ఉపాధ్యాయులకు సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు
మన తెలంగాణ/హైదరాబాద్ : భారత మాజీ రాష్ట్రపతి, దివంగత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సెప్టెంబర్ 5న జరుపుకునే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్ది బాధ్యతగల పౌరులుగా తాయరు చేసే శిల్పుల వలే గురుతర బాధ్యతను నిర్వహించే గురువుల సేవలు వెలకట్టలేనివని సిఎం పేర్కొన్నారు. తెలంగాణలో గురువులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ, వారి సర్వతోముఖాభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామనీ, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధికంగా గురుకులాలు నెలకొల్పి, విద్యా వ్యవస్థను దేశంలోనే పటిష్టంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. తెలంగాణ విద్యను దేశానికి తలమానికంగా రూపుదిద్దే మహాయజ్ఞనంలో సంపూర్ణ భాగస్వాములు కావాలని ఉపాధ్యాయులను కోరారు. కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయిన విద్యాలయాలు పునఃప్రారంభమైనందున కోవిడ్ నిబంధనలుపాటిస్తూ విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ విద్యనందించాలని సిఎం కెసిఆర్ ఉపాధ్యాయులను కోరారు.