హైదరాబాద్ : రేపటి నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో టిఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం బేగంపేట విమానశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పార్టీకి చెందిన పలువురు ముఖ్యనేతలతో కలిసి ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. గురువారం (2వ తేదీ) మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీలోని వసంతి విహార్ మెట్రోస్టేషన్ సమీపంలోని కేంద్రం కేటాయించిన 1300 గజాల స్థలంలో టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ పనులకు సిఎం కెసిఆర్ భూమి పూజ చేస్తారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సమావేశంలో సిఎం ప్రసంగించనున్నారు. ఇదే సమయంలో రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై చర్చించేందుకు అనుమతి లభిస్తే ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముందని కూడా తెలుస్తోంది. ఆ మార్నాడు (శుక్రవారం) మధ్యాహ్నం సిఎం కెసిఆర్ తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. కాగా పార్టీ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో దాదాపుగా రాష్ట్ర మంత్రులు, టిఆర్‌ఎస్‌కు చెందిన ఎంపిలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో పాటు పార్టీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.