Wednesday, January 22, 2025

రైతును రాజు చేయడమే సిఎం కెసిఆర్ లక్షం

- Advertisement -
- Advertisement -

కీసర: రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్షమని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కీసర రైతు వేదికలో నిర్వహించిన రైతు దినోత్సవంలో మంత్రి మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలంకరించిన ట్రాక్టర్లతో రైతులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు కీసరలోని తెలంగాణ అమర వీరుల స్థూపం నుంచి కళాకారులు, బోనాలు డప్పు చప్పుల్లతో ఊరేగింపుగా రైతు వేదికకు చేరుకున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రైతులను గొప్ప వారిగా చేయాలి ఆదిశగా సాగు ఉండాలనే సంకల్పంతో సిఎం కెసిఆర్ వివిధ సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రైతులు అరగోస పడ్డారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో వ్యవసాయానికి నిణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతుందని మంత్రి అన్నారు.

రైతులకు భరోసా ఇస్తూ రైతుబంధు, రైతు బీమా తదితర సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, సకాలంలో విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారని మంత్రి చెప్పారు. రైతులను సంఘటితం చేసేందుకు ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున 2,601 రైతు వేదికల నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. పంటలు వేసినప్పటి నుంచి కొనుగోళ్ల వరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ చివరి గింజ వరకు ధాన్యం కొగోళు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నామని అన్నారు. దేశంలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత తెలంగాణదని మంత్రి అన్నారు

. మేడ్చల్ జిల్లాలో 2016, 17 సంవత్సరంలో 30,361 ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం 51,852 ఎకరాలకు విస్తరించి 71 శాతం వృద్ధ్ది సాధించిందని చెప్పారు. రైతుబంధు ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 44792 మంది రైతులకు సుమారు 343 కోట్లు రైతుబంధు పథకంలో పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. రైతు జీవిత బీమా పథకంలో ప్రస్తుత ఆర్థ్ధిక సంవత్సరానికి 438 ప్రతిపాదనలు రాగా రూ.21.70 కోట్లు మంజూరు అయ్యాయని అన్నారు. కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకుంటూ అండగా నిలుస్తుందని అన్నారు. వ్యవసాయ రంగానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తూ రైతులు ఆర్థికంగా ఎగిగేందుకు తోడ్పాటు అందిస్తుందని చెప్పారు.

రైతు వేదికల్లో రైతుల అనుమానాలను నివృత్తి చేసేందుకు ఏఈవోలు, శాస్త్రవేత్తలను అందుబాటులో ఉండేలా చూస్తామని తెలిపారు. అంతకు ముందు వానాకాలంలో పంట సాగుపై అవగాహన కల్పించేలా వ్యవసాయ శాఖ ముద్రించిన కర పత్రాలను మంత్రి, కలెక్టర్ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆవిష్కరించారు. యాద్గార్‌పల్లి క్లస్టర్ రైతువేదికలో రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి మేరిరేఖ, కీసర ఆర్డీవో రవి, జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ బెస్త వెంకటేష్, డీసీఎంఎస్ వైస్ ఛైర్మన్ మధుకర్‌రెడ్డి, ఎంపీపీ మల్లారపు ఇందిర లక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ జె.సత్తిరెడ్డి, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు పి.శ్రీనివాస్, పీఏసీఎస్ ఛైర్మన్ ఆర్.ప్రభాకర్‌రెడ్డి, నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల ఛైర్మన్లు కె.చంద్రారెడ్డి, వి.ప్రణీత, తహసీల్దార్ గౌరి వత్సల, మండల వ్యవసాయ అధికారి మాదవి, సర్పంచులు ఎన్.మాధురి, ఎ.మహేందర్‌రెడ్డి, కె.గోపాల్‌రెడ్డి, జి.ఆండాలు, ఎం.విమల, పి.రాజు, టి.ధర్మేందర్, పి.పెంటయ్య, ఎంపీటీసీలు టి.నారాయణశర్మ, జె.వెంకటేష్, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షులు జె.సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News