Friday, November 22, 2024

గర్వించండి..పండుగ చేయండి

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పదవ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
తెలంగాణ కోసం ఆరు దశాబ్ధాల పాటు వివిధ దశల్లో సాగిన పోరాటాలను, ఉద్యమాలను, త్యాగాలను స్మరించుకున్న సిఎం కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ స్వయం పాలన తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని పదవ వసంతంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంలో తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, పదవ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆరు దశాబ్ధాల పాటు తెలంగాణ కోసం వివిధ దశల్లో సాగిన పోరాటాలను, ఉద్యమాలను, త్యాగాలను రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా సిఎం కెసిఆర్ స్మరించుకున్నారు. రాష్ట్ర ఏర్పాటు దిశగా భావజాలాన్ని వ్యాప్తిచేస్తూ ప్రజలను మమేకం చేస్తూ మలిదశ ఉద్యమాన్ని పార్లమెంటరీ పంథాలో ప్రజాస్వామ్య పోరాటం దిశగా మలిపిన తీరును సిఎం గుర్తు చేసుకున్నారు.

రాష్ట్ర సాధన పోరాట క్రమంలో తాను ఎదుర్కున్న కష్టాలను, అవమానాలను, అధిగమించిన అడ్డంకులను, సిఎం కెసిఆర్ యాది చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, వేలాది సభలను నిర్వహిస్తూ, సబ్బండ వృత్తులను సకల జనులను సమీకరిస్తూ, సమన్వయ పరుస్తూ, అందరి భాగస్వామ్యం సహకారంతో, శాంతియుత పద్దతిలో పోరాటాన్ని కొనసాగించి, కేంద్రం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించిన మొత్తం ప్రక్రియను, ఈ క్రమంలో సహకరించిన వారినందరినీ సిఎం గుర్తు చేసుకున్నారు. విజయతీరాలకు చేరుకున్న ఈ మొత్తం ఉద్యమ ప్రస్థానంలో ఇమిడివున్న.. నిర్థిష్ట పరిస్థితులకు అనుసరించిన నిర్థిష్ట కార్యాచరణను, ‘బోధించు సమీకరించు పోరాడు’ అనే పంథా ద్వారా సాధించిన విజయాన్ని సిఎం కెసిఆర్ దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా స్మరించుకున్నారు.

ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భమిది
తొమ్మిదేండ్ల క్రితం 2014 జూన్ 2 నాడు భారత దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ, అనుమానాలను పటాపంచలు చేస్తూ, బాలారిష్టాలను దాటుకుంటూ, ప్రత్యర్థులు కుయుక్తులను తిప్పికొడుతూ నిలదొక్కుకోవడం అత్యద్భుతమని సిఎం అన్నారు. ఒకనాడు వెనకబాటుకు గురయిన తెలంగాణ నేడు సమస్త రంగాలలో దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కృషి, ప్రజలందరి భాగస్వామ్యంతో, ఈ తొమ్మిదేండ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శవంతంగా నిలవడం పట్ల సిఎం కెసిఆర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. మున్నెన్నడూ ఎరుగని రీతిలో ‘తెలంగాణ మోడల్’ పాలన దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. తెలంగాణ వంటి పాలన కావాలని, అన్ని రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారని, ఈ దిశగా దేశ ప్రజలందరి ఆదరాభిమానాలను చూరగొనడం తెలంగాణ ప్రజలు సాధించిన ఘన విజయమని సిఎం పేర్కొన్నారు. ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన గొప్ప సందర్భమిదని సిఎం కెసిఆర్ అన్నారు.

పండుగ వాతావారణంలో సంబురాలు
వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం, సంక్షేమం, ఆర్థిక రంగం సహా సమస్త రంగాలలో గుణాత్మక అభివృద్ధి సాధిస్తూ, మహోజ్వల స్థితికి చేరుకుంటున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని మూడు వారాల పాటు అంగరంగవైభవంగా, పండుగ వాతావారణంలో జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని సిఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఫలాలను ఆస్వాదిస్తున్న ఆనందరకర సమయంలో తమ సంతోషాలను పంచుకుంటూ ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ధి ఉత్సవాల్లో భాగస్వాములై రాష్ట్ర ప్రజలందరూ వాడ వాడనా సంబురాలను ఘనంగా జరుపుకోవాలని సిఎం కెసిఆర్ పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News