Friday, November 22, 2024

గీత దాటితే వేటు

- Advertisement -
- Advertisement -

మునుగోడు టిఆర్‌ఎస్ నేతలకు
ముఖ్యమంత్రి కెసిఆర్ హెచ్చరిక

అభ్యర్థి ఎవరైనా పార్టీ విజయానికి కృషి చేయాలి

మన తెలంగాణ/హైదరాబాద్: ‘ఈసారి మునుగోడు నియోజకవర్గంపై గులాబీ జెండా రెపరెపలాడాలి.. ఎవరైనా కారు దూసుకపోవాలి.. భారీ మెజార్టీతో ఘన విజయం సాధించా లి.. ఇదే మీ లక్షం కావాలి’ అని ఉమ్మడి నల్లగొండ నియోజకవర్గం నేతలకు టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హితబోధ చేశారు. అభ్యర్థ్ధి ఎవరన్నది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నా రు. ఈ విషయంలో ఎవరి ఇష్టానుసారంగా వారు మాట్లాడవద్దన్నారు. పార్టీ క్రమశిక్షణను దాటవద్దన్నారు. ఇందులో ఎవరూ పార్టీ గీత దాటి వ్యవహరించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అవసరమైతే వేటువేయడానికి కూడా తాను వెనుకాడబోనన్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్ధి విషయాన్ని పక్కనపెట్టి మునుగోడులో త్వరలో తలపెట్టిన భారీ బహిరంగ సభ విజయవంతం చేసే అంశంపై దృష్టి సారించాలన్నారు. ఉండగా మునుగోడు నియోజకవర్గం పార్టీ అభ్యర్ధి విషయంలో కొందరు నాయకులు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.

పలానా అభ్యర్ధికే టికెట్ కేటాయించాలంటూ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ ఘటనలపై కెసిఆర్ గుర్రుగా ఉన్నారు. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అలాంటి నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్దమే అన్న సంకేతాలను కూడా పంపారు. ఈ నేపథ్యంలో కెసిఆర్ స్వయంగా రంగంలోకి దిగి మునుగోడు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గం నేతల్లో నెలకొన్న విబేధాలను చక్కపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా శనివారం ప్రగతిభవన్‌లో జిల్లాకు చెందిన కంచర్ల కృష్ణారెడ్డితో పాటు మరి కొందరి నాయకులతో కెసిఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు.

ముగుగోడులో నియోజకవర్గంలో పార్టీ పరంగా అనేక సర్వేలు జరుగుతున్నాయన్నారు. ఆ సర్వేలతో పాటు తన అంచనాలను కూడా పోల్చుకుని అభ్యర్ధిని ఖరారు చేస్తామన్నారు. అందువల్ల ఈ విషయంలో నేతలు ఎవరూ విడివిడిగా సమావేశాలు ఏర్పాటు చేయవద్దని సూచించారు. అభ్యర్ధిగా ఎవరిని ఖరారు చేసినా గెలిపించాల్సిన బాధ్యత మీ భుజస్కందాలపై ఉందని ఈ సందర్భంగా కెసిఆర్ సూచించినట్లుగా సమాచారం. పార్టీ ప్రతిష్టను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలే తప్ప…. అభ్యర్దిని చూడొద్దన్నారు. అందువల్ల నేతలంతా కలిసి కట్టుగా ప్రచారంలోకి దిగాలని సూచించారు. ప్రతి ఇంటిని తట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరోసారి వివరించాలన్నారు. టిఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిపై విసృతంగా ప్రచారం చేయాలని సూచించారు. మునుగోడు నియోజకవర్గాన్ని భారీ మెజార్టీతో టిఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందన్న విశ్వాసం తనకుందన్నారు. తన నమ్మకాన్ని నిలబెట్టే విధంగా నాయకులంతా పనిచేయాలని ఈ సందర్భంగా కెసిఆర్ సూచించారు.

ఈ నెల 20న భారీ బహిరంగ సభ
ఈ నెల20వ తేదీన పార్టీ జరప తలపెట్టిన మునుగోడు సభను విజయవంతం చేయాలని నాయకులకు కెసిఆర్ సూచించారు. ఆ సభలో అభ్యర్ధి ఎంపికపై తుది నిర్ణయం తీసుకుని వెల్లడిస్తానని అన్నారు. అవసరమైతే మరో రోజు ఉమ్మడి జిల్లా నేతల అభిప్రాయాలపై తానే స్వయంగా తెలుసుకుంటానని అన్నారు. అభ్యర్థి ఎవరైనా విజయం మాత్రం మనదే కావాలని అభిలాషించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News