Friday, December 27, 2024

దేశ వ్యాప్తంగా గొర్రెల పంపిణీ పథకం: శ్రీనివాస్‌గౌడ్

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ :తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశ ప్రజలందరికి అందించాలని ముఖ్యమంత్రి కేసిఆర్ కృత నిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణలో కురుమ, యాదవుల సంక్షేమ కోసం ప్రవేశపెట్టిన ఉచిత గొర్రెల పంపిణీ పథకాన్ని దేశమంతా అమలు చేసేందుకు సిఎం కెసిఆర్ ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన రెండో విడత ఉచిత గొర్రెల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మహబూబ్‌నగర్ రూరల్ మండల పరిధిలోని జైనల్లీపూర్, కోడూర్ , మాచన్‌పల్లి గ్రామాలకు చెందిన లబ్దిదారులకు 18 యూనిట్ల గొర్రెలను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా లబ్దిదారులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కులవృత్తులను ఆదుకున్నది సిఎం కెసిఆర్ మాత్రమేనని మంత్రి తెలిపారు.

అన్ని కుల వృత్తులను ప్రోత్సహించి వృత్తి దారుల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. ఒకప్పుడు ఆదివారం వచ్చిందంటే చాలు వందల సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెలను తీసుకొచ్చి స్థానికంగా విక్రయించే వారని, అయితే ఉచిత గొర్రెల పంపిణీ పథకం ప్రవేశపెట్టిన తర్వాత స్థానికంగానే గొర్రెల సంపద భారీగా పెరిగిందని వెల్లడించారు. కురుమ, యాదవుల జీవితాల్లో కెసిఆర్ గొప్ప మార్పును తీసుకువచ్చారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల ఏర్పాటు ద్వారా బడుగు బలహీన వర్గాలకే కాకుండా అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా కేజీ టూ పీజీ విద్య ఉచితంగా అందించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి ఉచిత 24 గంటల విద్యుత్ తదితర పథకాలతో సిఎం కెసిఆర్ అన్నదాతకు అండగా నిలిచాడన్నారు.

తెలంగాణ ప్రభుత్వం నుంచి లబ్దిపొందుతున్న వారంతా ఈ ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించాలని, గతానికి నేటికి తేడాను గమనించాలని కోరారు. సంక్షేమ పథకాలు అంది ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటే ఓర్వలేని కొందరు ప్రతిపక్ష నేతలు ఈ పథకాలను ఎలాగైనా పొగొట్టాలని కుట్రతో విద్వేషాలు రాజేస్తున్నారని మంత్రి విమర్శించారు. ఇలాంటి అభివృద్ది విఘాతకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మూడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసి నర్సిములు, సింగిల్‌విండో చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, ముడా డైరెక్టర్ అంజనేయులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, జీజీహెచ్ సలహ మండలి సభ్యుడు సత్యంయాదవ్, పశుసంవర్ధక శాఖ ఏడి వెంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News