Monday, December 23, 2024

త్వరలో కొత్త 300 ఎలక్ట్రిక్ బస్సులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిఎస్ ఆర్టీసితో ప్రజలకు ఎంతో అనుబంధం ఉందని, ఉన్నత స్థాయిలో ఉన్న వారు కూడా ఆయా సందర్భాలలో ఆర్టీసి సేవలను వినియోగించుకున్న రోజులను మరచిపోలేరంటూ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే, మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్, ఐపిఎస్‌లు పేర్కొన్నారు. వైట్ థాట్స్ రూపకల్పనలో భాగంగా ప్రముఖ గాయకులు రామ్ మిరియాల ఆర్టీసి బస్సు ప్రాముఖ్యతను వివరిస్తూ ఆలపించిన తెలంగాణ ఆన్ ట్రాక్ పాటను వారు ఆవిష్కరించారు. బుధవారం మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ (ఎంజిబిఎస్)లో జరిగిన ఈ కార్యక్రమంలో 40- నుంచి 50 ఏళ్లుగా ఆర్టీసి బస్సు సేవలను వినియోగించుకుంటున్న ఉత్తమ ప్రయాణికులను చైర్మన్, ఎండి ఘనంగా సన్మానించారు.
త్వరలో కొత్తగా 300 ఎలక్ట్రిక్ బస్సులు
ఈ సందర్భంగా చైర్మన్ బాజిరెడ్డి మాట్లాడుతూ బస్సులో ప్రయాణించే సమయంలో గొప్ప అనుభూతి కలుగుతుందని, పెళ్లైన కొత్తలో తాను తిరుపతికి బస్సులో వెళ్లిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. సామాన్య, ధనిక, విద్యార్థులు, వ్యాపారస్థులు ఇలా అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తున్న ఆర్టీసిని మరింత ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసి బాగుండాలని ఆకాంక్షించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ మేరకు తగిన ప్రోత్సాహం అందిస్తున్నారన్నారు. అతి త్వరలో కొత్తగా 300 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని, ఈనెల 24వ తేదీన 50 కొత్త బస్సులను సిఎం కెసిఆర్ ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. మరో 250 బస్సులు త్వరలోనే వస్తాయని, గతంలో 97 బస్సు డిపోలు నష్టాల్లో ఉంటే ప్రస్తుతం 40 నుంచి 50 వరకు బస్సు డిపోలు లాభాల్లోకి వచ్చాయని, స్లీపర్ కోచ్ ఎసి బస్సులు కూడా అందుబాటులోకి రానున్నట్టు ఆయన పేర్కొన్నారు.
ప్రజారవాణా వ్యవస్థకు 90 ఏళ్లకు పైగా చరిత్ర
తెలంగాణలో ప్రజారవాణా వ్యవస్థకు 90 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని, కోట్లాది మంది ఆర్టీసి సేవలను వినియోగించుకోవడం గొప్ప విషయమని, ఉన్నత స్థాయిలో ఉన్న వారు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించిన సందర్భాలు అనేకం ఉన్నాయని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్ పేర్కొన్నారు. తాను కర్ణాటక ప్రజా రవాణా సేవలు వినియోగించుకున్న రోజులను గుర్తు చేసుకుంటూ ప్రైవేటు వాహనాల వినియోగం పెరిగినా చాలా మంది ప్రజా రవాణా వ్యవస్థను ఆదరిస్తున్నారని ఆయన తెలిపారు. బస్సు ప్రయాణ అనుభూతి వేరుగా ఉంటుందని, అందుకే టిఎస్‌ఆర్టీసిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ పాటను తీసుకువచ్చామన్నారు. టిఎస్ ఆర్టీసిని కుటుంబ సభ్యుడిలాగా భావించాలని, రవాణా అవసరాల కోసం ఆర్టీసి బస్సులను వినియోగించుకోని క్షేమంగా, భద్రంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన సూచించారు.
ఆర్టీసితో అనుబంధం మరవలేనిది: ప్రముఖ గాయకుడు రామ్ మిరియాల
ఆర్టీసి ప్రజా రవాణా సేవలను పాట రూపంలో చెప్పడం చాలా ఆనందంగా ఉందని, ప్రజలతో ఆర్టీసికి ఉన్న అనుబంధమే ఈ పాటంటూ ప్రముఖ గాయకులు రామ్ మిరియాల పేర్కొన్నారు. మధ్య తరగతి కుటుంబంలో ఆర్టీసిని ఒక కుటుంబ సభ్యుడు లాగా భావిస్తారని ఆయన అభివర్ణించారు. తనకు పాట పాడే అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
ఉత్తమ ప్రయాణికులకు సన్మానం
ఎంతో కాలంగా ఆర్టీసి బస్సుల్లో ప్రయాణిస్తున్న ఉత్తమ ప్రయాణీకులను ఈ సందర్భంగా సంస్థ చైర్మన్, ఎండిలు శాలువ, మెమెంటోతో సత్కరించారు. వెంకట్ రామిరెడ్డి, సాయి కుమార్, ఎ. రాంబాబు, వేణుగోపాల్, జహాన్ బేగం, దండ భాని, మంగిలాల్, సుజాత, సాజీదా బేగం, ఆశన్న గౌడ్, గౌసుద్ధీన్లు సన్మానం అందుకున్న వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం నాయక్, యాదగిరి, ముని శేఖర్, సిపిఎం ఎస్.కృష్ణకాంత్, సిటిఎం (ఎం అండ్ సి) విజయకుమార్, సిటిఎం జీవన్ ప్రసాద్, రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీధర్, వైట్ థాట్స్ ప్రతినిధులు రాజు, ప్రదీప్, సుశాంత్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News