హైదరాబాద్ : దాశరథీ కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఆయన పేరుతో ప్రతిఏటా ప్రకటించే ప్రతిష్టాత్మక “శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డును” 2023 సంవత్సరానికి గాను ప్రముఖ రచయిత, సంస్కృతాంధ్ర కవి, శతావధాని, కామారెడ్డి జిల్లాకు చెందిన అయాచితం నటేశ్వర శర్మకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.అవార్డుతో పాటు 1 లక్షా 1,116 రూపాయల నగదును, శాలువా, జ్ఞాపికను ఈ నెల 22వ తేదీన రవీంద్ర భారతిలో జరిగే కృష్ణమాచార్య జయంతి ఉత్సవాల సందర్భంగా అవార్డు గ్రహీతకు అందజేస్తారు. ఈ సందర్భంగా, ఆయాచితం నటేశ్వర శర్మకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.
2022 సంవత్సరంలో దాశరథి 98వ జయంతి సందర్భంగా ప్రముఖ కవి వేణు సంకోజుకు అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. సాహిత్య రంగంలో విశేషంగా కృషి చేసిన వారిని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ప్రతి ఏడాది దాశరథి జయంతి(జులై 22) రోజున ఆ అవార్డును ప్రదానం చేస్తోంది. ఈ అవార్డు ప్రదానం 2015 సంవత్సరం నుంచి కొనసాగుతోంది. తెలుగు సాహిత్యంలో విశిష్ఠ స్థానం సంపాదించిన దాశరథి కృష్ణమాచార్య.. 1925 జూలై 22న వరంగల్ జిల్లా గూడూరులో జన్మించారు. 2015లో తొలి దాశరథి సాహితీ పురస్కారాన్ని కవి ఆచార్య తిరుమల శ్రీనివాసాచార్యకు ప్రదానం చేశారు. 2016లో జె.బాపురెడ్డికి, 2017లో ఆచార్య ఎన్.గోపికి, 2018లో వఝల శివకుమార్కు, 2019లో డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యకు, 2020లో డాక్టర్ తిరునగరి రామానుజయ్యకు, 2021లో తెలుగు యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్‌లర్ ఎల్లూరి శివారెడ్డికి దాశరథి కృష్ణమాచార్య అవార్డు వరించింది.