించింది. పాఠశాలలో ప్రవేశం కోసం తెల్లవారి చర్చి కుర్చీలను తుడిచిన ఆయన స్ఫూర్తి అంబేడ్కర్ ను విపరీతంగా ఆకట్టుకుంది, ఆయన లాగే తాను కూడా తన ప్రజల ఉద్ధరణకు పాటు పడాలని నిర్ణయించుకున్నారు. చిన్నతనం నుంచే వివక్షను చవిచూసిన అంబేడ్కర్‌కు అగ్రవర్ణ విద్యార్థుల అవహేళనలు నిత్యకృత్యమే, తరగతి బయట మాత్రమే కూర్చోని పాఠాలు వినవలసి వచ్చేది, కులదూషణ అనుక్షణం వెంటాడుతుండేది. వేటికీ వెరవని అంబేడ్కర్ బరోడా రాజు స్కాలర్ షిప్‌తో విదేశీ విద్యను విజయవంతం గా పూర్తి చేశారు. ఉన్నత విద్యానంతరం స్వదేశానికి వచ్చిన ఆయనకు బరోడా రాష్ట్ర ప్రభుత్వంలో రక్షణ శాఖ కార్యదర్శి గా ఉద్యోగం వచ్చింది.
అమెరికలోని ప్రఖ్యాత కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్‌డి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డిఎస్‌సి సంపాదించుకున్న ఆయనను బరోడాలో తన కింది స్థాయి ఉద్యోగులు చేసిన అవమానాల గాయాలు తీవ్రంగా బాధించాయి. బరోడాలో బంట్రోతులు సైతం అంబేద్కర్‌ను అంటరానివాడిగానే చూశారు గాని, తమ పై అధికారి అని గౌరవించలేదు. కింది స్థాయి ఉద్యోగులమనే భయం లేకుండా ఫైళ్ళను ఆయన టేబుల్‌పై దూరం నుంచి విసిరికొట్టేవారు. తనపట్ల చూపుతున్న ఈ వివక్షే తన పోరా టానికి స్ఫూర్తిని రగిలించింది. ఒక సందర్భంలో ఆయన బస చేసిన సత్రం యజమాని అంటరానివాడని సత్రం నుంచి ఆయన సామానులను బయటపడ వేయించాడు. అంబేడ్కర్ కు విదేశీ విద్యకు సహాయమందించిన బరోడా మహారాజు సైతం ఆయన ఆత్మగౌరవాన్ని కాపాడటంలో తన నిస్సహా యతను వెలిబుచ్చడం ఆయనను తీవ్రంగా కలిచివేసింది. ఒక చదువుకున్న ఉన్నత్యోద్యోగికే ఇన్ని అవమానాలు ఎదురైతే దేశంలో ఉన్న కోట్లాది నిమ్న వర్గ ప్రజల పరిస్థితేంటనే ఆలోచన ఆయన మనసును తొలచివేసింది.
అణగారిన వర్గాల విమోచనకు, విముక్తికి తాను కదన రంగంలోకి దూకవలసిన అవసరాన్ని ఆయన గుర్తించారు. తరతరాల బానిసత్వానికి, వివక్షకు గురవుతున్న కోట్లాది అంటరాని కులస్థుల తరపున పోరాడవలసిన తన కర్తవ్యాన్ని మననం చేసుకున్నారు. డా. అంబేడ్కర్ తన విమోచన ఉద్యమాన్ని మూక్ నాయక్ (మూగ నాయకుడు) అనే మరా ఠా పక్ష పత్రికతో ప్రారంభించారు, అణగారిన వర్గాల హక్కులను వారికి తెలియపరిచారు. వయోజన ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తెరిగిన మొట్టమొదటి భారతీయుడు బహు శా అంబేడ్కరే కావచ్చు. వయోజన ఓటు హక్కు, షెడ్యూల్డ్ కులాల ప్రాతినిధ్యం కోసం ‘సౌత్ బరో కమిటీ’కి ఆయన చేసిన నివేదన అభినందనీయం. ‘బహిష్కృత్ భారత్’ స్థాపన షెడ్యూల్డ్ కులాలలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ప్రజల ను ఉద్యోన్ముఖులను చేయడంలో ఆయన చూపిన మార్గం ప్రశంసనీయం. తాగు నీటి కోసం సత్యాగ్రహం చేసిన ప్రపం చంలోనే మొట్టమొదటి, ఏకైక సత్యాగ్రహి బాబా సాహెబ్.
కొలాబా జిల్లాలోని మహద్ గ్రామంలోని చౌదర్ చెరువులో నీరు తీసుకోవడం కోసం అంటరాని వారితో కలిసి సత్యా గ్రహం (1927) చేశారు. అదే సమయంలో దేశ వ్యాప్తంగా కొందరు అగ్రకుల నాయకులు పాలు పంచుకున్న ఆలయ ప్రవేశ ఉద్యమం కేవలం మొక్కుబడి ఉద్యమమేనని గ్రహించి న అంబేడ్కర్ వేలాది తన అనుచరగణంతో నాసిక్‌లోని ‘కాలారాం ఆలయం’లోనికి ప్రవేశించడం (1935) ఒక సంచలనం. గాంధీజీ చేసిన ఉప్పు సత్యాగ్రహం కన్నా ముందే అంబేడ్కర్ ఈ ఉద్యమాలు సత్యాగ్రహ స్ఫూర్తితో జరగడం గమనార్హం. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఒక రకం గా గాంధీజీకే దారి చూపిన ఈ ఉద్యమాలు చరిత్రకారులకు కనిపించకపోవడం ఒక్క ధనుంజయ్ కీర్ తప్ప మరే చరిత్రకా రుడు ఈ ఉద్యమాలకు ప్రాధాన్యత కల్పించకపోవడం శోచనీయం.నిమ్న తరగతుల సమస్యలను విన్నవించేందుకు ఇంగ్లండ్ వెళ్ళిన అంబేడ్కర్‌కు రాజ్యాంగ సభలో పాలు పంచుకో వాల్సిందిగా ప్రతిపాదన వచ్చింది.
ముందు ముసాయిదా కమిటీ సభ్యుడిగా, ఆ తరువాత చైర్మన్‌గా నియమించబడ్డా రు. ‘రాజ్యాంగ ముసాయిదా సంఘం చైర్మన్‌గా నియమిం చేటప్పుడు, ఆ నియామకం సరైందా కాదా అని తర్కించుకునే అవసరం లేదు. తనకు అప్పగించిన పనిని అంబేడ్కర్ సమర్థ వంతంగా నిర్వర్తించి ఆ పదవికి మరింత వన్నె తెచ్చారని’ రాజ్యాంగ సభాధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్ కొనియాడా రు. వాస్తవానికి రాజ్యాంగ రచనలో అంబేడ్కర్ అందెవేసిన చేయి. 1932లో రాజ్యాంగబద్ధ సంస్కరణలు తీసుకొచ్చేందు కు నియమించబడిన సంయుక్త సంఘంలో సభ్యులు. ఆ సమయంలోనే వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేశారు. సంయుక్త సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగానే బ్రిటీష్ పార్లమెంట్ 1935 భారత ప్రభుత్వ చట్టం తీసుకొచ్చిం ది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల రూపకల్పనకు కారకులు అంబేడ్కర్.బలమైన కేంద్రాన్ని కోరుకున్న అంబే డ్కర్ భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిం చారు.
‘ఒకే దేశంలో అనేక దేశాల ఆవిర్భవానికి భాషా ప్రయుక్త రాష్ట్రాలు దారి తీస్తాయని’ థార్ కమిటీకి ఇచ్చిన నివేదికలో హెచ్చరించారు. దేశంలో అనేక సామాజిక రుగ్మతలకు మహిళల వెనుకబాటుతనమే కారణమని నమ్మిన అంబేడ్కర్ రాజ్యాంగం లో వారికి సమున్నత స్థానాన్ని కలిపిం చారు. వివాహం, విడాకులు వంటి వ్యక్తిగత విషయాలలో మహిళలకి స్వయం నిర్ణయాధికారం ఇవ్వాలన్నారు, వారి సంపాదనపై వారికే సర్వహక్కులు ఉండాలన్నారు. అంబేడ్కర్ ఆలోచన విధానం విశ్వజనీనం, ఆయన అందరి వాడు కేవలం ఒకవర్గానికే ఆయన నాయకత్వాన్ని ఆపాదించి అవమానించడం క్షమించరాని నేరం, వివక్షను ఎదుర్కొనే ప్రతి చోటా అంబేడ్కర్ ఆశయం సాక్షాత్కారం అవుతుంది. ఆయన నిఖార్సయిన జాతీయ నాయకుడు. వేదన, పీడన, దోపిడీ, నిరాదరణకు గురైన వారికేకాక సమ సమాజాన్ని నిర్మిద్దామన్న ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చేది అంబేడ్కర్ జీవితం. ఆయనను విస్మరించడం అంటే దేశ భవిష్యత్తును విస్మరించడ మే.
మహనీయుల ఆశయాలు సాధిస్తాం అనేది ఒక నినాదం గానే మిగలకుండా ఆచరణలో చేసి చూపిస్తున్న కార్యసాధకు డు కెసిఆర్. తెలంగాణ ప్రభుత్వం అంబేడ్కర్ ఆశయాల సాధనకు కృషి చేయడంలో ముందు వరుసలో ఉంది. హుసేన్ సాగర్ నడుమ నిలబడి ఉన్న బోధిసత్వుని ఎదురుగా ఆయన మార్గాన్ని అనుసరించి, ధమ్మాన్ని బోధించిన సమతామూర్తి సబ్బండ వర్గాల సమైక్యతా ప్రతీకగా అంబేడ్కర్ మహనీయుని 125 అడుగుల విగ్రహ రూపం మన రాష్ట్రానికి కూడా బంగారు భవిష్యత్తును చూపుతుందని ఆకాంక్షిద్దాం. భారత దేశం ఉన్నంత వరకు మహనీయుడు అంబేడ్కర్ పేరు అంతర్లీనంగా ధ్వనిస్తూనే ఉంటుంది. స్త్రీ విముక్తి ప్రదాతగా, తత్వబోధకుడిగా, సామాజిక విప్లవ మార్గాన్ని చూపిన అంబే డ్కర్ ఆశయాలను నెరవేర్చడమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి….