Friday, November 15, 2024

మంజీరలోకి గోదాఝరి

- Advertisement -
- Advertisement -

హల్దీ కాలువకు కొండపోచమ్మ నీటిని విడుదల చేసిన సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్/గజ్వేల్: కాళేశ్వరం నీటితో నిండిన కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలు వర్గల్ మండలం అవుసలపల్లి గ్రామం వద్ద హల్దీ కాలువలోకి విడుదలైన మరో చరిత్రాత్మక ఘట్టం మంగళవారం ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా ఆవిష్కృతమైంది. దీనితో గోదావరి జలాలు మంజీరా నదిలోకి పరుగులు పెట్టాయి. ఈ ప్రక్రియతో తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా అభివృద్ధి చేయాలనే తలంపుతో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసిన సిఎం కెసిఆర్ కార్యాచరణ కీలకమైన మైలురాయిని దాటింది. హల్దీ కాల్వలోకి 1600 క్యూసెక్కుల నీటిని విడుడల చేయగా.. 8 నుంచి 10 రోజుల్లో ఈ వాగు నుండి మంజీర నదికి నీరు చేరుకుంటుంది.అక్కడి నుంచి నిజాం సాగర్‌లోకి గోదావరి జలాలు చేరనున్నాయి. ఇప్పటికే మేడిగడ్డ నుండి మిడ్ మానేరుకు చేరిన కాళేశ్వరం జలాలు..అక్కడినుంచి కొండపోచమ్మ సాగర్‌కు చేరుకున్నవి. కొండపోచమ్మ సాగర్ జలాలను మొదట హల్దీ వాగులోకి వదిలి, మంజీరా నది ద్వారా నిజాం సాగర్ కు తరలించే కార్యక్రమానికి నేడు సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టారు. తదనంతరం కొండ పొచమ్మసాగర్ జలాలను గజ్వేల్ కెనాల్ నుంచి సిద్దిపేట జిల్లాలోని 20 చెరువులను నింపేందుకు వదిలారు.

దీంతో కాళేశ్వర ప్రాజెక్టు విస్తరణలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సిఎం కెసిఆర్ ప్రత్యేక బస్సులో, సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అవుసులపల్లికి చేరుకున్నారు. అనంతరం అక్కడ కాళేశ్వర జలాలకు ఆయన ప్రత్యేకంగా పూజలు చేశారు. తదనంతరం కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి జలాలను విడుదల చేశారు. ఈ జలాలు సంగారెడ్డి కెనాల్ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్‌కు చేరుకుంటాయి. ఆ తర్వాత మర్కూక్ మండలం పాములపర్తి గ్రామానికి చేరుకున్న సిఎం అక్కడ కూడా ప్రత్యేక పూజలు చేసి, కాళేశ్వర జలాలను గజ్వేల్ కాల్వలోకి విడుదల చేశారు. ఈ జలాలు పరిసర ప్రాంతాల్లోని పాముల పర్తి చెరువు, పాతురు చెరువు, చేబర్తి చెరువు, ప్రజ్ఞా పుర్, గజ్వేల్, కేసారం, బయ్యారం, జాలియామా తదితర 20 చెరువులను నింపుతాయి. కాగా, కాళేశ్వరం పథకంలో అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్నసాగర్ పనులు పూర్తికావడానికి మరో రెండు మూడు నెలలు పట్టే అవకా శం ఉండటంతో.. ప్రత్యామ్నాయంగా కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వ ద్వారా హల్దీవాగు.. తద్వారా నిజాంసాగర్‌కు నీరు తరలిస్తున్నారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌కు 5 ఒటి స్లూయిస్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఒకటి సింగూరు ప్రాజెక్టుకు వెళ్లే కాల్వ.. ఈ తూము వద్ద 4 గేట్లు ఉంటాయి. ఇక్కడి నుంచి సింగూరు ప్రాజెక్టుకు నీటిని పంపిస్తారు. ఈ కాల్వ కెపాసిటీ 6 వేల కూసెక్కులు ఉంటుంది. ఇదే కాల్వ నుంచి హల్దీవాగుకు నీటిని విడుదలచేస్తారు. ప్రస్తుతం నిజాంసాగర్ లో 7.2టిఎంసిల నీరు నిల్వ ఉండగా యాసంగి పంటలకు మరో తడి ఇవ్వడానికి 1.2టిఎంసిలు విడుదల చేయనున్నారు. హల్దీ వాగు ద్వారా మరో 4 టిఎంసిల నీటిని అందించనున్నారు. నిజాంసాగర్‌లో మొత్తం నీటి నిలువ 10 టిఎంసిలకు చేరనుంది.

వచ్చే వర్షకాలంలో వానలు సకాలంలో రాకపోయినా.. ఈ నీటితో పంటలు సాగు చేసుకునేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపిలు జోగినపల్లి సంతోష్ కుమార్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బిబి పాటిల్, ఎంఎల్‌సిలు శేరి సుభాష్ రెడ్డి, భూపాల్ రెడ్డి, గంగాధర్ గౌడ్, ఫరీదుద్దీన్, ఫరూక్ హుసేన్, రాజేశ్వర్ రావు, శాసనసభ్యులు పద్మా దేవేందర్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్, గణేష్ గుప్తా, హన్మంత్ షిండే, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, చిరుమర్తి లింగయ్య, సిహెచ్ మదన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు, సిఎం కార్యదర్శులు స్మితా సభర్వాల్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఇఎన్‌సి మురళీధర్ రావు, కాళేశ్వరం ఇఎన్‌సి హరిరామ్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వి.సునీతా లక్ష్మారెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, సంగారెడ్డి జెడ్‌పి చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, సిద్దిపేట జెడ్‌పి చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, మెదక్ జెడ్‌పి చైర్ పర్సన్ హేమలతా శేఖర్, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నపూర్ణ, ఎలక్షన్ రెడ్డి, జెడ్‌పిటిసి బాలు యాదవ్, అవుసులపల్లి సర్పంచ్ జి.కరుణాకర్, ఎంపిటిసి రాధ ప్రవీణ్, మర్కూక్ మండలం పాములపర్తి గ్రామ సర్పంచ్ తిరుమల రెడ్డి, ఎంపిపి పాండు గౌడ్, జెడ్‌పిటిసి మంగమ్మ రామచంద్రం, పిఎసిఎస్ చైర్మన్ బట్టు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

CM KCR water released from Kondapochamma sagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News