మన తెలంగాణ/హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్స్‌లో భారత దేశ క్రీడాకారులు హాకీ , బాక్సింగ్ కేటగిరీల్లో కాంస్య పతకాలు సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. 41ఏండ్ల తర్వాత భారత హాకీ జట్టు విశ్వక్రీడల్లో పతకం కైవసం చేసుకోవడం సంతోషకరమన్నారు. తద్వారా దేశీయ క్రీడ హాకీ విశ్వక్రీడా వేదికల్లో పునర్వైభవాన్ని సాధిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు తీవ్రంగా కృషి చేసిన భారత హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్‌ను, జట్టు క్రీడాకారులను సిఎం ప్రశంసించారు.
అలాగే మహిళా బాక్సింగ్ కేటగిరీలో తొలిసారి బరిలోకి దిగి కాంస్యం సాధించిన అస్సాంకు చెందిన భారత బాక్సర్ లవ్లీనా బొర్గోహైని సిఎం కెసిఆర్ అభినందించారు. ఒలింపిక్స్‌లో దేశం తరఫున పతకం నెగ్గిన మూడో బాక్సర్‌గా లవ్లీనా చరిత్రకెక్కడం పట్ల సిఎం హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ భారత క్రీడాకారులు విశ్వ క్రీడల్లో విజయకేతనం ఎగరేసి మరిన్ని పతకాలు సాధించాలని సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు.
అలాగే ఒలింపిక్స్ క్రీడల్లో ఇండియన్ రెజ్లర్ రవికుమార్ దహియా సిల్వర్ మెడల్ సాధించడం పట్ల సిఎంకెసిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రవికుమార్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రెజ్లింగ్ విభాగంలో స్వర్ణ పతకం తృటిలో చేజారిపోయినా, అత్యంత ప్రతిభకనబరిచి ఫైనల్ దాకా చేరుకుని రజతాన్ని సాధించిన రవికుమార్ క్రీడాస్పూర్తి దేశకీర్తిని మరింతగా ఇనుమడింపచేసిందని సిఎం అన్నారు. విశ్వక్రీడల్లో భారత క్రీడాకారులు ప్రతిభ కనబరుస్తూ పతకాలు సాధించడం సంతోషంగా ఉందని సిఎం పేర్కొన్నారు.