Friday, November 22, 2024

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైద్రాబాద్ : ముస్లిం సోదరులకు సిఎం కెసిఆర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ ఉపవాస దీక్షల ద్వారా పరిఢవిల్లిన క్రమశిక్షణ, సహోదరత్వం, దైవభక్తి, ఆధ్యాత్మికచింతన స్ఫూర్తితో ‘ఈద్ ఉల్ ఫితర్’ పర్వదిన వేడుకలను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరితో కలిసి సంతోషంగా జరుపుకోవాలని కోరుకున్నారు. అల్లా దీవెనలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా భగవంతుని ఆశీర్వాదాలు అందాలని ప్రార్థించారు. గంగా జమునా సంస్కృతికి తెలంగాణ నేల ఆలవాలమని, లౌకికవాదాన్ని, మత సామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగే కట్టుబడి వుందని పునరుద్ఘాటించారు. విద్య, ఉపాధితో పాటు పలు రంగాల్లో ఆసరానందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు భరోసాగా నిలిచిందన్నారు.

వారి జీవితాల్లో గుణాత్మక మార్పుకోసం అమలు చేస్తున్న పలు పథకాలు ఫలితాలనిస్తున్నాయని తెలిపారు. స్వయం పాలనలో గడచిన తొమ్మిదేండ్ల కాలంలో మైనారిటీ సంక్షేమం, అభివృద్ధి కోసం రాఫ్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 13 వేల కోట్లు కేటాయించి ఖర్చు చేస్తున్నదని వివరించారు. మైనారిటీల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పలు పథకాలు, ప్రగతి కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, వారి అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వ నిరంతర కృషి కొనసాగుతూనే వుంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో అమలవుతున్న ముస్లిం మైనారిటీ అభివృద్ధి మోడల్‌ను దేశవ్యాప్తంగా విస్తరింపచేసేందుకు తమ కృషి కొనసాగుతూనే ఉంటుందని ఉద్ఘాటించారు.
రాష్ట్ర మంత్రుల శుభాకాంక్షలు..
ముస్లిం సోదరులకు రాష్ట్ర మంత్రులు కెటిఆర్, హరీష్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్‌రెడ్డిలు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీల అభ్యు న్నతికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. గత తొమ్మిదేళ్లలో మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ నేతృత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం పలు పథకాలు అమలు చేసిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News