కరీంనగర్ : బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం తన సెంటిమెంట్ నియోజకవర్గమైన హుస్నాబాద్ లో ఎన్నికల సమరభేరి మోగించారు. కలిసొచ్చిన ఉద్యమాల గడ్డ హుస్నాబాద్ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఆయన మంగళవారం సిరిసిల్ల పట్టణంలో జరగనున్న సాధారణ ప్రజా ఆశీర్వాద సభలోపాల్గొనున్నారు. జిల్లా కేంద్రంలోని మొదటి బైపాస్ రోడ్డులో కే కన్వెన్షన్ ఎదురుగా 25 ఎకరాల స్థలంలో ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించనుండగా, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ సోమవారం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి సిరిసిల్ల పట్టణంలోని సభాస్థలి వద్ద ఏర్పాట్లను పరిశీలించి పార్టీ నేతలకు మంత్రి కెటిఆర్ పలు సూచనలు సలహాలు చేశారు.
సిఎం కెసిఆర్ నేడు సిరిసిల్ల ప్రజలకు, నేతన్నలకు వరాలు కురిపించేందుకు రానున్నారు. సభ కు ప్రజలు స్వచ్ఛం దంగా హాజరు కానున్నారు. లక్ష మంది హాజరుకానున్న ఈ సభకు సిరిసిల్ల నియోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు భారీ ఏ ర్పాట్లు చేశారు. బిఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫేస్టో ప్రకటించిన తరువాత సిఎం కెసిఆర్ సిరిసిల్లలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభ రాష్ట్రంలో మూడో వది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంగళవారం తలపెట్టిన సిఎం కెసిఆర్ సభ రెండవది కానుంది. మంత్రి కెటిఆర్ ఆదివారం సిఎం కెసిఆర్ చేతుల మీదుగా భీ ఫామ్ తీసుకోగా ఐదోవసారి సిరిసిల్ల అసెంబ్లీ నియోజవర్గ బరిలో నిలువనున్నారు. సిఎం కెసిఆర్ సిరిసిల్ల పర్యటనతో నియోజవర్గ పార్టీశ్రేణుల్లో జోష్ నింపనున్నారు.