Monday, December 23, 2024

మిషన్ భగీరథతో ఫ్లోరైడ్‌ను తరిమివేసిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

CM KCR who got rid of fluoride with Mission Bhagiratha

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఫ్లోరైడ్ భూతానికి, ఫ్లోరోసిస్ వైకల్యానికి చిరునామాగా పేరుపడ్డ గడ్డ మీద అమావాస్య చీకటి వెన్నెలై మెరిసింది. ఫ్లోరైడ్ వ్యతిరేక పోరాటంలో ముందుండి నిలిచిన ఫ్లోరోసిస్ బాధితులంతా చేరి నరక చతుర్ధశిని భగీరథ విజయంగా జరిపారు. ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మర్రిగూడెంలో జరిగిన దీపావళి వేడుకల్లో ఫ్లోరోసిస్ బాధితులు, బాధిత కుటుంబాలే కాదు టిఆర్‌ఎస్ నేతలు, ప్రజలు పాల్గొని ఫ్లోరైడ్ విముక్తి వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్లోరైడ్ రక్కసి దహనం నిర్వహించారు. చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఫ్లోరైడ్ రక్కసికి నిప్పంటించి ఫ్లోరైడ్ విముక్తి వేడుకను ప్రారంభించారు. అనంతరం ఫ్లోరోసిస్ బాధితులు పటాకులు కాల్చి ఆనందాల్లో మునిగితేలారు. ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఫ్లోరోసిస్ బాధితులకు పంపిన స్వీట్లు, పటాకులు అందజేశారు.

అనంతరం బాల్క సుమన్ మాట్లాడుతూ.. కెసిఆర్ నాయకత్వంలో ఇంటింటికీ నీళ్లిచ్చే మిషన్ భగీరథ పథకం ద్వారా ఫ్లోరోసిస్ భూతాన్ని తరిమివేశామని అన్నారు. ఈ విజయాన్ని సూచిస్తూ ఫ్లోరోసిస్ భూతాన్ని ఈ రోజు దహనం చేశామని ఇక నుంచి నల్లగొండ ప్రజల జీవితాల్లో ఈ వెలుగులు నిలిచే ఉంటాయన్నారు. మంత్రి కెటిఆర్ పంపించిన చిరు కానుకలు, స్వీట్స్, క్రాకర్స్ని ఫ్లోరోసిస్ బాధితులకు అందజేశారు. ఒకప్పుడు ఫ్లోరైడ్ విముక్తి కోసం ఎన్నో ఏళ్లు పోరాటం చేశామని, ప్రధానమంత్రి వాజ్‌పాయి టేబుల్ మీద ఫ్లోరోసిస్ బాధితులను పెట్టి సమస్యను కండ్లకు కట్టినట్లు చూపినా వాళ్లు కనికరించలేదన్నారు.

బిజెపి, కాంగ్రెస్ లక్ష్య, చిత్తశుద్ధి లేని పార్టీలని, ఫ్ల్లోరోసిస్ బాధితుల పక్షాన ఓ పాట గట్టి, పోరాటం నడిపినట్టి కెసిఆర్ ఈ మునుగోడు, నల్లగొండ జిల్లా ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టే స్వరాష్ట్రంలో ఇదే ప్రాంతంలో మిషన్ భగీరథకు పైలాన్ వేసి, తెలంగాణకు మంచినీటి సమస్య లేకుండా చేసినట్లు చెప్పారు. కేంద్ర మంత్రులే తెలంగాణలో ఫ్లోరోసిస్ లేదని లోక్‌సభలో ప్రకటించారనిఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు కర్నాటి విద్యాసాగర్, వికలాంగుల సంక్షేమ శాఖ చైర్మన్ వాసుదేవ రెడ్డి, పుట్ట విష్ణువర్ధన్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, యాదయ్య, వికలాంగుల నెట్వర్క్ నాయకులు శ్రీనివాసులు, ఫ్లోరోసిస్ ఉద్యమకారులు అంశాల స్వామి, తిరుపతమ్మ, ప్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ కంచుకట్ల సుభాష్ పాల్గొన్నారు

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News