రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే సంగారెడ్డి టూ హయత్‌నగర్ వరకు మెట్రోకు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరావు వెల్లడించారు. గురువారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన సిఎం కెసిఆర్ పటాన్ చెరులో రూ.183 కోట్లతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం మాట్లాడారు. ఇటీవల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గానికి వెళితే.. మహేశ్వరానికి మెట్రో రావాలని కోరారని, అక్కడే ఆ సభలోనే తాను చెప్పానని అన్నారు. హైదరాబాద్ సిటీలో అత్యధికంగా ట్రాఫిక్ ఉండే కారిడర్ పటాన్‌చెరు నుంచి దిల్‌సుఖ్‌నగర్ అని, పటాన్‌చెరు నుంచి హయత్‌నగర్ వరకు మెట్రోరావాల్సి ఉందని తెలిపారు. మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే మెట్రో తప్పకుండా వస్తుందని చెప్పారు.
మళ్లీ వచ్చే ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలో పటాన్ చెరు నుంచి హయత్‌నగర్ మెట్రోరైలుకు మంజూరు ఇప్పిస్తానని తాను వ్యక్తిగతంగా వాగ్ధానం చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కాకముందు ఈ జిల్లాల్లో మంత్రిగా పని చేస్తూ పటాన్‌చెరుకు వచ్చానని, ఇక్కడే సంగారెడ్డి అతిథిగృహంలో ఉంటూ పటాన్‌చెరులో గల్లీగల్లీ పాదయాత్ర చేశానని తెలిపారు. ఇంచుమించు అన్ని సమస్యలు తెలుసు అని పేర్కొన్నారు. మహిపాల్‌రెడ్డి నాయకత్వంలో పటాన్‌చెరు ముందుకుదూసుకెళ్తున్నదన్నారు. మాజీ ఎంఎల్‌ఎ సత్యనారాయణ ఇక్కడి వరకు మెట్రోరైలు రావాలని కోరారని అన్నారు.
రాష్ట్రం ఏర్పడే క్రమంలో అనేక అపవాదులు, అపోహలు, అనుమానాలు కలిగించారని గుర్తు చేశారు. తెలంగాణ చిమ్మని చీకటవుతుంది.. కరెంటు రానే రాదన్నారని మండిపడ్డారు. పటాన్‌చెరులో అప్పుడు పరిశ్రమల వాళ్లు కరెంటు కావాలని సమ్మెలు చేసేవారని, ఇవాళ మూడుషిఫ్టుల్లో పరిశ్రమలు నడుస్తున్నాయని చెప్పారు. భారతదేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో పరిశ్రమలకు 24 గంటల కరెంటు ఇస్తున్నామని తెలిపారు. కష్టాలు, నష్టాలకోర్చి పరిశ్రమలు, డొమెస్టిక్, గృహాలకు, కమర్షియల్, వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ఇంటింటికీ నల్లాపెట్టి నీళ్లిచ్చే రాష్ట్రం తెలంగాణ అని, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ తెలంగాణ అని అన్నారు. ఎందుకు కొరగాకుండాపోతారని ఎవరైతే శాపాలు పెట్టారో వారిని మించిపోయి.. 3.17 లక్షలతో పర్ క్యాపిటా ఇన్‌కంలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నామని తెలిపారు.
Also Read: సంగారెడ్డి జిల్లాపై సిఎం కెసిఆర్ వరాల జల్లు..