Wednesday, November 6, 2024

ముహూర్తం దసరా

- Advertisement -
- Advertisement -

జాతీయ పార్టీపై 5న మధ్యాహ్నం సిఎం కెసిఆర్ ప్రకటన

అదేరోజు తెలంగాణ భవన్‌లో 283మంది సభ్యులతో టిఆర్‌ఎస్ విస్తృతస్థాయి
సమావేశం జాతీయ పార్టీ ఏర్పాటుకు తీర్మానం టిఆర్‌ఎస్ పేరునే
మార్చుకోవాలని నిర్ణయం పరిశీలనలో బిఆర్‌ఎస్ సహా పలు రకాల పేర్లు పార్టీ
పేరు మార్పుపై 6న ఇసికి అఫిడవిట్ కారు గుర్తే ఉండేలా జాగ్రత్తలు తెలంగాణ
మోడల్ నినాదంతో దేశవ్యాప్త ప్రణాళికలు బిజెపి పాలిత రాష్ట్రాలపై
గురి డిసెంబర్ 9న ఢిల్లీలో భారీ బహిరంగ సభ టిఆర్‌ఎస్ జిల్లాల
అధ్యక్షులతో ముఖ్యమంత్రి కెసిఆర్ భేటీ జాతీయ రాజకీయ రంగ ప్రవేశంపై చర్చ,
అభిప్రాయాల మునుగోడు మనదే.. ప్రచారం ఉధృతం చేద్దామన్న సిఎం

మన తెలంగాణ/హైదరాబాద్ : సస్పెన్స్‌కు తెరపడింది. హైదరాబాద్ వేదికగా కొత్త జాతీయ పార్టీ విజయ దశమి రోజును పురుడుపోసుకోనుంది. ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్)ఇక జాతీయ పార్టీగా మారబోతోంది. కొత్త పార్టీకి సంబంధించిన పేరును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారికంగా విజయ దశమి రోజున ప్రకటించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 5వ తేదీన తెలంగాణ భవన్‌లో 283 మంది సభ్యులతో కూడిన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్నిఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే జాతీయ పార్టీ ఏర్పాటుకు మద్దతుగా తీర్మానం చేస్తారు. అదే రోజున మధ్యాహ్నం 1.19 గంటలకు మూహూర్తం నిర్ణయించగా జాతీయ పార్టీపై సిఎం కెసిఆర్ ప్రకటన చేస్తారు. అనంతరం ప్రగతి భవన్‌లో వివిధరాష్ట్రాల నేతలతో ఆయన సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ ఏర్పాటు అంశంపై చర్చించేందుకు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్‌లో మంత్రులు, టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులతో సిఎం కెసిఆర్ సమావేశమయ్యారు.

జాతీయ పార్టీ ఏర్పాటుపై వారితో చర్చించారు. దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను వారికి వివరించారు. దేశాన్ని కొత్త పంథాలో ముందుకు తీసుకెళ్లాలన్న తపనతోనే ఢిల్లీ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు కెసిఆర్ వివరించారు. అలాగే జాతీయ పార్టీ ఏర్పాటుకు తలెత్తిన పరిస్థితులను కూడా సమగ్రంగా విశ్లేషించారు. నూతన పార్టీ ప్రారంభం, దాని ఆవశ్యకత గురించే కాకుండా పార్టీ ప్రకటన తర్వాత అమలుచేయాల్సిన కార్యాచరణపైనా పార్టీ నేతలతో ఆయన సమగ్రంగా చర్చించారు. జాతీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశాలు, జెండా, అజెండాలపై కూలంకషంగా చర్చించారు. అంతేకాకుండా పార్టీ పేరు విషయంలోనూ నేతల అభిప్రాయ సేకరించినట్లుగా సమాచారం. మరోవైపు భారత రాష్ట్ర సమితి పేరు ప్రధానంగా వినిపిస్తున్నా….వీటితోపాటు మరో రెండు పేర్లుపై కూడాఆలోచన చేస్తున్నారు.

పేరు మార్పుపై 6న ఇసికి అఫిడవిట్

టిఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మారుస్తూ….మరో రెండు రోజుల్లో కొత్త పేరును ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో టిఆర్‌ఎస్ పేరు మార్పుపై 6వ తేదీన కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అఫిడవిట్ సమర్పించనున్నారు. పార్టీ పేరు మార్పును ఎన్నిల కమిషన్‌ఆమోదించిన తర్వాత పూర్తి స్థాయి జెండా, అజెండా సిఎం కెసిఆర్ ప్రకటించనున్నారు. కాగా టిఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా ఎందుకు మారాల్సి వచ్చిందనే పూర్తి విషయాలను ఢిల్లీలో డిసెంబర్‌లో తలపెట్టిన బహిరంగ సభలో కెసిఆర్ అన్ని అంశాలను వెల్లడించనున్నారు.

ఇక వెనుదిరిగేది లేదు

ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలను మొదలుపెట్టుబోతున్నామని….ఇక రాజకీయంగా ఎలాంటి సమస్యలు, కష్టాలు వచ్చినా వెనుదిరిగేది లేదని కెసిఆర్ పార్టీ నేతలకు విడమరించి చెప్పినట్లుగా సమాచారం. ఇందుకు రాజకీయంగా అనేక సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుందన్నారు. అయితే దేశ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా కెసిఆర్ పేర్కొన్నారు. అదే సమయంలో మంత్రులుగా, జిల్లా పార్టీ అధ్యక్షులుగా జాతీయ పార్టీని దేశంలోని అన్ని రాష్ట్రంలో విస్తరింప చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలని సిఎం కెసిఆర్ కోరారు. టిఆర్‌ఎస్‌ను ఏ విధంగా అయితే బలోపేతం చేశారో….అంతకు రెండింతలు కష్టపడి జాతీయ పార్టీని ముందుకు తీసుకపోదామన్నారు. పార్టీ ప్రకటన తర్వాత రాష్ట్రంలో జరగాల్సిన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలను వివరించారు. దసరా తర్వాత మునుగోడు ప్రచారాన్ని ఉధృతం చేయాలని సిఎం సూచించారు. మునుగోడులో అన్ని సర్వేలు మనకే అనుకూలంగా ఉన్నాయని కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. జాతీయ పార్టీ పేరుతోనే మునుగోడు ఎన్నికల బరిలో దిగుతామని కెసిఆర్ స్పష్టం చేశారు. ఈసారి మునుగోడు బరిలో మూడు జాతీయ పార్టీలు ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు.

జాతీయ పార్టీ కోసం పలు పేర్ల పరిశీలన

జాతీయ పార్టీకీ పెట్టబోయే పేర్లు ఈ సమావేశంలో నాలుగైదు పేర్లు తెరపైకి వచ్చాయి. వాటిల్లో ప్రధానంగా భారతీయ రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్), నవ భారత్, నయాభారత్, మహాభారత్ రాష్ట్రీయ పార్టీ వంటి పేర్లు వచ్చాయి. వీటిని పరిశీలించిన కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్) ను పోలినట్లుగా ఉన్న బిఆర్‌ఎస్ వైపు అధికంగా కెసిఆర్ మొగ్గుచూపుతున్నారని ఇప్పటి వరకు జోరుగా ప్రచారం సాగింది. అయితే భారత రాష్ట్ర సమితికి బదులుగా మరో పేరును తాజాగా సిఎం కెసిఆర్ సీరియస్ గా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. భారత రాష్ట్ర సమితి పేరు ఆసక్తికరంగా లేదన్న వాదనల నేపథ్యంలో దానికి బదులుగా ’భారత వికాస సమితి’ పేరును కూడా కెసిఆర్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ పేరునే దాదాపుగా ఖరారు చేయాలన్న ఆలోచనతో కెసిఆర్ ఉన్నట్లుగా టిఆర్‌ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన రాకపోయినా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆ పేరునే ఫైనల్ చేసే అవకాశం ఉందంటున్నారు.

దేశ రాజకీయాల్ని ప్రభావితం చేయాలని కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తున్న కెసిఆర్ అందుకు తగ్గట్లుగానే కొత్త పార్టీ పేరు ఉండాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పేరులో ప్రాంతీయ పార్టీ ముద్ర ఉందని కొందరు చెప్పడంతో….. యావత్ దేశాన్ని రిప్రజెంట్ చేసేలా పేరు ఉండాలన్న కెసిఆర్ సూచనతో కొత్త పేరును నిపుణులు సూచించారని తెలుస్తోంది. కాగా సిఎం కెసిఆర్ సైతం ఇటీవల తరుచుగా ఎక్కడ మాట్లాడినా… దేశ అభివృద్ధిపైనే మాట్లాడుతున్నారు. చైనా, అమెరికాతో పోలుస్తూ దేశ పరిస్థితులను వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కెసిఆర్ ఆలోచనకు తగ్గట్లుగానే కొత్త పేరును సూచించారని తెలుస్తోంది. అయితే పార్టీ పేరుతో కెసిఆర్ తుది నిర్ణయం ఎలా ఉండబోతోందన్న సస్పెన్స్‌కు మరో రెండు రోజుల్లో తెరపడనుంది.

కారు గుర్తు కోసమే

టిఆర్‌ఎస్ ఎన్నికల చిహ్నమైన కారు గుర్తు కోసమే ఆ పార్టీని కెసిఆర్ జాతీయ పార్టీగా ఏర్పాటు చేస్తున్నారు. లేని పక్షంలో అనేక న్యాయపరమైన చిక్కులు వస్తాయని పలువురు మేధావులు కెసిఆర్‌కు సూచించారు. వారి సూచనలు, సలహాలు స్వీకరించిన మీదటనే కొత్తగా జాతీయ పార్టీని ఏర్పాటు చేయడం కంటే…..టిఆర్‌ఎస్‌నే జాతీయ పార్టీగా మార్చుకోవాలన్న నిర్ణయానికి కెసిఆర్ వచ్చారని తెలుస్తోంది.

చివరి నిమిషం వరకు గోప్యత

కొత్త జాతీయ పార్టీ పేరుపై చివరి నిమిషం వరకు గోప్యత పాటిస్తూ ఉత్కంఠను పెంచడం ద్వారా జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షించవచ్చనని కెసిఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన అన్ని విషయాలు కూలంకషంగా చర్చించారు. దసరా నాడు నిర్వహించే సమావేశంలో పార్టీ ఆశయాలు, లక్ష్యాలను వివరిస్తూ ’విజన్ డాక్యుమెంట్’ ను విడుదల చేస్తారని టిఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ పేరుకు తెలుగు, ఇంగ్లీష్‌లో ఎన్ని లెటర్స్ ఉండాలి? ఎలా ఉండాలో న్యూమరాలజీని సైతం కెసిఆర్ ఫాలో అవుతున్నారని తెలుస్తోంది. అలాగే వేర్వేరు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. గతంలో ఉన్న పార్టీల పేర్లను టచ్ చేయకుండా సరికొత్తగా పేరు పెట్టాలని భావిస్తున్నారు.

9న ఢిల్లీలో భారీ బహిరంగ సభ

ఢిల్లీ దద్దరిల్లేలా డిసెంబర్ 9వ తేదీన భారీ బహిరంగ సభకు నిర్వహిస్తామని కెసిఆర్ అన్నారు. ఈ సభ వచ్చే జనవాహినిని చూసి కేంద్రం పెద్దల లాగులు తడవాలని పార్టీ నేతలకు కెసిఆర్ సూచించినట్లుగా సమాచారం. ఇప్పటి వరకు ఏ జాతీయ పార్టీకి కూడా నిర్వహించని రీతిలో బహిరంగ సభను నిర్వహించుకుందామన్నారు. ఈ సభతోనే బిజెపి సర్కార్‌పై పూర్తిస్థాయిలో యుద్ధభేరి మ్రోగిద్దామన్నారు. మన బలాన్ని చూసి కలిసివచ్చే పార్టీలను కూడా కలుపుకుని బలమైన పార్టీగా ఎదుగుదామన్నారు. దేశంలో బిజెపిని ఓడించే సత్తా మనకే ఉంటుందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మన పార్టీకి, బిజెపికి మధ్యనే తీవ్రమైన అసలైన పోటీ నెలకొని ఉంటుందని మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులకు కెసిఆర్ సూచించినట్లుగా సమాచారం.

తెలంగాణ మోడల్ అనే నివాదంతో…

దేశమంతటా తెలంగాణ మోడల్ అనే నినాదం, అజెండాతో తొలి అడుగువేసేందుకు కెసిఆర్ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా బిజెపి, కాంగ్రెస్‌కు సమదూరం పాటిస్తూ వివిధ రాష్ట్రాల్లో పర్యటించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. పర్యటనల కోసం సొంతంగా విమానం కొనుగోలుకు సిద్ధమవుతున్నారు. బిజెపిని, కేంద్రాన్ని టార్గెట్‌గా చేసుకుని రైతు, దళిత, కార్మిక,యువత, మహిళల అంశాలపై ఉద్యమానికి శ్రీకారంచుట్టేలా వ్యూహాలను సిద్దం చేస్తున్నారు. దీని కోసం పలు రాష్ట్రాలకు సమన్వయ కర్తలను త్వరలోనే నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.

బిజెపి పాలిత రాష్ట్రాలపై గురి

జాతీయ పార్టీ ప్రకటన తర్వాత పెద్దఎత్తున బహిరంగ సభలు, రౌండ్ టేండ్ సమావేశాలు నిర్వహించాలని కెసిఆర్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. వేర్వేరు రాష్ట్రాల్లో వీలైనన్ని చోట్ల ఎక్కువగా వీటిని నిర్వహించాలే ప్రణాళికలను సిద్ధం చేశారు. అది కూడా బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఉండేలా చూస్తున్నారట. రాష్ట్రంలో అమలుచేస్తున్న రైతు బంధు, దళిత బంధు, పింఛన్లు, రైతులకు ఉచిత విద్యుత్ లాంటి సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేసే విధంగా కార్యక్రమాలను దాదాపుగా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.

అసలు….సిసలైన దసరా

ఈ దసరా పండగు మరో ప్రత్యేకతను సంతరించుకుబోందని మంత్రి సత్యవతి రాథోడ్ వ్యాఖ్యానించారు. సిఎం కెసిఆర్ సమావేశం పూర్తి అయిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, దేశానికి అసలు…సిసలైన దసరా పండుగ ఈ నెల 5వ తేదీన రాబోతోందన్నారు. ఆ రోజున దేశంలోని పార్టీలు సైతం ఉలిక్కిపేడేలా సిఎం కెసిఆర్ సంచలన ప్రకటన చేస్తున్నారన్నారు.

పలు రాజకీయ పార్టీల మద్దతు

దేశ ప్రజలు, యువతా అంతా కెసిఆర్ ఏర్పాటు చేయబోతే జాతీయ పార్టీ కోసం ఎదురుచూస్తున్నారని పినపాక శాసనసభ్యుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగ కాంతరావు అన్నారు. ఇప్పటికే అనేక పార్టీలు విలీనం కావడంతో పాటు మరికొన్ని పార్టీలు కలిసివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ విషయాలన్నింటిపై 5వ తేదీన కెసిఆర్ చాలా స్పషంగా అన్ని వివరాలను చెప్పబోతున్నారన్నారు. ఆ రోజున
ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో సమావేశమై పార్టీలో అందరితో చర్చించి తీర్మానం చేస్తున్నామన్నారు.

సంక్షేమ రంగం దేవుడు

మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సిఎం కెసిఆర్ అభివృద్ధి చేశారన్నారు. రైతుబంధు, వ్యవసాయానికి ఉచిత కరెంటు, గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతో పాటు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తెలంగాణను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వాన్ని అందరూ కోరుకుంటున్నారన్నారు. ఆయన మేధస్సును భారత ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. భారతదేశ ప్రజల తలరాతను మార్చే గొప్ప నిర్ణయం దసరా రోజు ప్రకటిస్తారన్నారు. సమావేశంలో భారతదేశ రాజకీయాల్లోకి రావాలని తామును సీఎంను కోరినట్లు కవిత తెలిపారు. తెలంగాణ బిడ్డలు అందుకుంటున్న అభివృద్ధి ఫలాలను యావత్ దేశ ప్రజలకు అందించేందుకు జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరినట్లు పేర్కొన్నారు. బిజెపి బీజేపీ మొండి వైఖరి కారణంగా తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు ఇవ్వడం లేదని, రాష్ట్ర యువత జీవితాలతో ఆటలాడుకుంటున్నారని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News