జూన్ 24 నుంచి 30వరకుపోడు పట్టాల పంపిణీ
పట్టాలు పొందిన పోడు రైతులకు రైతుబంధు వర్తింపు
అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ
జులైలో గృహలక్ష్మీ పథకం ప్రారంభం
జూన్14న నిమ్స్ నూతన భవనానికి శంకుస్థాపన
దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో సిఎం కె.చంద్రశేఖరరావు
పదేండ్ల పండుగ షెడ్యూల్ ఖరారు
జూన్ 2 నుంచి 22వరకు ఘనంగా ఉత్సవాల నిర్వహణ
22న అమరుల స్మారకం ఆవిష్కరణ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గిరిజనులకు జూన్ 24 నుంచి 30 వరకు పోడు భూము ల పట్టాలపంపిణీ కార్యక్రమం నిర్వహించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు, పోడు భూముల ప ట్టాల పంపిణీ, తదితర అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై సిఎం కెసిఆర్ మంగళవారం సచివాలయంలోఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పలు నిర్ణయాలు తీసుకున్నారు.
జూన్ 24 నుంచి 30 వరకు గిరిజన సోదరులకు పోడు భూముల ప ట్టాల పం పిణీ కార్యక్రమం నిర్వహించాలని సిఎం కెసిఆర్ ని ర్ణయించారు. నూతనంగా పోడు పట్టా లు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి రైతుబంధు వర్తింపచేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. కాగా, ఇప్పటికే ఆర్‌ఒఎఫ్‌ఆర్ ద్వారా రై తుబంధు పొందుతున్న వారితో పాటు నూతనంగా పోడు పట్టాలు అందుకోబోతున్న గిరిజన లబ్దిదారులతోను క్రోడికరించి…రాష్ట్రంలో మిగతా రైతులకు ఏ విధంగానైతే రైతుబందు అందుతున్న దో వీరికీ అదే పధ్దతిలో రైతు బంధు అందేలా చర్య లు తీసుకోవాలని సూచించారు.
ఇందుకు సంబంధించి ప్రభుత్వమే బ్యాంకు అకౌంట్‌ను తెరిచి పోడు భూముల పట్టాల యాజమానులకు నేరుగా వారి ఖాతాల్లో రైతుబంధును జమ చేస్తుందన్నారు. ఇందుకు సంబంధించి…నూతనంగా పోడు పట్టాలు అందుకున్న గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థిక శాఖ వారికి అందజేయాలని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను సిఎం కెసిఆర్ ఆదేశించారు. పోడు భూముల పంపిణీ కార్యక్రమానికి తానే స్వయంగా హాజరవుతానని సిఎం తెలిపారు.
25న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యాచరణకు సంబంధించి ఈ నెల 25న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రులు, జిల్లా ఎస్‌పిలు పాల్గొంటారు.
ఇండ్ల స్థలాల పంపిణీ
ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఇంకా మిగిలి వున్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను అర్హులైన నిరుపేదలను గుర్తించి వారి ఇండ్ల నిర్మాణాల కోసం దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో అర్హులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపట్టాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు.
జూలైలో గృహలక్ష్మి పథకం ప్రారంభం
గృహలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరితగతిన రూపొందించాలని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. జూలై నెలలో గృహలక్ష్మి పథకం ప్రారంభించాలని వెల్లడించారు. జూలైలోనే దళితబంధు కొనసాగింపు కోసం ఏర్పాట్లు చేయాలని సిఎస్‌ను సిఎం ఆదేశించారు.
14న నిమ్స్ నూతన భవనానికి శంకుస్థాపన
జూన్ 14వ తేదీన వైద్య ఆరోగ్య దినోత్సవం నాడు నిమ్స్ దవఖానా విస్తరణ పనులకు సిఎం శ్రీకారం చుట్టనున్నారు. 2 వేల పడకలతో నూతనంగా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ భవన నిర్మాణానికి సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేయనున్నారు.