మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అడవుల పునరుద్దరణ, సంరక్షణకుగాను గడచిన ఆరేండ్లుగా రాష్ట్రప్రభుత్వం అమలు పరుస్తు న్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం సాధిస్తున్న ఘనతను సిఎం గుర్తు చేసుకున్నారు. పచ్చదనాన్ని అభివృద్ది పరిచే కృషిలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని పేర్కొన్నారు. హరిత యజ్జంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరినీ ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
మేలుకోకపోతే ముప్పే..!
ప్రకృతి మనకు అవసరమయ్యే దానికంటే…. మనకే ప్రకృతి చాలా అవసరమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ముందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రకృతితో మన సంబంధాన్ని పునరాలోచించుకోవడానికి, పునః నిర్వచించటానికి ఇదే సరైన సమయమన్నారు. లేకపోతే భవిష్యత్తులో గాలి, నీరు దొరకని పరిస్థితులు ఎదుర్కొనాల్సి ఉంటుందన్నారు. మనల్ని మనం రక్షించుకోవడంతో పాటుం భూగ్రహాన్ని రక్షించుకోవాలన్నారు. పర్యావరణం బాగుండాలంటే గాలి, నీరు, చెట్లు సంవృద్ధిగా ఉండాలని సూచించారు. భూమి పై కనీసం 33శాతం అటవీ ప్రాంతం ఉంటేనే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. ప్రతి ఒక్కరు తమ పుట్టిన రోజు సందర్భంగా విధిగా ఒక మొక్కను నాటి అందరికి స్పూర్తిదాయకంగా నిలవాలని ఆయన సూచించారు.
ఘనంగా అటవీ దినోత్సవం
ప్రపంచ అటవీ దినోత్సవాన్ని రాష్ట్ర అటవీశాఖ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అటవీ శాఖ తరపున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ ఉద్యానవనం (కెబిఆర్ పార్క్) లో వాకర్స్, సందర్శకుల కుటుంబ సభ్యులు, చిన్న పిల్లలతో కలిసి అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్) ఆర్.శోభ, అటవీశాఖ ఉన్నతాధికారులు మొక్కలు నాటారు. నివాసయోగ్యమైన పరిసరాల కల్పన, రానున్న తరాలకు మంచి ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం జంగల్ బచావో జంగల్ బడావో నినాదంతో హరితహారం కార్యక్రమంతో పాటు, క్షీణించిన అడవుల పునరుద్ధరణకు అటవీ శాఖ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు పిసిసిఎఫ్ తెలిపారు. చిన్నపిల్లల్లో అడవులు, పర్యావరణం పట్ల అవగాహన కల్పించడం వల్ల సామాజిక స్పృహ పెరుగుతుందన్నారు. కుటుంబంలో ఏ వేడుక జరిగినా, ఆ సందర్భంగా పిల్లలతో ఒక మొక్క నాటించి, వాటిని పెంచే సంస్కృతిని అలవాటు చేయాలని కోరారు. అనంతరం మేడ్చల్ జిల్లా కండ్లకోయ ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అటవీశాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫారెస్ట్ కాలేజ్, పరిశోధనా సంస్థ విద్యార్థులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి ఒక ఎకరం స్థలంలో గంధపు మొక్కలు నాటారు. ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ ఆధ్వర్యంలో పాములపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ సొసైటీ సభ్యులు బర్డ్ వాచింగ్, తెలంగాణ ప్రాంతంలో కనిపించే అరుదైన పక్షులపై వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అడవులు, పులుల సంరక్షణ కేంద్రాలు, అభయారణ్యాల రక్షణకు అవసరమైన అవగాహన కల్పిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించారు. అటవీ సమీప గ్రామాల ప్రజలతో అటవీ సిబ్బంది సమావేశమై అగ్ని ప్రమాదాల నివారణ, అటవీ భూముల రక్షణకు అవసరమైన చర్యల పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో పిసిసిఎఫ్ ఆర్.శోభ తో పాటు అదనపు అటవీ సంరక్షణ అధికారులు వినయ్ కుమార్, ఎకె సిన్హా, హైదరాబాద్ రేంజ్ చీఫ్ కన్జర్వేటర్ ఎంజె అక్బర్, హైదరాబాద్, మేడ్చల్ జిల్లా అటవీ అధికారులు జోజి, వెంకటేశ్వర్లు, డిసిఎఫ్ లక్ష్మి, డిఎఫ్‌ఒ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
హరితంలో మనమే అగ్రగామూలం
- Advertisement -
- Advertisement -
- Advertisement -